ఇదేనా తెలివి.. శ్రీభరత్‌ | Sakshi
Sakshi News home page

ఇదేనా తెలివి.. శ్రీభరత్‌

Published Fri, May 10 2024 6:05 PM

ఇదేనా తెలివి.. శ్రీభరత్‌

● ఎలక్షన్‌ కమిషన్‌ విశ్వసనీయతనే తప్పుపడుతున్న వైనం ● ఏయూలో ఈవీఎంలు భద్రపరచొద్దంటూ ఈసీకి లేఖ ● ఈవీఎంలు ట్యాంపర్‌ చేస్తారంటూ అర్థంపర్థంలేని ఆరోపణలు ● ఏ ఎన్నికలైనా ఈవీఎంలు ఏయూలోనే.. ● ఈవీఎంల రక్షణ వలయం గురించి తెలియకుండా అవాకులు

సాక్షి, విశాఖపట్నం : విద్యావంతుడినంటూ గొప్పలు చెప్పుకుంటున్న టీడీపీ విశాఖ ఎంపీ అభ్యర్థి శ్రీభరత్‌.. ఎన్నికల్లో గెలవలేనని తెలిసి రోజురోజుకీ దిగజారిపోతున్నారు. అక్రమాలకు కేరాఫ్‌గా మారిన దివంగత తాత అడుగు జాడల్లోనే నడుస్తూ.. తన సొంత వర్సిటీ కోసం దేవాలయంలాంటి ఆంధ్ర విశ్వవిద్యాలయంపై ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారు. దశాబ్దాలుగా జరుగుతున్న ఎన్నికలకు సంబంధించి ఓట్ల లెక్కింపునకు కేంద్రంగా మారిన ఏయూలో ఈవీఎంలు భద్రపరచొద్దంటూ ఎన్నికల కమిషన్‌కు లేఖ రాయడం అందరినీ ఆగ్రహానికి గురిచేస్తోంది. ఈవీఎంల రక్షణ వలయం గురించి తెలియకుండా నోటికొచ్చినట్లు మాట్లాడుతూ ఎన్నికల కమిషన్‌ విశ్వసనీయతనే తప్పుపడుతున్న ఆయన వైఖరిపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

ఏయూపై ఈసీకి లేఖతో కలకలం

తాజాగా రిటర్నింగ్‌ అధికారికి రాసిన ఒక లేఖ భరత్‌ బేలతనాన్ని, అవివేకాన్ని, తేటతెల్లం చేస్తుంది. భారత ఎన్నికల సంఘంపై కానీ, భారతదేశ ఎన్నికల ప్రక్రియపై కానీ భరత్‌కు ఎలాంటి నమ్మకం, విశ్వాసం లేదనే విషయం స్పష్టమవుతోంది. ఆంధ్ర యూనివర్సిటీలో ఈవీఎంలను భద్రపరిస్తే వాటిని ట్యాంపరింగ్‌ చేస్తారని, వైఎస్సార్‌సీపీకి అనుకూలంగా ఈవీఎంలను మార్పు చేసేస్తారంటూ ఏకంగా రిటర్నింగ్‌ అధికారికి లేఖ రాయడం కలకలం రేపుతోంది.

ఈ విషయం తెలుసా ?

