ఏపీజీబీ ప్రధాన కార్యాలయం కడపలోనే కొనసాగించాలి
కడప కోటిరెడ్డిసర్కిల్ : రాష్ట్రంలోని నాలుగు గ్రామీణ బ్యాంకులు కలిసి ఒకే గ్రామీణ బ్యాంకుగా ఏర్పడుతున్నందున కడపలో ఉన్న ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంక్ ప్రధాన కార్యాలయాన్ని కడపలోనే కొనసాగించాలని ఆ బ్యాంకు ఉద్యోగ, అధికార సంఘాల ప్రతినిధులు కోరారు. ఈ మేరకు వారు సోమవారం కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డిని కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కడప ప్రధాన కార్యాలయంగా పని చేస్తున్న ఏపీజీబీ మిగతా గ్రామీణ బ్యాంకులతో పోలిస్తే అతి పెద్దదని, గతంలో ప్రభుత్వం కేటాయించిన స్థలంలోనే సొంత భవనం కలిగి ఉందని తెలిపారు. దక్షిణ భారతదేశంలో ఏ గ్రామీణ బ్యాంకుకు లేనటువంటి కరెన్సీ చెస్ట్ సౌకర్యం కలిగి ఉండడంతోపాటు అత్యంత వెనుకబడిన ప్రాంతంలో ఉండటం వల్ల ప్రతిపాదిత గ్రామీణ బ్యాంకు కడపలోనే కొనసాగించడం అత్యంత ఆవశ్యకమని తెలియజేశారు. ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వ అన్ని కార్యాలయాలు అమరావతిలో కేంద్రీకరించాలని భావిస్తున్న నేపథ్యంలో నూతనంగా ఏర్పడబోతున్న ఈ గ్రామీణ బ్యాంక్ ప్రధాన కార్యాలయం కూడా కడప నుంచి అమరావతికి తరలిపోతుందన్న ఆందోళన, ఏపీజీబీ సిబ్బందితోపాటు ఈ ప్రాంత ప్రజల్లో ఉందన్నారు. మిగతా ప్రాంతాలతో పోల్చి చూసుకుంటే, వెనుకబడిన రాయలసీమలో ఎటువంటి ముఖ్యమైన కార్యాలయాలు గానీ, సంస్థల కార్యాలయాలు లేకపోవడం, మిగతా ప్రాంతంలో అనేక కార్యాలయాలు కలిగి ఉండడమనే అంశాల్ని పరిగణనలోకి తీసుకొని నూతనంగా ఏర్పడబోయే గ్రామీణ బ్యాంక్ ప్రధాన కార్యాలయం కడపలోనే కొనసాగించాలన్నారు. ఈ అంశం పట్ల దృష్టి సారించి ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి కడప నుంచి ప్రధాన కార్యాలయం తరలి వెళ్లకుండా చూడాలని కోరుతున్నామన్నారు. ఇందుకు ఎంపీ స్పందిస్తూ, తన వంతు కృషిని చేస్తానని, పార్లమెంటులో ఈ విషయం లేవనెత్తి కడపలోనే ఏపీజీబీ ప్రధాన కార్యాలయం హెడ్ క్వార్టర్స్ కొనసాగేలా చూడగలనని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఉద్యోగ సంఘం అధ్యక్షులు ఎం.హరిప్రసన్న కుమార్, జనరల్ సెక్రటరీ జగదీశ్వర్‌రెడ్డి, ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంక్ ఆఫీసర్స్ అసోసియేషన్ నాయకులు పాల్గొన్నారు.
కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డికి వినతి
Comments
Please login to add a commentAdd a comment