వరంగల్ క్రైం: రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన బదిలీల్లో భాగంగా వరంగల్ పోలీస్ కమిషనర్ ఏవీ రంగనాథ్ బదిలీ అయ్యారు. ఈ మేరకు ఎన్నికల కమిషన్ బుధవారం రాత్రి ఉత్తర్వులు జారీ చేసింది. వరంగల్ పోలీస్ కమిషనరేట్‌లో క్రైం డీసీపీగా పనిచేస్తున్న ఐపీఎస్ అధికారి దాసరి మురళీధర్‌ను ఇన్‌చార్జ్ సీపీగా నియమించారు. గురువారం సీపీ రంగనాథ్ నుంచి దాసరి మురళీధర్ బాధ్యతలు స్వీకరించనున్నారు.
ఏవీ రంగనాథ్ వరంగల్ పోలీస్ కమిషనర్‌గా 2022 డిసెంబర్ 3న బాధ్యతలు స్వీకరించారు. మొదటి రోజునుంచే అనేక అంశాలపై ప్రత్యేక దృష్టి సారించారు. గతంలో ఎన్నడూ లేనివిధంగా ప్రజలు, బాధితుల నుంచి నేరుగా ఫిర్యాదులు స్వీకరించి వాటి పరిష్కారం కోసం ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేశారు. ప్రజా సమస్యల పరిష్కారంతోపాటు క్షేత్రస్థాయిలో ఉన్న అనేక సమస్యలను స్వయంగా పరిశీలన చేసి సంబంధిత అధికారులకు పరిష్కార మార్గాలను చూపించారు. తక్కువ కాలంలోనే ప్రజల మన్ననలతోపాటు రాష్ట్రవ్యాప్తంగా పేరు తెచ్చుకున్నారు.
భూకబ్జాదారుల గుండెల్లో రైళ్లు..
సామాన్యుల భూములను ఆక్రమించి వ్యాపారం చేసే భూకబ్జాదారుల గుండెల్లో సీపీ రంగనాథ్ రైళ్లు పరిగెత్తించారు. సుమారు 2,500కు పైగా ఫిర్యాదులను బాధితులు, ప్రజలు స్వయంగా సీపీకి అందజేశారు. ఆ ఫిర్యాదులను సీపీ.. సంబంధిత ఎస్‌హెచ్‌ఓలతోపాటు ఏసీపీ, డీసీపీ, టాస్క్‌ఫోర్స్, ఎస్‌బీ విభాగాల ద్వారా విచారణ చేయించి బాధితులకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకున్నారు. ఈ క్రమంలో అన్ని పార్టీలకు చెందిన ప్రజాప్రతినిధులను అరెస్టు చేసి జైలుకు పంపించారు. దీంతో భూకబ్జాలకు పాల్పడుతున్న వారు చాలామంది వెనక్కి తగ్గారు. ప్రతి పోలీస్‌స్టేషన్ పరిధిలో అధికా రులు సమస్యాత్మక విషయాల్లో రెండు వర్గాలను సీపీ దగ్గర ప్రవేశపెట్టడంతో స్వయంగా పరిష్కార మార్గాలను చూపెట్టారు. మొదట్లో చాలామంది ప్రజలు సీపీ ఫొటోలకు పాలాభిషేకాలు నిర్వహించి కొత్త ఒరవడికి నాంది పలికారు.
10 నెలలు.. 24 మందిపై సస్పెన్షన్
వరంగల్ పోలీస్ కమిషనర్‌గా పనిచేసిన 10 నెలల సమయంలో నిబంధనలకు విరుద్ధంగా నడుచుకున్న 24 మంది పోలీస్ అధికారులపై సీపీ రంగనాఽథ్ సస్పెన్షన్ వేటు వేశారు. భూకబ్జాదారులకు సహకరించి నిబంధనలకు విరుద్ధంగా నడుచుకున్న పోలీస్ అధికారులను హెచ్చరించారు. పద్ధతి మార్చుకోని వారిపై చర్యలు తీసుకున్నట్లు సమాచారం. కమిషనరేట్‌లో ఏడుగురు ఇన్‌స్పెక్టర్లు, ఒక ఆర్‌ఐ, ఏడుగురు సబ్ ఇన్‌స్పెక్టర్లు, ఒక ఏఎస్సై, ఇద్దరు హెడ్ కానిస్టేబుళ్లు, నలుగురు కానిస్టేబుళ్లు, ఇద్దరు హోంగార్డులపై సస్పెన్షన్ వేటు వేశారు. దీంతో పాటు పలువురిని క్రమశిక్షణ చర్యల్లో భాగంగా ఏఆర్‌కు అటాచ్డ్ చేశారు.
