వణికిస్తున్న చలి
కడప అగ్రికల్చర్ : జిల్లాలో చలి తీవ్రత పెరిగింది.రాత్రి ఉష్ణాగ్రతలు తగ్గాయి. మొన్నటి వరకు రాత్రులు 23, 24 డిగ్రీలు ఉష్ణోగ్రతలు నమోదయ్యేవి. అలాంటిది గత మూడు రోజుల నుంచి జిల్లాలో 18 డిగ్రీలకు ఉష్ణోగ్రతలు పడిపోయాయి. తెల్లవారుజాము నుంచే పొగమంచు కురుస్తోంది. దీంతో జాతీయ రహదారుల వెంబడి వెళ్లే వాహన దారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ఉషోదయాన్నే పంట పొలాలను మంచు దుప్పటి కప్పేస్తోంది. గ్రామాల్లో ప్రజలు చలిమంటలు వేసుకుంటూ శీతలాన్ని తగ్గించుకుంటున్నారు. జిల్లావ్యాప్తంగా నవంబర్ నెల 1వ తేదీ గరిష్ట ఉష్ణోగ్రత 33.8 డిగ్రీలు, కనిష్ట ఉష్ణోగ్రత 23.6 డిగ్రీలు ఉండేవి. నవంబర్ 15వ తేదీ నాటికి గరిష్టం 31.0 డిగ్రీలు, కనిష్టం 23.9 డిగ్రీలుగా నమోదైంది. నవంబర్ 20 తేదీ గరిష్ట ఉష్ణోగ్రత 29.8 కనిష్ట ఉష్ణోగ్రత 21.3 డిగ్రీలు నమోదైంది. 24వ తేదీకి గరిష్ట ఉష్ణోగ్రత 31.5 ఉండగా కనిష్ట ఉష్ణోగ్రత 18.5కు చేరుకుంది. ఇప్పుడే ఇలా ఉంటే డిసెంబర్, జనవరి నెలల్లో చలి ఎలా ఉంటుందోనని ప్రజలు ఆందోళన చెందుతున్నారు.
పెరిగిన స్వెటర్లు, మంకీక్యాప్‌ల అమ్మకాలు
చలి పెరగడంతో స్వెటర్లు, మంకీక్యాప్‌లు, రగ్గుల అమ్మకాలు పెరిగాయి. మధ్యప్రదేశ్, భూపాల్ ప్రాంతానికి చెందిన కొందరు వ్యాపారులు కడపతో పాటు జిల్లాలోని పలు ప్రాంతాల్లో రోడ్ల పక్కన స్టాల్స్‌ను ఏర్పాటు చేసుకున్నారు. ఈ స్టాల్స్‌లో స్వెటర్లు, మంకీ క్యాపులు, గ్లౌజులు, రగ్గుల అమ్మకాలు చేస్తున్నారు. వాతావరణంలో మార్పుల కారణంగా చాలామంది జలుబు, దగ్గు, జ్వరాలు సోకుతున్నట్లు వైద్యులు తెలిపారు. ప్రతి ఒక్కరూ కాచిచల్లార్చిన నీటిని తాగాలని, వేడివేడి ఆహార పదార్ధాలు తీసుకోవడం మంచిదని సూచిస్తున్నారు.
తగ్గుతున్న రాత్రి ఉష్ణోగ్రతలు
తెల్లవారుజాము నుంచి కమ్ముకుంటున్న పొగమంచు
జాగ్రత్తలు అవసరం..
చలికాలం అనేక రోగాలను కూడా వెంట తెస్తుంది. ప్రజలు చలిలో బయటకు వెళ్లేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. చెవుల్లోకి గాలి వెళ్లకుండా చూసుకోవాలి. వృద్ధులు, పిల్లలు చలిలో తిరగకుండా చూడాలి.రాత్రిళ్లు చలిలో ప్రయాణాలు చేయరాదు.కాచి చల్లార్చిన నీరు తాగాలి.వేడి ఆహారం తీసుకోవాలి.
– డాక్టర్. ఎస్. మహబూబ్‌అలీ, ఎండీ,(ిఫిజీషియన్), కడప
ఇప్పుడిప్పుడే వ్యాపారం ప్రారంభం..
ఏటా కడప నగరానికి ఉన్నిదుస్తుల అమ్మకం కోసం మధ్యప్రదేశ్ నుంచి వస్తాం. వారం రోజుల నుంచి వ్యాపారం ప్రారంభించాం.మొన్నటి వరకు పెద్దగా అమ్మకాలు లేవు. ఇప్పుడిప్పుడే ప్రారంభమయ్యాయి. మరోపది రోజులు గడిస్తే వ్యాపారం పెరుగుతుందని ఆశిస్తున్నాం.
– హుకుం సింగ్ హకలేశ్వర్, మధ్యప్రదేశ్
Comments
Please login to add a commentAdd a comment