మహబూబ్‌నగర్: ఎన్నికలకు ఇంకా మూడు నెలల సమయం ఉండగా.. ఉమ్మడి పాలమూరులో అప్పుడే వేడి రాజుకుంది. అధికార బీఆర్‌ఎస్‌లో అసెంబ్లీ అభ్యర్థులు ఖరారు కాగా.. ఒకటి, రెండు నియోజకవర్గాల్లో అంతర్గత పోరుతో అసంతృప్తి జ్వాలలు ఎగసిపడుతున్నాయి. కాంగ్రెస్‌లో టికెట్లకు దరఖాస్తు ప్రక్రియ ముగియగా.. ఇంకా ఖరారు కాలేదు. అయినప్పటికీ ఆ పార్టీలో పలు సెగ్మెంట్లలో నువ్వా.. నేనా అన్నట్లు అభ్యర్థిత్వాల లొల్లి తారస్థాయిలో కొనసాగుతోంది.
మరోవైపు గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి ఎన్నిక చెల్లదంటూ హైకోర్టు తీర్పు వెల్లడించిన నేపథ్యంలో నడిగడ్డలో రాజకీయాలు మరింత హీటెక్కాయి. డీకే వర్సెస్ బండ్ల వర్గీయుల మధ్య ఢీ అంటే ఢీ అనేలా మాటల యుద్ధం నడుస్తోంది. ఇలా మారుతున్న రాజకీయ పరిణామాలు ఎటువైపు దారి తీస్తాయోననే ఆందోళన ఆయా పార్టీల అధిష్టానాలను కలవరపెడుతుండగా.. శ్రేణుల్లో ఆందోళన నెలకొంది.
బీఆర్‌ఎస్‌లో అభ్యర్థుల ఖరారు తర్వాత అభివృద్ధి పనులు, సంక్షేమ కార్యక్రమాలు, ఆత్మీయ సమ్మేళనాలతో ఆయా నేతలు నిత్యం ప్రజాక్షేత్రంలోనే ఉంటూ ప్రచారం మొదలుపెట్టారు. కాంగ్రెస్‌లో టికెట్ల ఖరారు ప్రక్రియ కొనసాగుతుండగా.. పోటీపడుతున్న ఆశావహులు తమ తమ అనుచరులు, కార్యకర్తలతో నియోజకవర్గాల్లో సందడి చేస్తున్నారు. తిరగబడదాం.. తరిమికొడదాం కార్యక్రమంలో పాలుపంచుకుంటున్నారు.
అయితే బీజేపీలో అభ్యర్థిత్వాల ఖరారుపై ఎలాంటి సన్నాహకాలు ప్రారంభం కాకపోవడంతో పార్టీ కార్యకర్తల్లో నిరుత్సాహం అలుముకుంది. ఎమ్మెల్యే ప్రవాస్ యోజనలో భాగంగా పార్టీకి చెందిన ఇతర రాష్ట్రాల నేతలు ఉమ్మడి జిల్లాలో పర్యటిస్తూ ప్రజల సమస్యలు తెలుసుకోవడంతోపాటు కేంద్రం అమలు చేస్తున్న పథకాలపై అవగాహన కల్పిస్తున్నారు. ఇదీ తూతూమంత్రంగానే జరుగుతుండగా.. ఎన్నికల వేడి రాజుకున్న క్రమంలో పార్టీలో స్తబ్దత నెలకొనడంపై కమలం శ్రేణుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది.
కల్వకుర్తిలో అసమ్మతి సెగలు..
ఉమ్మడి పాలమూరు జిల్లాలో 14 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. బీఆర్‌ఎస్‌కు సంబంధించి అన్ని స్థానాల్లోనూ సిట్టింగ్ ఎమ్మెల్యేలను అభ్యర్థులుగా ప్రకటిస్తూ ఆ పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ ఈ నెల 21న జాబితా విడుదల చేశారు. అయితే ఆ రోజే అలంపూర్‌కు సంబంధించి అభ్యర్థిని మార్చాలని కోరుతూ క్యాతూర్ సింగిల్ విండో చైర్మన్ రాఘవరెడ్డి లేఖ రాశారు. ఆ తర్వాత నిన్న, మొన్నటి వరకు ఆ నియోజకవర్గంతోపాటు మిగతా సెగ్మెంట్లలో వాతావరణం అంతా స్తబ్దుగానే ఉంది.
కానీ.. కల్వకుర్తిలో ఒక్కసారిగా అసమ్మతి సెగలు భగ్గుమంటున్నాయి. ఎమ్మెల్యే జైపాల్‌యాదవ్ అభ్యర్థిత్వాన్ని మార్చాలని డిమాండ్ చేస్తూ శనివారం మాడ్గులలో, ఆదివారం కడ్తాల్‌లో నాగర్‌కర్నూల్ జెడ్పీ వైస్‌చైర్మన్ బాలాజీసింగ్ ఆధ్వర్యంలో ఎక్కడికక్కడ అసమ్మతి నాయకులు సమావేశాలు ఏర్పాటు చేయడమే ఇందుకు నిదర్శనంగా నిలుస్తోంది.
‘ప్రజలు ఎవరు కోరుకుంటే వాళ్లు ఎమ్మెల్యే అయితరు.. ప్రజలు కోరుకోని వారిని బలవంతంగా రుద్దితే ఉద్యమం వస్తుంది.. ఎవరిని సంప్రదించకుండా ఏకపక్షంగా టికెట్ ఖరారు చేశారు.. ప్రజల అభిమానం కోల్పోయిన నాయకులు గెలవలేరు. కల్వకుర్తి ప్రజల ఆకాంక్షను పరిగణలోకి తీసుకోవాలి. ఎమ్మెల్యే అభ్యర్థిత్వంపై పార్టీ అధిష్టానం పునరాలోచన చేయాలి’ అని బాలాజీసింగ్ అసమ్మతి నేతల సమావేశంలో విలేకరులతో మాట్లాడడం హాట్‌టాపిక్‌గా మారింది. నియోజకవర్గంలో ఆరు మండలాలు ఉండగా.. రోజుకో మండలంలో అసమ్మతి నాయకులు సమావేశాలు ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది.
గద్వాలలో మాటల యుద్ధం..
బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి, డీకే అరుణ పోటాపోటీగా విమర్శలు చేసుకున్నారు. వారి వారి కుటుంబ సభ్యులు సైతం విలేకరుల సమావేశాలు నిర్వహించి దుమ్మెత్తి పోసుకోవడం గద్వాలలో హాట్‌టాపిక్‌గా మారింది. బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి భార్య జ్యోతి ఇలా వేధించడం కన్నా విషమిచ్చి చంపాలని అనగా.. మరుసటి రోజు డీకే అరుణ కుమార్తె స్నిగ్ధారెడ్డి మాట్లాడుతూ ఈ మొసలి కన్నీరు ఇంకెంత కాలం.. కన్న కొడుకులా ఆదరిస్తే వెన్నుపోటు పొడిచిన వ్యక్తి కృష్ణమోహన్‌రెడ్డి అంటూ ధీటుగా సమాధానమివ్వడం చర్చనీయాంశంగా మారింది.
Comments
Please login to add a commentAdd a comment