దేవాలయానికి రాజకీయ రంగు
వల్లూరు (చెన్నూరు) : చెన్నూరు మండలంలోని శివాలపల్లె వద్ద వెలసిన శ్రీ కాశీ విశ్వనాథస్వామి ఆలయానికి కార్యనిర్వహణ అధికారి రాజకీయ రంగులదిద్దారు. కొంత మంది అధికార పార్టీ నేతల కనుసనల్లో గుడి నిర్వహణ జరగడం వల్ల వీఐపీలు ముందు, భక్తులు వెనక అనే చందంగా కొనసాగుతోంది. ఇదే కాక ధనార్చనే ధ్యేయంగా తెల్లవారుజాము నుంచి సాయంత్రం వరకు అభిషేకాలు చేయటం మూలాన సాధారణ భక్తులకు కాశీ విశ్వనాథస్వామి దర్శనం దక్కక, సోమవారం కొంత మంది భక్తులు ఆలయ నిర్వాహకులపై దాడికి యత్నించడం పరిపాటిగా మారిపోయింది. ప్రతి ఏడాది కార్తిక మాసంలో జరిగే కార్యక్రమ వివరాలను తెలియజేస్తూ అధికారికంగా ఆలయ ఈవో, చైర్మన్ పేరు మీద గోడపత్రాలు, కరపత్రాలు ముద్రించడం ఆనవాయితీ. అయితే ఈ ఏడాది ఆలయానికి చైర్మన్ లేకపోవడం అలుసుగా తీసుకున్న కార్యనిర్వణాధికారి నిబంధనలకు విరుద్ధంగా గోడపత్రాలపై అధికార పార్టీకి చెందిన నాయకుల ఫొటోలతో ముద్రించడం మండలంలో చర్చనీయాంశమైంది. దేవున్ని కూడా రాజకీయాల్లోకి లాగుతున్నారు అనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అంతేకాక ఈ ఆలయానికి గతంలో పని చేసిన ఈవోలు ఆలయ ఆదాయాన్ని పెంచడం విశేషం. అయితే ప్రస్తుత ఈవో అధికార పార్టీ నేతలతో చేతులు కలిపి ఆలయ ఆదాయాన్ని దుర్వినియోగం చేస్తున్నారన్న విమర్శలు వినపడుతున్నాయి. ప్రతి ఏడాది కార్తిక మాస ఉత్సవాల సందర్భంగా వివిధ కార్యక్రమాలకు గాను ఆలయ ఖాతా నుంచి సుమా రు 70 వేల రూపాయల వరకు ఇచ్చేవారు. ప్రస్తుత ఈవో ఈ ఏడాది సుమారు 1,70,000 రూపాయల చెక్కును ఓ అధికార పార్టీ నేత పేరుతో ఇచ్చినట్లు సమాచారం. ఉన్నతాధికారులు స్పందించి ఆలయ ఆదాయంపై విచారణ చేపట్టినట్లయితే నిజా నిజా లు వెల్లడవుతాయని పలువురు కోరుతున్నారు.
కాశీ విశ్వనాథస్వామి
ఆలయ ఈఓ నిర్వాకం
అధికార పార్టీ నేతల పట్ల
భక్తి ప్రదర్శిస్తున్న వైనం
Comments
Please login to add a commentAdd a comment