అసలు పూర్వాపరాలేవీ తెలియకుండా ఇష్టంవచ్చినట్లు మాట్లాడటం భరత్‌కు వారసత్వంగా వచ్చినట్లుందని అందరూ నవ్వుతున్నారు. వాస్తవానికి ఈనెల 13న జరిగే ఎన్నికల తరువాత ఈవీఎంలను ఏయూలో భద్రపరచాలని ఎన్నికల అధికారులు నిర్ణయించారు. దీనికోసం ఏయూ ప్రాంగణాన్ని వారు తమ ఆధీనంలోకి తీసుకున్నారు. ఈవీఎంల భద్రపరిచే భవనంలోకి ఈగ కూడా చొరబడే వీలు లేకుండా అవసరమైన అన్ని చర్యలను దాదాపు నెల రోజుల నుంచి ఎన్నికల అధికారులు పకడ్బందీగా నిర్వహించారు. ప్రతి సార్వత్రిక ఎన్నికల్లో విశాఖ జిల్లాకు సంబంధించి బ్యాలెట్‌ బాక్సులు, ఈవీఎంలు ఏయూలోనే భద్రపరుస్తున్నారు. ఓట్ల లెక్కింపు ప్రక్రియ కూడా అక్కడే సజావుగా నిర్వహిస్తున్నారు. ఇన్ని దశాబ్దాలుగా ఎప్పుడూ ఏ ఒక్క ఓటు గానీ, ఈవీఎం, బ్యాలెట్‌ బాక్సు కానీ ట్యాంపరింగ్‌ జరగలేదు. అందుకే ఎన్నికల కమిషన్‌ ఎప్పుడూ ఏయూనే ఎంపిక చేస్తుందన్న విషయం తెలియకుండా చేసిన ఆరోపణలతో భరత్‌ ఎందుకిలా ప్రవర్తిస్తున్నారో అర్థం కావడం లేదన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

ఈసీపై విశ్వాసం లేదా..?

ఎన్నికల సంఘాన్ని దాని విశ్వసనీయతను దెబ్బతీసే విధంగా శ్రీ భరత్‌ లేఖ రాశారు. ఈవీఎంల భద్రతకు పటిష్టమైన రక్షణ వలయంలో చుట్టూ సీసీ కెమెరాల నిఘా కూడా ఉంటుంది. ఈవీఎంలు భద్రపరిచిన ప్రాంతం.. రాష్ట్ర ప్రభుత్వ ఆధీనంలో కానీ, రాష్ట్ర పోలీసు వ్యవస్థ ఆధీనంలో కానీ ఉండవు. కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలకు అనుగుణంగా, రాష్ట్ర ఎన్నికల సంఘం అధికారులు, రిటర్నింగ్‌ అధికారులు, ప్రత్యేక బలగాల ఆధ్వర్యంలో ఈవీఎంలను భద్రపరుస్తారు. వీటి జోలికి వెళ్లడం గానీ, వాటిని చూడడం కానీ, వాటిని ముట్టుకోవడం కానీ, వాటిని ట్యాంపరింగ్‌ చేయడం కానీ ఎవరి వల్ల సాధ్యం కాదు. ఇంత చిన్న విషయం కూడా తెలియకుండా.. ఎంపీ బరిలో రెండో సారి ఎలా పోటీ చేస్తున్నారంటూ విశాఖ వాసులు, విద్యావంతులు ఆశ్చర్యపోతున్నారు. ఇలాంటి వారికి ఓటేస్తే తమ ఓటు వృథాగా మారినట్లేనని భావిస్తున్నారు. భరత్‌ రాసిన లేఖపై టీడీపీ నాయకులే మండిపడుతున్నారు.

టీచర్లనీ మార్చేయ్యాలంట.?

ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్ని మారిస్తే సరిపోదు అక్కడ పనిచేస్తున్న ఉపాధ్యాయుల్ని కూడా మార్చేయాలి అని భరత్‌ వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో పనిచేస్తున్న టీచర్లందరినీ కించపరిచేవిధంగా మాట్లాడటం కూడా భరత్‌ దిగజారుడు తనానికి నిదర్శమని చెప్పవచ్చు. మరో విషయం ఏమిటంటే.. గీతం విద్యా సంస్థల్లో పనిచేస్తున్న ఆచార్యులను భరత్‌ బలవంతంగా భీమిలి, విశాఖ తూర్పు, గాజువాక నియోజకవర్గాల్లో ఇంటింటికీ వెళ్లి ప్రచారం చేయాలంటూ హుకుం జారీ చేశారు. దీంతో పాఠాలు చెప్పుకునే మమ్మల్ని ఇలా ప్రచారానికి తిప్పడంపై వారంతా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Advertisement
 
Advertisement