అక్రమ మట్టి తవ్వకాలపై కొరడా
– జేసీబీ, 7 ట్రాక్టర్లు సీజ్
బద్వేలు అర్బన్ : అక్రమ మట్టి తవ్వకాలపై రెవెన్యూ అధికారులు కొరడా ఝుళిపించారు. సోమవారం స్థానిక బయనపల్లె చెరువులో అక్రమంగా మట్టి తవ్వకాలు సాగిస్తున్న ఒక జేసీబీ, 7 ట్రాక్టర్లను తహసీల్దారు ఉదయభాస్కర్‌రాజు సీజ్ చేసి స్టేషన్‌కు తరలించారు. ఇటీవల కాలంలో బద్వేలు మండల పరిధిలోని పలు చెరువులలో ఎటువంటి అనుమతులు లేకుండా ఇష్టానుసారంగా మట్టి తవ్వకాలు సాగిస్తున్నారు. దీనిపై ఫిర్యాదులు అందుకున్న తహసీల్దారు ఉదయభాస్కర్‌రాజు సిబ్బందితో వెళ్లి దాడులు నిర్వహించారు. అక్రమంగా మట్టిని తరలిస్తున్న జేసీబీ, ట్రాక్టర్లను సీజ్ చేసి పోలీసుస్టేషన్‌కు తరలించారు. ఈ సందర్భంగా తహసీల్దారు మాట్లాడుతూ ఎటువంటి అనుమతులు లేకుండా మట్టి అక్రమ రవాణాకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
బైక్‌ను ఢీకొన్న ఆర్టీసీ బస్సు
పులివెందుల రూరల్ : పులివెందుల పట్టణంలోని వైఎస్ పాల్‌రెడ్డి ఫంక్షన్ హాలు సమీపంలో సోమవారం ద్విచక్రవాహనాన్ని ఆర్టీసీ బస్సు ఢీకొంది. ఈ ప్రమాదంలో యమున అనే చిన్నారికి స్వల్ప గాయాలయ్యాయి. జ్యోతి ఆసుపత్రి నుంచి ద్విచక్రవాహనంలో ఇంటికి వెళుతుండగా.. కదిరి డిపో నుంచి పులివెందులకు వస్తున్న ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. దీంతో చిన్నారితోపాటు ఆ చిన్నారి తండ్రికి స్వల్ప గాయాలయ్యాయి. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించి కేసు నమోదు చేశారు.
కోడి గుడ్ల వాహనాన్ని ఢీకొన్న లారీ
– డ్రైవర్‌కు గాయాలు
పులివెందుల రూరల్ : పులివెందుల పట్టణం కడప రోడ్డులోని మెడికల్ కళాశాల సమీపంలో కోడిగుడ్ల బొలేరో వాహనాన్ని రేషన్ బియ్యం లారీ ఆదివారం రాత్రి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బొలేరో డ్రైవర్ ప్రసాద్ తలకు గాయాలయ్యాయి. స్థానికుల కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. వేముల వైపు నుంచి పులివెందులకు వస్తున్న కోడిగుడ్ల బోలేరో వాహనాన్ని కడప నుంచి పులివెందులకు వస్తున్న రేషన్ బియ్యం లారీ ఢీకొంది. ఈ ప్రమాదంలో బొలేరో వాహనం, లారీ ముందు భాగాలు పూర్తిగా దెబ్బతిన్నాయి. బొలేరో వాహన డ్రైవర్ ప్రసాద్‌కు గాయాలు కావడంతో చికిత్స కోసం దగ్గరలో ఉన్న వైఎస్సార్ సర్వజన ఆసుపత్రికి తరలించారు. సోమవారం ఉదయం ట్రాఫిక్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని ప్రమాదానికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.
ఆటోలో నుంచి పడి
వృద్ధుడికి గాయాలు
మదనపల్లె : అంగళ్లుకు చెందిన గోపాల్‌రెడ్డి (71) సోమవారం ఆటోలో గోపాలపురానికి వెళుతుండగా మార్గంమధ్యలో ఆటో అదుపు తప్పడంతో.. ఆటోలో నుంచి కిందపడి తీవ్రంగా గాయపడ్డాడు. గమనించిన స్థానికులు ఆయనను మదనపల్లె జిల్లా ఆస్పత్రికి తరలించారు.
Comments
Please login to add a commentAdd a comment