వింత వ్యాధితో ఆవులు మృతి
రామాపురం : ఆవులు వింత వ్యాధితో మృతి చెందుతుండటంతో పాడి రైతులు ఆందోళన చెందుతున్నారు. ఎన్నో ఏళ్లుగా బిడ్డల లాగా పోషించుకున్నామని, కళ్లెదుటే చనిపోతుండటంతో తట్టుకోలేకపోతున్నామని వారు ఆవేదన వ్యక్త చేశారు. మండలంలోని సరస్వతిపల్లె దళితవాడలో నెల రోజులుగా ఒంగోలు జాతి ఆవులకు, దూడలకు చర్మంపై బొబ్బలు రావడం, వారం రోజులలో తల వాపునకు గురై మృత్యువాత పడుతున్నాయి. ఈ వారంలోనే వీరనాగయ్యకు చెందిన దూడ, ఈశ్వరయ్య, నాగులయ్యకు చెందిన ఒంగోలు జాతి ఆవులు, దూడలు మృతి చెందాయి. చర్మంపై పెద్దగా బొబ్బలు రావడంతో వెంటనే పశువుల ఆసుపత్రిని సంప్రదిస్తే అక్కడి సిబ్బంది పట్టించుకోవడం లేదని, మందులు ఇక్కడ లేవని బయటికి వెళ్లి కొనుగోలు చేయాలని చీటి రాసిచ్చారని, ఎన్ని మందులు వాడినా ప్రయోజనం కన్పించలేదని పాడి రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గ్రామంలో ప్రతి ఇంటిలో పశువులు ఉన్నాయని, ఈ దిక్కుమాలిన వ్యాధితో ఎన్ని కోల్పోవాల్సి వస్తుందోనని వారు భయాందోళన చెందుతున్నారు. ఇప్పటికై నా పశువైద్యాధికారులు స్పందించి పాడి రైతులను ఆదుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు.
వివరణ : మండల పశువైద్యాధికారి వెంకటరమణను ‘సాక్షి’ వివరణ కోరగా 2023 డిసెంబర్ నుంచి ఇప్పటి వరకు ఎలాంటి మందులు ప్రభుత్వం నుంచి అందలేదని, తామేమి చేయాలని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment