నేడే అప్పన్న తెప్పోత్సవం
● విజయవంతంగా ట్రయల్‌రన్ ● ముస్తాబైన వరాహ పుష్కరిణి
సింహాచలం: పుష్య బహుళ అమావాస్య సందర్భంగా శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామి తెప్పోత్సవం(నౌకావిహారం) బుధవారం సాయంత్రం వరాహ పుష్కరిణిలో జరగనుంది. హంసాకారంలో రూపొందించిన తెప్పపై స్వామివారు శ్రీదేవి, భూదేవి సమేతంగా నౌకా విహారం చేయనున్నారు. ఈ మేరకు విశాఖ ఫిషరీస్ డెవలప్మెంట్ అధికారి ఆశాజ్యోతి ఆధ్వర్యంలో మంగళవారం సాయంత్రం ట్రయల్‌రన్ నిర్వహించారు. తెప్ప తీర్చిదిద్దిన తీరు, సామర్థ్యాన్ని పరిశీలించారు. ట్రయల్ రన్లో దేవస్థానం ఈఈ రాంబాబు, ఏఈ తాతాజీ పాల్గొన్నారు.
విశేషంగా ఏర్పాట్లు
తెప్పోత్సవ ఏర్పాట్లను దేవస్థానం ఈవో వి.త్రినాథరావు ఆధ్వర్యంలో ఇంజినీరింగ్ అధికారులు పర్యవేక్షిస్తున్నారు. హంసాకార తెప్పను పూలు, విద్యుద్దీపాలతో అలంకరిస్తున్నారు. పుష్కరిణి నలువైపులా విద్యుద్దీపకాంతులు ఏర్పాటు చేస్తున్నారు. పుష్కరిణి మధ్యలో స్వామి పూజలందుకునే మండపాన్ని తీర్చిదిద్దారు. పుష్కరిణి గట్టుపై సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నారు. పుష్కరిణి వద్ద 15 మంది గజ ఈతగాళ్లను, రెండు అదనపు బోట్లను, 15 లైఫ్ జాకెట్లను అందుబాటులో ఉంచనున్నట్లు ఆలయ ఈఈ రాంబాబు తెలిపారు. 35 మంది పోలీసులతో బందోబస్తు నిర్వహిస్తున్నట్లు గోపాలపట్నం సీఐ గొలగాని అప్పారావు తెలిపారు.
వేణుగోపాల స్వామి అలంకరణలో..
తెప్పోత్సవంలో భాగంగా శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామి ఉత్సవమూర్తి గోవిందరాజస్వామికి వేణుగోపాలస్వామి అలంకరణ చేసి శ్రీదేవి, భూదేవి సమేతంగా మెట్లమార్గంలో తీసుకొస్తారు. పుష్కరిణి వద్ద హంస వాహనంపై స్వామిని వేంజేపచేసి సాయంత్రం 5 గంటల నుంచి తెప్పోత్సవాన్ని నిర్వహిస్తారు. అనంతరం స్వామిని మండపంలో కొలువుంచి షోడషోపచార పూజలు నిర్వహిస్తారు. పుష్కరిణి సత్రం వద్దకు చేర్చి, సర్వజనమనోరంజని వాహనంపై రాత్రి అడవివరం గ్రామంలో తిరువీధి నిర్వహిస్తారు. అనంతరం స్వామిని తిరిగి సింహగిరికి చేరుస్తారు.
Comments
Please login to add a commentAdd a comment