చిట్‌ఫండ్ యాజమాన్యాలపై కొరడా...
రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా మోసాలకు పాల్పడిన చిట్‌ఫండ్ యాజమాన్యాలపై కఠిన చర్యలు తీసుకున్నారు. సామాన్యులను మోసం చేసి సకాలంలో చెల్లింపులు చేయకుండా డబ్బులు ఎగ్గొట్టి ఇబ్బందులకు గురిచేసిన చిట్‌ఫండ్ యాజమాన్యాలపై కేసులు నమోదు చేసి జైలుకు పంపించారు. కమిషనరేట్‌లో పలుమార్లు సమావేశాలు నిర్వహించి ప్రతి నెల చిట్టి డబ్బులను చెల్లించేలా ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేశారు. దీని పర్యవేక్షణ కోసం డీసీపీ స్థాయి అధికారిని నియమించారు. సుమారు రూ.200 కోట్లకు పైగా యజామాన్యాల ముక్కుపిండి చెల్లింపులు చేయించారు. ప్రతి శుక్రవారం చిట్స్‌ఫండ్ యాజమాన్యాలు ఎంతెంత చెల్లించాయో వివరాలు తెలిపేలా ప్రత్యేకంగా వ్యవస్థను సిద్ధం చేయించారు.
బండి సంజయ్ ఫిర్యాదుతోనేనా?
రాష్త్రంలో పలువురు అధికారుల బదిలీ ఎలక్షన్ కమిషన్ చేసినప్పటికి వరంగల్ పోలీస్ కమిషనర్ ఏవీ రంగనాఽథ్ బదిలీ వెనక బీజేపీ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు బండి సంజయ్ ఉన్నట్లు పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. పదో తరగతి ప్రశ్నపత్రం లీకేజీ వ్యవహారంలో తన పాత్ర లేకున్నా అక్రమంగా అరెస్టు చేసి జైలుకు పంపించారనే కోపంతో బండి సంజయ్ సీపీ బదిలీ కోసం కేంద్రంతో పట్టుబట్టినట్లు ప్రచారం సాగుతోంది. ఇటీవల ఎలక్షన్ కమిషన్ రాష్ట్రంలో పర్యటించిన సమయంలో బండి సంజయ్.. సీపీ రంగనాథ్‌పై ఫిర్యాదు చేసినట్లు సమాచారం.
సీపీ వెంట మరికొంత మంది అధికారులు..?
ఎన్నికల నిబంధనలకు విరుద్ధంగా కమిషనరేట్‌లో పనిచేస్తున్న కొంతమంది అధికారులపై కూడా బదిలీ వేటు పడే అవకాశం ఉందని పోలీస్ శాఖలో పలువురు చర్చించుకుంటున్నారు. గతంలో కొంత మంది అధికారులపై కొందరు ఎలక్షన్ కమిషన్‌కు ఫిర్యాదు చేసిన విషయం విదితమే. ఆ అధికారులపై ఈ సమయంలో వేటు పడే అవకాశం ఉందనే సమాచారం. 21 మంది అధికారులపై వచ్చిన అభియోగాలపై సీపీ రంగనాఽథ్ గతంలో ఎన్నికల కమిషన్‌కు వివరణ ఇచ్చారు. పాలనపై ప్రత్యేక ముద్ర వేసిన సీపీ రంగనాఽథ్ బదిలీ వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిదిలో సంచలనంగా మారింది.
Comments
Please login to add a commentAdd a comment