తలసేమియా యూనిట్‌కు స్థల పరిశీలన
ఎంజీఎం: కేఎంసీ పీఎంఎస్‌ఎస్‌వై విభాగంలోని తలసేమియా యూనిట్ ఏర్పాటుకు స్థలాన్ని కేఎంసీ ప్రిన్సిపాల్ కె.రాంకుమార్‌రెడ్డి, ఎంజీఎం సూపరింటెండెంట్ మురళి, జిల్లా ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ వేణుగోపాల్‌తో కలిసి డీఎంహెచ్‌ఓ అప్పయ్య గురువారం పరిశీలించారు. కమిషనర్ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ ఆదేశాల మేరకు ఫుడ్ సేఫ్టీ ల్యాబోరేటరీ కోసం వరంగల్ కేఎంసీలో ప్రస్తుతం ఉన్న భవనాల్లో స్థల పరిశీలన చేసి పూర్తి నివేదికను కలెక్టర్‌కు అందించనున్నట్లు తెలిపారు.
సర్వేకు సహకరించాలి:
ఎమ్మెల్యే నాయిని
కాజీపేట: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కుల గణన సర్వేకు ప్రజలు సహకరించాలని పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డి కోరారు. కాజీపేటలో గురువారం కలెక్టర్ పి.ప్రావీణ్యతో కలిసి సర్వేపై ఎన్యుమరేటర్లకు అవగాహన సదస్సు ప్రారంభించారు. ఈసందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. పశ్చిమ నియోజకవర్గంలో 2011 జనాభా లెక్కల ప్రకారం.. 72,500 కుటుంబాలకు 527 మంది సర్వే అధికారులు, 31 మంది సూపర్‌వైజర్లను నియమించినట్లు తెలిపారు. సర్వేను వేగవంతం చేయాలన్నారు. సమావేశంలో మేయర్ గుండు సుధారాణి, నగర కమిషనర్ అశ్విని తానాజీ వాకడే, కార్పొరేటర్లు జక్కుల రవీందర్ యాదవ్, విజయశ్రీ రజాలి, మామిండ్ల రాజు, డిప్యూటీ కమిషనర్ గోడిశాల రవీందర్, తహసీల్దార్ భావుసింగ్, నాయకులు సుంచు అశోక్, గుంటి కుమారస్వామి, ఎండీ అంకూస్, సిరిల్ లారెన్స్, భరత్, ఇప్ప శ్రీకాంత్, షేక్ ఆస్గర్ పాల్గ్గొన్నారు.
నేటి నుంచి టెక్నోజియాన్
కాజీపేట అర్బన్: నిట్‌లో టెక్నోజియాన్–24 వేడుకలు శుక్రవారం సాయంత్రం అట్టహాసంగా ప్రారంభం కానున్నాయి. నిట్ డైరెక్టర్ బిద్యాధర్ సుబుదీ వేడుకల్ని లాంఛనంగా ప్రారంభించనున్నారు. మూడు రోజుల పాటు కొనసాగే ఈ వేడుకల్లో పాల్గొనేందుకు ఇప్పటికే దేశవ్యాప్తంగా పలు ఇంజనీరింగ్ కళాశాలల విద్యార్థులు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. సుమా రు 6 వేల మంది పాల్గొనే అవకాశం ఉంది.
శిక్షణతో నైపుణ్యం
పెరుగుతుంది..
ఎంజీఎం: ఆన్ జాబ్ ట్రైనింగ్‌తో ఒకేషనల్ విద్యార్థుల్లో వృత్తి నైపుణ్యం పెరుగుతుందని వరంగల్ జిల్లా ఇంటర్మీడియట్ విద్యాధికారి డాక్టర్ శ్రీధర్ సుమన్ అన్నారు. ఇంటర్ బోర్డు ఆదేశాల మేరకు రెండు నెలల పాటు ఒకేషనల్ విద్యార్థులు తప్పనిసరిగా వృత్యంతర శిక్షణ పొందాలని సూచించారు. గురువారం వరంగల్ నగరంలోని పలు ఒకేషనల్ కళాశాల విద్యార్థుల శిక్షణ కేంద్రాలను ఆయన సందర్శించారు. సీకేఎం ఆస్పత్రిలో శిక్షణ పొందుతున్న విద్యార్థుల హాజరు, శిక్షణ పద్ధతులను పరిశీలించారు. అధ్యాపకులు, విద్యార్థులకు పలు సూచనలిచ్చారు. ఈసందర్భంగా డీఐఈఓ శ్రీధర్ సుమన్ మాట్లాడుతూ.. విద్యార్థులు వృత్యంతర శిక్షణలో తప్పక 90 శాతం హాజరు కలిగి ఉండేలా సంబంధిత అధ్యాపకులు తగు ప్రణాళిక రూపొందించాలన్నారు.
ఆర్టీసీ భారీ ఆఫర్
కాజీపేట అర్బన్: పెళ్లిళ్లకు, దైవ దర్శనాలకు, తీర్థ విహార యాత్రలకు వెళ్లడానికి బుక్ చేసుకునే టీజీఎస్ ఆర్టీసీ స్పెషల్ హైర్ బస్సులపై 15 నుంచి 20 ఽశాతం ధరల తగ్గింపు అవకాశం కల్పిస్తున్నట్లు వరంగల్–1 డిపో మేనేజర్ వంగల మోహన్‌రావు గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. కిలో మీటర్ ప్రకారం.. పల్లె వెలుగు ధర రూ.68 నుంచి 52కు, ఎక్స్‌ప్రెస్ రూ.69 నుంచి 62కు, డీలక్స్ రూ.65 నుంచి 57కు, సూపర్ లగ్జరీ రూ.65 నుంచి 59 రూపాయలకు నిర్ణయించినట్లు తెలిపారు. వంద కిలోమీటర్లకు పికప్ అండ్ డ్రాపింగ్ ధరలను కూడా తగ్గించినట్లు తెలిపారు. పట్టణ పరిసర ప్రాంతాల ప్రజలు ఈఅవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఆర్టీసీ బస్సులను బుక్ చేసుకునేందుకు డిపో మేనేజర్ నంబర్ 99592 26047, అసిస్టెంట్ మేనేజర్ 98663 73823, జనరల్ ఏడీసీ 738285 5793 నంబర్లలో సంప్రదించాలని కోరారు.
Comments
Please login to add a commentAdd a comment