‘డయల్ యువర్ కలెక్టర్’ను సద్వినియోగం చేసుకోవాలి
కడప సెవెన్‌రోడ్స్: ప్రతి సోమ వారం ఉదయం 9.30 నుంచి 10.30 గంటల వరకు కొనసాగే డయల్ యువర్ కలెక్టర్ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ శ్రీధర్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లా ప్రజలు ఈ సమయ మార్పును గమనించి 08562–244437 ల్యాండ్ లైన్ నెంబరుకు ఫోన్ చేసి తమ సమస్యలను విన్నవించుకోవచ్చని పేర్కొన్నారు.
దేవనాగరి హిందీ సేవి సమ్మాన్ పురస్కారానికి ఎంపిక
రాజంపేట టౌన్: రాజంపేట పట్టణానికి చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయుడు ఎస్.సర్తాజ్ హుస్సేన్ దేవనాగరి హిందీ సేవి సమ్మాన్ పురస్కారానికి ఎంపికయ్యారు. ఈవిషయాన్ని ఆదివారం ఆయన ఇక్కడ విలేకరులకు తెలిపారు. రాష్ట్రభాష సేవా సంఘ్ ఫౌండేషన్ ప్రతి ఏడాది దేశంలోని అన్ని రాష్ట్రాల్లో జాతీయ భాష అయిన హిందీ అభివృద్ధికి కృషి చేసే ఉపాధ్యాయులకు ఈ పురస్కారం అందచేస్తుందన్నారు. అందులో భాగంగా ఏడాది ఆంధ్రప్రదేశ్ నుంచి తాను ఎంపికై నట్లు ఆయన తెలిపారు. ఈ ఏడాది డిసెంబర్ 1వ తేదీ హైదరాబాద్‌లో జరిగే కార్యక్రమంలో పురస్కారాన్ని అందుకోబోతున్నట్లు తెలిపారు. సర్తాజ్ హుస్సేన్ పుల్లంపేట మండలం టీ.కమ్మపల్లె జెడ్పీ ఉన్నత పాఠశాలలో హిందీ ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నారు.
ఘనంగా బిందె సేవ
ప్రొద్దుటూరు కల్చరల్: స్థానిక శ్రీచౌడేశ్వరిదేవి జ్యోతి ఉత్సవాలను పురస్కరించుకుని పట్టణంలోని పలు చౌడేశ్వరిదేవి ఆలయాల నిర్వాహకులు ఘనంగా బిందెసేవ నిర్వహించారు. ఆదివారం స్థానిక దేవాంగ పేటలోని జ్యోతినగర్ నుంచి దేవాంగులు, భక్తులు ఊరేగింపుగా శివాలయానికి చేరుకుని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం అమ్మవారిని ఆవాహన చేసిన కలశాలను తల మీద ఉంచుకుని పురవీధుల్లో ఊరేగింపు నిర్వహించారు. మేదర వీధిలోని రామలింగ చౌడేశ్వరిదేవి ఆలయం నుంచి అమ్మవారి పల్లకీలో ఉంచి ఊరేగింపుగా జ్యోతినగర్‌కు తీసుకొచ్చారు. కార్యక్రమంలో దేవాంగ సంక్షేమ సంఘం అధ్యక్షుడు వుట్టి నాగశయనం, కార్యదర్శి ఈశ్వరయ్య, లక్ష్మీనారాయణ, సాధు గోవిందరాజులు పాల్గొన్నారు.
గిరిజన ఉద్యోగుల
సమస్యలు పరిష్కరించాలి
రాయచోటి టౌన్: గిరిజన ఉద్యోగల సమస్యలు పరిష్కరించాలని ఆల్ ఇండియా ఎస్టీ ఎంప్లాయీస్ అసోషియేషన్ జాతీయ అధ్యక్షుడు, హైకోర్టు న్యాయవాది పీవీ రమణ అన్నారు. ఆదివారం రాయచోటిలోని ఎస్టీ ఎంప్లాయీస్ అసోషియేషన్ 60 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ గిరిజన భవనం అన్నమయ్య జిల్లా కేంద్రం రాయచోటిలో నిర్మించాలని కోరారు.
1న ఘనంగా
లక్షార్చన మహోత్సవం
ప్రొద్దుటూరు కల్చరల్: పెన్నానది తీరంలోని శ్రీఅయ్యప్పస్వామి ఆలయంలో డిసెంబర్ 1న ఘనంగా లక్షార్చన మహోత్సవం నిర్వహించనున్నట్లు స్వామి అయ్యప్పసేవా సంఘం అధ్యక్షుడు కొవ్వూరు రమేష్‌రెడ్డి తెలిపారు. ఆలయంలో ఆదివారం లక్షార్చనకు సంబంధించిన ఆహ్వాన పత్రాలను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్వామి అయ్యప్ప సేవా సంఘం ఆధ్వర్యంలో దాతలు, భక్తుల సహకారంతో 30 ఏళ్లుగా ఈ వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నామన్నారు. లక్షార్చన రోజు స్వామివారికి విశేష అభిషేకాలు, అర్చనలతోపాటు ప్రత్యేక అలంకరణ ఉంటుందన్నారు. మధ్యాహ్నం 30వేల మందికిపైగా భక్తులకు అన్న ప్రసాద వినియోగం చేస్తున్నామన్నారు. డిసెంబర్ 12న అయ్యప్పస్వామి గ్రామోత్సవాన్ని ఘనంగా నిర్వహిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో టీటీడీ పాలకమండలి మాజీ సభ్యుడు టంగుటూరు మారుతిప్రసాద్, స్వామి అయ్యప్ప సేవా సంఘం గౌరవాధ్యక్షుడు నామా రమేష్ బాబు, ఉపాధ్యక్షుడు రామ్ వెంకటనారాయణ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment