పోలీసులు నిజాయితీగా పని చేయాలి
సీపీ అంబర్ కిషోర్ ఝా
శాయంపేట: పోలీసులు నీతి నిజాయితీతో పని చేసి ప్రజల మన్ననలు పొందాలని వరంగల్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా పోలీస్ సిబ్బందికి సూచించారు. వార్షిక తనిఖీల్లో భాగంగా గురువారం మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్‌ను సీపీ అంబర్ కిషోర్ ఝా ఆకస్మికంగా తనిఖీ చేశారు. సీపీకి అధికారులు మొక్కలు అందజేసి స్వాగతం పలికారు. సాయుధ పోలీసుల గౌరవ వందనం చేశారు. స్టేషన్ పరిసరాల్ని ఆయన పరిశీలించి, పోలీస్ సిబ్బందికి శాఖ మంజూరు చేసిన కిట్ ఆర్టికల్స్‌ను తనిఖీ చేశారు. స్టేషన్ రిసెప్షన్ సిబ్బంది పని తీరును పరిశీలించారు. బాధితుల నుంచి వచ్చిన ఫిర్యాదులపై ఎలాంటి చర్యలు తీసుకున్నారో అధికారులను అడిగి తెలుసుకున్నారు. పెండింగ్ కేసుల వివరాలు, నిందితుల అరెస్ట్, రౌడీ షీటర్ల వివరాలు, రోడ్డు ప్రమాదాల నివారణకు తీసుకుంటున్న చర్యలు, కోర్ట్‌లో పెండింగ్‌లో ఉన్న కేసులు వాటికి సంబంధించిన దర్యాప్తు వివరాలను స్టేషన్ సబ్ ఇన్‌స్పెక్టర్ ప్రమోద్‌కుమార్‌ను అడిగి తెలుసుకున్నారు. స్టేషన్‌లో నిర్వహిస్తున్న పలు రకాల రికార్డులను పరిశీలించారు. ఈసందర్భంగా పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ.. స్టేషన్‌లోని అధికారులు, సిబ్బంది ప్రజల పట్ల మర్యాదపూర్వకంగా ప్రవర్తించాలన్నారు. సమస్యలతో పోలీస్ స్టేషన్‌కు వచ్చే ఫిర్యాదుదారులకు పరిష్కారం అవుతుందనే నమ్మకాన్ని కలిగించాలన్నారు. పోలీస్ శాఖ కీర్తి ప్రతిష్టలకు భంగం కలిగించేలా వ్యవహరిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. అనంతరం పోలీస్‌స్టేషన్ ఆవరణలో మొక్కలు నాటారు. కార్యక్రమంలో ఈస్ట్ జోన్ డీసీపీ రవీందర్, పరకాల ఏసీపీ కిషోర్‌కుమార్, శాయంపేట సీఐ రంజిత్‌రావు, ఎస్సై ప్రమోద్‌కుమార్, సిబ్బంది పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment