కవి ప్రసాద్‌కు జాతీయ ప్రతిభా పురస్కారం
తణుకు అర్బన్: తణుకు పట్టణానికి చెందిన ప్రముఖ కవి వీఎస్‌వీ ప్రసాద్ తెలుగు కీర్తి జాతీయ ప్రతిభా పురస్కారం అందుకున్నారు. శ్రీశ్రీ కళావేదిక, వరల్డ్ రైటర్స్ ఫోరం, వరల్డ్ పోయెట్రీ అకాడమీ, తెలుగు అసోసియేషన్ ఆఫ్ నేషనల్ అకాడమీ బుక్ ఆఫ్ రికార్డ్స్ సంయుక్తంగా ఈనెల 21న విజయవాడలో నిర్వహించిన జాతీయ పురస్కారాల కార్యక్రమంలో ఈ ఘనత అందుకున్నట్లు ప్రసాద్ తెలిపారు. తెలుగు సాహిత్యాన్ని ఇనుమడింపచేయడంతోపాటు సమాజానికి తెలుగు వెలుగులు అందిస్తున్న నేపథ్యంలో ఈ గుర్తింపు లభించినట్లు వివరించారు. ఏపీఎస్‌పీఎఫ్ కమాండెంట్ డాక్టర్ కొండా నరసింహారావు, అలివేలు మంగదేవి, సాహితీవేత్త గరిమళ్ల రాజేంద్రప్రసాద్, సమాచారశాఖ డిప్యూటీ డైరెక్టర్ డాక్టర్ జి.కొండలరావు, జి.ఈశ్వరిభూషణం, గీతా మహాలక్ష్మి చేతుల మీదుగా పురస్కారంతోపాటు, జ్ఞాపిక, ప్రశంసాపత్రం అందుకున్నట్లుగా చెప్పారు.
మాజీ ఎమ్మెల్యే బాలరాజుకు మాతృవియోగం
బుట్టాయగూడెం: మాజీ ఎమ్మెల్యే తెల్లం బాలరాజు మాతృమూర్తి తెల్లం మల్లమ్మ(80) శనివారం సాయంత్రం మృతి చెందారు. తల్లి మృతితో బాలరాజు కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు. మల్లమ్మ మృతిపై పలువురు పార్టీ నాయకులు, కార్యకర్తలు సంతాపం తెలిపారు. అలాగే ఏటీఏ నాయకులు మల్లమ్మ భౌతిక కాయాన్ని సందర్శించి నివాళులు అర్పించారు.
రైలుకింద పడి వ్యక్తి ఆత్మహత్య
ఏలూరు టౌన్: ఏలూరు శివారు వట్లూరు సమీపంలో రైలుకింద పడి ఒక వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. బాధితులు తెలిపిన వివరాల మేరకు ఏలూరు తంగెళ్ళమూడి ప్రాంతానికి చెందిన షేక్ సుబానీ (39) భార్య పిల్లలతో కలిసి జీవిస్తున్నాడు. సుబానీ ఫైనాన్స్ పద్ధతిపై మంచాలు, కుర్చీలు విక్రయిస్తూ వారం వారం డబ్బులను వసూలు చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. ఈ క్రమంలో శనివారం రాత్రి కారణాలు ఏమిటో తెలియదు కానీ వట్లూరు సమీపంలో రైలు పట్టాలపై వెళుతూ రైలుకింద పడి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. రైల్వే పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment