పశ్చిమ గోదావరి: ఉండి మండలం పెదపుల్లేరులో సైబర్ మోసంపై కేసు నమోదైంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం పెదపుల్లేరు గ్రామానికి చెందిన కలిదిండి పెదరామకృష్ణంరాజుకి గుర్తు తెలియని వ్యక్తి నుంచి మార్చి నెల 28న కరెంటు బిల్లు కట్టలేదని.. కట్టకపోతే కరెంట్ కట్ చేస్తామంటూ ఓ మెస్సేజ్ వచ్చింది. దానిలో ఫోన్ నంబర్ ఉండడంతో.. కరెంట్ బిల్లు కట్టానని సదరు వ్యక్తికి ఫోన్ చేసి చెప్పాడు.
మీకు ఓ లింక్ పంపుతున్నాము దానిని క్లిక్ చేస్తే తెలుస్తుందని చెప్పడంతో క్లిక్ చేశాడు. అందులో కరెంట్ బిల్లు కట్టినట్లు తెలియడం లేదని గుర్తు తెలియని వ్యక్తికి రామకృష్ణంరాజు ఫోన్ చేసి చెప్పాడు. ఓ నంబర్ పంపుతున్నాం.. దానికి రూ.5 ఫోన్ పే ద్వారా పంపితే తెలుస్తుందని చెప్పడంతో దానికి నగదు పంపించారు. అనంతరం అవతలి వ్యక్తి నుంచి ఫోన్ రాకపోవడం, ఫోన్ చేసినా ఎత్తకపోవడంతో.. ఏం జరిగిందో తెలియని రామకృష్ణంరాజు దానిని వదిలేశారు.
ఈ నెలలో బ్యాంకుకు వెళ్ళి ఖాతాను పరిశీలిస్తే మార్చి నెల 28న తన ఖాతా నుంచి రూ.1.85 లక్షలు మాయమైనట్లు గమనించి ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఆయన ఫిర్యాదుపై ఎస్సై కే.గంగాధరరావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. గుర్తు తెలియని వ్యక్తుల నుంచి వచ్చే ఆన్‌లైన్ లింక్‌లు క్లిక్ చెయొద్దని ఆలా చేస్తే మోసాలు తప్పవని ఎస్సై తెలిపారు. ఎవరైనా అలాంటివి పంపిస్తే వెంటనే పోలీసులకు లేదా సైబర్‌క్రైం పోలీసులకు తెలియచేయాలని సూచించారు.
Comments
Please login to add a commentAdd a comment