కాలుష్యకారక పరిశ్రమలపై చర్యలేవీ? | - | Sakshi
Sakshi News home page

కాలుష్యకారక పరిశ్రమలపై చర్యలేవీ?

Published Fri, Jan 31 2025 12:43 AM | Last Updated on Fri, Jan 31 2025 12:43 AM

కాలుష్యకారక పరిశ్రమలపై చర్యలేవీ?

కాలుష్యకారక పరిశ్రమలపై చర్యలేవీ?

సీతంపేట: నీటి వనరులు, సముద్ర తీరప్రాంత కాలుష్యానికి కారణం అవుతున్న పరిశ్రమలపై ప్రభుత్వం ఎందుకు చర్యలు చేపట్టడం లేదని వాటర్‌ మ్యాన్‌ ఆఫ్‌ ఇండియా డాక్టర్‌ రాజేంద్రసింగ్‌ ప్రశ్నించారు. విశాఖ జిల్లాలో హెటిరో, అచ్యుతాపురం సెజ్‌, రాంకీ, దివీస్‌ పరిశ్రమలు సముద్రంలోకి విడుదల చేస్తున్న వ్యర్థాల వల్ల ఏర్పడిన కాలుష్యం, జీవనోపాధి కోల్పోయిన మత్స్యకార గ్రామాలను సందర్శించి క్షేత్ర స్థాయి పరిస్థితిని ద్వారకానగర్‌ పౌరగ్రంథాలయంలో గురువారం నిర్వహించిన మీడియా సమావేశంలో వివరించారు. సుమారు వెయ్యి కిలోమీటర్ల సుదీర్ఘ తీరప్రాంతం ఉన్న ఆంధ్రప్రదేశ్‌లో పరిశ్రమల కాలుష్యం వల్ల 2 లక్షల మత్స్యకార కుటుంబాలు జీవనోపాధి కోల్పోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. పాయకరావుపేట, అనకాపల్లి, భీమిలి, విశాఖ తూర్పు, దక్షిణ నియోజకవర్గాల పరిధిలో ఉన్న సముద్ర తీర ప్రాంతాన్ని, నీటి వనరులను సందర్శించి అక్కడి కాలుష్య వాతావరణాన్ని పరిశీలించి, మత్స్యకారుల సమస్యలు అడిగి తెలుసుకున్నట్లు పేర్కొన్నారు. తీరప్రాంతంలో ఉన్న పరిశ్రమల వల్ల వచ్చే వ్యర్థాలు సముద్రంలో కలిసి, మత్స్యసంపదకు నష్టం కలిగిస్తున్నాయన్నారు. కాలుష్యం వల్లే తాబేళ్లు పెద్ద సంఖ్యలో మృత్యువాత పడుతున్నట్టు గుర్తించామన్నారు. దీనిపై కాలుష్య నియంత్రణ మండలి చర్యలు చేపట్టాలని గతంలోనే సూచించినా.. నెలలు గడుస్తున్నా ఇప్పటికీ ఎటువంటి చర్యలు చేపట్టలేదని ఆక్షేపించారు. లాసన్స్‌ బే కాలనీ వద్ద పెద్ద ఎత్తున మురుగునీరు డ్రెయిన్‌ ద్వారా సముద్రంలో కలుస్తోందని, ముడసర్లోవ డంపింగ్‌యార్డ్‌ నుంచి వస్తున్న మురుగు నీరు ముడసర్లోవ డ్యామ్‌లో కలుస్తోందని, ఈ విషయంలో జీవీఎంసీపై కోర్టులో కేసు వేసినట్లు పేర్కొన్నారు. ఇప్పటి వరకు ఎటువంటి పరిరక్షణ చర్యలు చేపట్టలేదన్నారు. ప్రజలు చైతన్యవంతులై నీటి వనరులు, సముద్రతీర ప్రాంత పరిరక్షణకు ముందుకు రావాలన్నారు. మీడియా కూడా తీరప్రాంత పరిరక్షణపై దృష్టి సారించాలన్నారు. సమావేశంలో జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి బొలిశెట్టి సత్యనారాయణ, మత్స్యకార నాయకులు ఆదినారాయణ, బాబ్జి, డాక్టర్‌ కిరణ్‌, శంకు వెంకటేశ్వరరావు పాల్గొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement