కొరియర్ పేరిట వచ్చే కాల్స్‌పై తస్మాత్.. : ఎస్పీ
విజయనగరం క్రైమ్: ఇంటర్నేషనల్ కొరియర్ స్కామ్‌పై వచ్చే ఫోన్ కాల్స్ పట్ల ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని కోరుతూ జిల్లా పోలీసు శాఖ ప్రత్యేకంగా రూపొందించిన పోస్టర్లు, వీడియోను ఎస్పీ వకుల్ జిందల్ శనివారం జిల్లా పోలీసు కార్యాలయంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇంటర్నేషనల్ కొరియర్ పేరుతో సైబర్ మోసగాళ్లు ప్రజలకు ఫోన్ కాల్స్, వీడియో కాల్స్ చేసి, మోసాలకు పాల్పడుతున్నారని, ఇటువంటి వారిపట్ల ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని పిలుపునిచ్చారు. ఈ తరహా కాల్స్, వాట్సాప్ కాల్స్, వీడియో కాల్స్ లింక్స్‌తో సైబర్ మోసగాళ్లు ప్రజలకు ఉచ్చు వేస్తూ, వారిని భయపెట్టి, డబ్బులు వసూలు చేస్తున్నారన్నారు. సైబర్ మోసగాళ్లు ప్రజల మొబైల్స్‌కు ఫోన్ చేసి, తాము ఇంటర్నేషనల్ కొరియర్స్ నుంచి మాట్లాడుతున్నామని, మన చిరునామా, ఆధార్ నెంబర్ , ఫోన్ నెంబర్ వంటి కొంత సమాచారాన్ని ముందుగా మనకు తెలిపి, మన పేరుతో బుక్ చేసిన కొరియర్ పార్సిల్స్‌లో నిషేధిత మాదక ద్రవ్యాలు, అక్రమ వస్తువులు, ఫేక్ పాస్‌పోర్టు, బంగారం బిస్కెట్లు వంటివి ఉన్నాయని గుర్తించినట్లు తెలిపారు. మాదక ద్రవ్యాలను ఇతర దేశాలకు పంపిస్తున్నారని నిర్ధారణ అయిందని, కేసు కూడా నమోదైందని, విచారణ నిమిత్తం తాము సూచించిన సుదూర ప్రాంతానికి దర్యాప్తు నిమిత్తం రావాల్సి ఉంటుందని భయబ్రాంతులకు గురి చేస్తారన్నారు. సైబర్ నేరగాళ్లు పంపిన లింక్‌ను క్లిక్ చేస్తే, తమ బ్యాంక్ సేవింగ్ ఖాతాల్లోని నగదు చోరీకి గురవుతుందన్నారు. కావున ప్రజలందరూ ఇటువంటి సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ సూచించారు. ఇంటర్నేషనల్ కొరియర్స్, ఫెడెక్స్, బ్లూడాట్ వంటి కొరియర్ సర్వీసులు, డిజిటల్ అరెస్ట్, బిట్ కాయిన్ పేరుతో వచ్చే నకిలీ కాల్స్‌ను, వీడియో కాల్స్‌ను నమ్మి, సైబర్ మోసాలకు గురికావద్దన్నారు. ఈ తరహా మోసగాళ్ల కాల్స్‌కు భయపడాల్సిన పనిలేదని, ప్రజలెవ్వరూ స్పందించవద్దని ఆయా నెంబర్ నుంచి వచ్చే కాల్స్‌ను బ్లాక్ చేసి సమాచారాన్ని స్దానిక పోలీసుస్టేషన్‌కి అందించాలన్నారు. ఈ తరహా నేరాల్లో ఎవరైనా నగదును పోగొట్టుకున్నట్లయితే 1930కి లేదా నేషనల్ క్రైమ్ పోర్టల్‌లో రిపోర్టు చేయాలన్నారు. ప్రజలను అప్రమత్తం చేసే విధంగా వీడియో రూపకల్పన చేసిన టూటౌన్ సీఐ టి.శ్రీనివాసరావు, వీడియోగ్రాఫర్ జి.జగదీష్‌ను ఎస్పీ ప్రత్యేకంగా అభినందించి, ప్రశంసపత్రాలను, జ్ఞాపికలను అందజేశారు. జిల్లా అదనపు ఎస్పీ పి.సౌమ్యలత, ఎస్‌బీ సీఐ ఎవి.లీలారావు, టివిఆర్‌కె.చౌదరి, టూటౌన్ సీఐ శ్రీనివాసరావు, సాంకేతిక సహాయాన్ని అందించిన బ్లర్ ఫొటో స్టూడియో వీడియోగ్రాఫర్ జి.జగదీష్, ఇతర పోలీస్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment