వరంగల్ క్రైం: వరంగల్ పోలీస్ కమిషనరేట్ నూతన కమిషనర్‌గా అంబర్ కిషోర్ ఝా శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. మొదట పోలీస్ గెస్ట్‌హౌస్‌కు చేరుకొని సాయుధ పోలీసుల వందనం స్వీకరించారు. అనంతరం పోలీస్ కమిషనరేట్ కార్యాలయానికి చేరుకొని ఇన్‌చార్జ్ కమిషనర్‌గా ఉన్న క్రైం డీసీపీ దాసరి మురళీధర్ నుంచి బాధ్యతలు స్వీకరించారు. ఈసందర్భగా మురళీధర్‌తోపాటు కమిషనరేట్ అధికారులు నూతన కమిషనర్ అంబర్ కిషోర్ ఝాకు పుష్పగుచ్ఛాలు అందజేసి అభినందనలు తెలిపారు.
2009వ ఐపీఎస్ బ్యాచ్‌కు చెందిన అంబర్ కిషోర్ ఝా మొదటగా ఉమ్మడి ఆదిలాబాద్ ఎస్పీగా, 2012లో వరంగల్ ఓఎస్‌డీ, అదనపు ఎస్పీగా, 2014లో వరంగల్ ఎస్పీగా పని చేశారు. తెలంగాణ ఏర్పాటు అనంతరం భద్రాద్రి కొత్తగూడెం తొలి ఎస్పీగా బాధ్యతలు చేపట్టారు. 2018లో హైదరాబాద్ సౌత్ జోన్ డీసీపీగా, ఇదే సంవత్సరంలో కేంద్ర సర్వీసులో విధులు నిర్వర్తించారు.
ఈఏడాది ఫిబ్రవరిలో డీఐజీగా పదోన్నతి పొందిన ఆయన ఇటీవల రాచకొండ కమిషనరేట్ జాయింట్ సీపీగా నియమితులయ్యారు. ఇప్పుడు వరంగల్ సీపీగా వచ్చారు. సీపీని కలిసిన వారిలో డీసీపీలు అబ్దుల్ బారి, సీతారాం, అదనపు డీసీపీలు, ఏసీపీలు, ఇన్‌స్పెక్టర్లు, ఆర్‌ఐలు, సిబ్బంది ఉన్నారు. రాత్రి సీపీ అంబర్‌కిషోర్ ఝా భద్రకాళి దేవాలయాన్ని సందర్శించి అమ్మవారికి పూజలు చేశారు. అర్చకులు తీర్థప్రసాదాలు, శేషవస్త్రాలతో సత్కరించి మహాదాశీర్వచనం అందజేశారు.
వరంగల్ ప్రజలతో సింక్ అయ్యా: సీపీ రంగనాథ్
నయీంనగర్: తాను వరంగల్ ప్రజలతో సింక్ అయ్యానని, ఎంతో అనుబంధం ఏర్పడిందని బదిలీపై వెళ్తున్న సీపీ రంగనాథ్ అన్నారు. శుక్రవారం గ్రేటర్ వరంగల్ ప్రెస్‌క్లబ్‌లో రంగనాథ్‌కు వీడ్కోలు కార్యక్రమం నిర్వహించారు. ఈసందర్భంగా సీపీ రంగనాథ్ మాట్లాడుతూ.. ప్రభుత్వ ఉద్యోగులకు బదిలీలు సాధారణమని, వరంగల్ ప్రజలతో, మీడియాతో చాలా సింక్ అయ్యానని తెలిపారు. ఇక్కడ చాలా సమస్యలున్నాయని, వాటి పరిష్కారంలో తాను ప్రజలకు దగ్గరయ్యానన్నారు. పేదలకు, బాధితులకు అండగా నిలవాలనే ఐడియాలజీతో తాను పనిచేస్తానని, బలహీనంగా ఉన్న వాడిని బలవంతుడి నుంచి కాపాడాల్సిన బాధ్యత పోలీసులపై ఉంటుందన్నారు.
లా అండ్ ఆర్డర్ సరిగా ఉంటే ప్రజలు సురక్షితంగా ఉంటారన్నారు. తనకు మళ్లీ అవకాశం వస్తే ఇక్కడ పనిచేయాలనుందని, నగర ప్రజలు మంచివారన్నారు. క్లబ్ అధ్యక్షుడు వేముల నాగరాజు మాట్లాడుతూ.. అందరితో కలివిడిగా ఉండే సీపీ రంగనాథ్ బదిలీ కావడం కొంత బాధగా ఉందన్నారు. కార్యక్రమంలో క్రైం డీసీపీ దాసరి మురళీధర్, ఏసీపీ కిరణ్‌కుమార్, ప్రెస్ క్లబ్ ప్రధాన కార్యదర్శి బొల్లారపు సదయ్య, కోశాధికారి బొల్ల అమర్, క్లబ్ కార్యవర్గంతోపాటు జర్నలిస్టు సంఘాల నేతలు దాసరి కృష్ణారెడ్డి, బీఆర్ లెనిన్, గాడిపల్లి మధు, తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment