Sagubadi
-
ఇంటిపంటలతో సంపూర్ణ ఆరోగ్యం.. మనమే పండించుకుందాం
ఇంటికి పంటే అందం, ఆరోగ్యం! మొన్నటి వరకు మండిన ఎండల ప్రతాపానికి కూరగాయల దిగుబడి తగ్గి, మార్కెట్లో తీవ్ర కొరత ఏర్పడింది. ఫలితంగా కూరగాయల ధరలు మండిపోతున్నాయి. వాటిల్లోనూ నాణ్యత లోపించింది. మూడు వారాలకు పైగా అదనంగా కొనసాగిన హీట్ వేవ్, వడగాడ్పుల పుణ్యమా అని కూరగాయల సాగు దెబ్బతిన్నది. అననుకూల వాతావరణంలో కూరగాయ పంటలు విత్తలేకపోవడంతో సరఫరా తగ్గిపోయింది. దీంతో ప్రజలకు, ముఖ్యంగా నగరవాసులకు కూరగాయలు కొనాలంటే చుక్కలు కనపడుతున్నాయి. ఇప్పటికైనా వర్షాలొచ్చాయి కాబట్టి సేంద్రియ ఇంటి పంటలు సాగు చేసుకోవటం మేలు. సొంతిల్లు ఉన్న వారు మార్కెట్‌పై ఆధారపడకుండా.. ఆరోగ్యదాయకమైన కూరగాయలను టెర్రస్(ఇంటి పైకప్పు)ల మీద పెంచుకోవటం ఉత్తమం. ఎత్తుమడుల్లో లేదా కంటెయినర్లలో ఏ కాలమైనా కూరగాయలు సాగు చేసుకోవచ్చంటున్నారు ఇంటిపంట సాగుదారులు.. కూరగాయలు మనమే పండించుకుందాం మెడిసిన్‌లో సీటు వచ్చినా ప్రకృతి మీద ఉన్న ప్రేమతో మక్కువతో అగ్రికల్చర్ కోర్సులో చేరాను. సహాయ సంచాలకురాలిగా వ్యవసాయ శాఖలో పనిచేస్తూ ప్రస్తుతం గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ (జిహెచ్ఎంసి) చందానగర్‌లో ప్రాజెక్ట్ ఆఫీసర్‌గా ఉన్నాను. నా కుటుంబాన్ని విషపూరితమైన పంటల నుంచి నాకు చేతనైనంత వరకు కాపాడాలని నిర్ణయించుకొని ఇంటిపైన కూరగాయల తోటను ప్రారంభించాను. మనం మన పిల్లలకి ఎంత ఆస్తి ఇచ్చాం అనేది కాదు ముఖ్యం. ఎంత ఆరోగ్యకరమైన జీవన విధానాన్ని అందించామనేది ముఖ్యం. 2014 అక్టోబర్‌లో నా మిద్దె తోటలో తొలి బీజం అంకురించింది. నవంబర్‌లో పంట పురుడు పోసుకుంది. డిసెంబర్లో వజ్రాల్లాంటి పిల్లలను.. అదేనండి పంటని.. నా చేతికి అందించింది. అప్పుడు అరవై కుండీలతో మొదలైన మిద్దె తోట సాగు ఇప్పటివరకు ఆగలేదు. ఏ విధమైన అలుపు గానీ, విసుగు గానీ లేదు. ఆనందకరమైన, ఆరోగ్యకరమైన జీవన విధానం అనుసరిస్తున్నాం. ఇప్పుడు నా తోట 600 కుండీలతో నాలుగు అంతస్తులలో అలరారుతోంది. ప్రకృతి సమతుల్యతను మన వికృత చేష్టలతో మనమే చెడగొట్టుకున్నాం. అందుకని ఇప్పటికైనా నగరవాసులమైన మనం మనకు కావాల్సిన ఆకుకూరలను, కూరగాయలను, పండ్లను సాధ్యమైనంత వరకు మనమే పండించుకోవడం ఉత్తమం. ఇంకెందుకు ఆలస్యం మొదలెడదామా? మనమందరం మిద్దె తోటలను పెంచుకోవాలి. ఉల్లిపాయ తప్పితే మిగతా ఏ కూరగాయలకూ మార్కెట్‌కి వెళ్ళను. మీరు నమ్మినా నమ్మకున్నా 365 రోజుల్లో ఏనాడూ నేను కూరగాయలను బయట కొనటం లేదు. – ఓ.వి.ఎస్.ఉషారాణి (81217 96299), సేంద్రియ ఇంటిపంటల సాగుదారు, వ్యవసాయ సహాయ సంచాలకులు, జీహెచ్ఎంసీ చందానగర్ సర్కిల్ ప్రాజెక్ట్ ఆఫీసర్,హైదరాబాద్. సేంద్రియ ఇంటిపంటల్లో సంపూర్ణ ఆరోగ్యం టికి చేయి తినడానికి ఎంత దగ్గరగా అనుకూలంగా ఉంటుందో.. ఇంట్లో వంట చేయడానికి పంట కూడా అంత దగ్గరగా అందుబాటులో ఉండాలి. తాజా కూరగాయలు, పండ్లు ఎప్పటికప్పుడు ఎక్కడికక్కడ పండించుకొని తినడం ఆరోగ్యానికి ఎంతో ఉపయోగం. తాజా కూరగాయలు, పండ్లు తింటే శరీరానికి కావలసిన యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా లభిస్తాయి. నలిగిన లేదా పగిలిన కణాల నుంచి సెల్యులోజ్ అనే ఎంజైము విడుదలవుతుంది. ఇలా కణజాల వ్యవస్థ ధ్వసమై మనకు మేలు చేసే యాంటీ ఆక్సిడెంట్లు కాస్తా హానికరమైన యాసిడ్లు (ఆమ్లాలు)గా రూపాంతరం చెందుతాయి. మార్కెట్లో లభించే చాలా వరకు కూరగాయల్లో యాంటీ ఆక్సిడెంట్లు యాసిడ్లుగా మారే ప్రక్రియకు లోనయ్యే అవకాశం ఎక్కువగా ఉంది. అందువల్ల గ్యాస్, అసిడిటీ, అల్సర్లు వంటి సమస్యలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి, ఇంటిపట్టున/ఇంటికి దగ్గర్లో పండ్లు, కూరగాయలు పండించుకొని తాజాగా తినాలి. సేంద్రియ ఇంటి పంటల్లో సంపూర్ణ ఆరోగ్య ప్రాప్తిరస్తు. – డా. జి. శ్యాంసుందర్ రెడ్డి (99082 24649), సేంద్రియ ఇంటిపంటల నిపుణుడు మిద్దె తోటలో అన్నీ పండించుకోవచ్చు పూల మొక్కలు చాలా ఏళ్లుగా పెంచుతున్నా కూరగాయల సాగుపై పెద్దగా అవగాహన లేదు. ‘సాక్షి’ పేపర్లో ‘ఇంటిపంట’ ఆర్టికల్స్ చదివి అందరూ ఎలా చేస్తున్నారో తెలుసుకున్నా. మిద్దె పైన మొదలు పెట్టి, కనీసం ఆకుకూరల వరకైనా పెంచుకుందాం అని అనుకున్నాను. 2017లో ఐదారు గ్రోబాగ్స్ తెచ్చి ఆకుకూరల సాగు మొదలు పెట్టాను. ఇంటిపంట ఫేస్బుక్ గ్రూప్‌లో చేరి కొన్ని విషయాలు తెలుసుకున్నాను. తర్వాత తుమ్మేటి రఘోత్తమరెడ్డి సూచనలు ఉపకరించాయి. 2019 జూన్ నుంచి పట్టుదలగా కూరగాయ మొక్కలను మిద్దె పైనే పెంచుతున్నాను. ఇక వెనక్కి తిరిగి చూసుకోలేదు. మొక్కలకు తగిన పోషకాలు ఇస్తే మిద్దె తోటలో కూరగాయలు, ఆకుకూరలు, పండ్లు అన్ని రకాలను ఎలాంటి రసాయనాలు వాడకుండా మనమే పండించుకోవచ్చు. మన పంట మనమే తినవచ్చు. ఆరోగ్యం చేకూరుతుంది. డాక్టర్, మందుల ఖర్చులు తగ్గుతాయి. నగరంలో అందరూ మిద్దె తోటలు సాగు చేస్తే వాతావరణ కాలుష్యం తగ్గుతుంది. ఇతర ఆలోచనలు లేకుండా మనసు ప్రశాంతంగా ఉంటుంది. – లత కృష్ణమూర్తి (94418 03407), మిద్దె తోటల సాగుదారు, హైదరాబాద్ – పంతంగి రాంబాబు, సాక్షి సాగుబడి డెస్క్ -
ఏడాదికి 5లక్షల ఆదాయం.. ఈ యువ రైతు గురించి తెలుసా?
ప్రకృతి వ్యవసాయ పద్ధతుల్లో తనకున్న 6.5 ఎకరాల్లో ఏడాది పొడవునా బహుళ పంటలను సాగు చేస్తూ రూ. 5 లక్షల వరకు నికరాదాయం పొందుతూ ఆదర్శంగా నిలుస్తున్నారు గిరిజన యువ మహిళా రైతు పొంగి వినీత(20). అల్లూరి సీతారామరాజు జిల్లా బలియగూడ మండలం డుంబ్రిగూడ గ్రామంలో ఆమె ఐదేళ్లుగా ప్రకృతి వ్యవసాయం చేస్తూ ఇతర రైతులకు స్ఫూరినిస్తున్నారు. ఆమెకు ఆచార్య ఎన్జీరంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం ‘డాక్టర్ ఎం.వి.రెడ్డి ఉత్తమ రైతు పురస్కారా’న్ని ఇటీవల ప్రదానం చేసింది. అరకు మండలం కిలోగుడలో సంజీవని స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో జరిగిన 15వ దేశీ విత్తనోత్సవంలో కూడా ఉత్తమ రైతుగా ఆమె పురస్కారాన్ని అందుకున్నారు. ఇటీవల ఇండోనేషియా శాస్త్రవేత్తల బృందం ఆమె వ్యవసాయ క్షేత్రాన్ని సందర్శించి సాగు పద్ధతులను తెలుసుకున్నారు. కొండ ప్రాంతంలోని ఎర్ర నేలలో సార్వా, దాళ్వా, వేసవి సీజన్లలో వరుసగా భర్త బాలకృష్ణతో కలసి వినీత ఏడాది పొడవునా పంటలు సాగు చేస్తూ నిరంతరం ఆదాయం పొందుతుండటం విశేషం. కొండ వాగుల్లో నీటిని సేకరించి పంటలకు మళ్లించడం ద్వారా ఖరీఫ్‌తో పాటు రబీ, వేసవి పంటలను కూడా సాగు చేస్తున్నారు. వర్షాధారంగా వరి, గుళి రాగి పద్ధతిలో రాగులు, కూరగాయలు, పండ్లు, పూలు, చింతపండుతో పాటు కొద్ది సంఖ్యలో నాటుకోళ్లు, గొర్రెలు,మేకలను సైతం పెంచుతూ అనుదినం మంచి ఆదాయం పొందుతున్నారు. వినీత అన్ని పంటలకు పూర్తిగా ప్రకృతి వ్యవసాయ విధానాలనే అవలంభిస్తున్నారు. ఏపీ రైతు సాధికార సంస్థ సహాయంతో వివిధ కషాయలను తయారు చేసి తమ పంటలకు వాడటంతో పాటు గ్రామంలోని ఇతర రైతులకు అందిస్తున్నారు. పంట మార్పిడి ఖచ్చితంగా అనుసరిస్తున్నారు. ఏడాది పొడవునా మూడు సీజన్లలోనూ అంతర పంటలు, బహుళ అంతస్తుల పంటలు సాగు చేస్తున్నారు. సజీవ ఆచ్ఛాదనతో పాటు గడ్డిని ఆచ్ఛాదనగా వాడుతూ నేల తేమను సమర్థవంతంగా సంరక్షించుకుంటున్నారు. చింతపల్లి, అనకాపల్లి ఆర్ఎఆర్ఎస్ల శాస్త్రవేత్తల సూచనల మేరకు జీవ నియంత్రణ పద్ధతులను అనుసరిస్తున్నారు. వ్యవసాయ వ్యర్థాలతో తయారు చేసిన కంపోస్టును పంటలకు వాడుతున్నారు. అంతర పంటల సాగును అనుసరిస్తారు. మొక్కజొన్న+ముల్లంగి, టొమాటో+ ముల్లంగి, పసుపు+అల్లం, బీన్స్+వంకాయ, కొత్తిమీర+టమోటాలను మిశ్రమ పంటలుగా సాగు చేస్తున్నారు. టమోటా, కొత్తిమీర, ముల్లంగిని దశలవారీగా విత్తటం ద్వారా సంవత్సరం పొడవునా పంట దిగుబడి తీస్తున్నారు. ఏడాది పొడవునా ఆదాయ భద్రత ఒకటికి పది పంటల సాగుతో వ్యవసాయ భూమి నుంచి సురక్షితమైన ఆదాయాన్ని పొందడంలో వినీత విజయం సాధించారు. దేశీ వరి, కూరగాయలతో పాటు పాడి, మేకలు, గొర్రెలు, కోళ్ల పెంపకం ద్వారా ఆదాయం సమకూర్చుకుంటున్నారు. మొత్తంగా 6.5 ఎకరాల ద్వారా సుమారు రూ. ఐదు లక్షలను ఏడాదికి సగటు నికరాదాయం పొందుతున్నారు. దేశీ వరిని వరుసలుగా విత్తటం, గుళి పద్ధతిలో రాగి నారు మొక్కలను నాటేసి సాగు చేయటం, అంతర పంటలు, మొక్కజొన్న ఇతర పంటలను ప్రకృతి వ్యవసాయంలో సాగు చేయటం వినీత ప్రత్యేకత. పాత విత్తనాలనే వాడుతున్నాం. విత్తనాలను మునుపటి పంట నుండి సేకరించి తదుపరి సీజన్‌కు వినియోగిస్తాం. ఎక్కువగా దేశీ రకాలనే వాడుతున్నాం. సహజ పద్ధతిలో పండించిన నాణ్యమైన ఆహారోత్పత్తులను థిమ్సా ఎఫ్.పి.ఓ. ద్వారా మార్కెట్లో విక్రయిస్తున్నందున మంచి ఆదాయం వస్తోంద’ని వినీత తెలిపారు. గత ఏడాది ఖరీఫ్‌లో 4.3 ఎకరాల్లో వివిధ పంటలు సాగు చేశారు. 2 ఎకరాల్లో వరి (దిగుబడి 32 క్విం./రూ. 26 వేల నికరాదాయం), అరెకరం మొక్కజొన్న (9 క్విం./రూ.12,500), ఎకరంలో రాగులు (7.5 క్విం./ రూ.11,500), అరెకరంలో టొమాటో (4.8 క్విం./రూ.4,200), 30 సెంట్లలో సామలను వినీత సాగు చేశారు. రబీలో 3 ఎకరాల్లో వివిధ పంటలు సాగు చేశారు. అరెకరంలో వరి (9 క్విం./రూ. 8,550 నికరాదాయం), అరెకరంలో మొక్కజొన్న (6 క్విం./రూ.8,000), ఎకరంలో టొమాటో (12.6 క్విం./ రూ.12,100), అరెకరంలో ముల్లంగి (1.25 క్విం/రూ.2వేలు), 30 సెంట్లలో పచ్చిమిరప, కూరగాయలను సాగు చేశారు. అదేవిధంగా ఎండాకాలంలో ఎకరంన్నరలో పంటలు సాగు చేశారు. 30 సెంట్లలో కొత్తిమీర, 20 సెంట్లలో ముల్లంగి, అరెకరంలో కూరగాయలు, అరెకరంలో టొమాటోలు సాగు చేశారు. ఎకరంన్నరలో బొప్పాయి, అరటి, అల్లం, పసుపు వంటి వార్షిక పంటలను సాగు చేస్తున్నారు. దీర్ఘకాలిక పంటలు కాఫీ, మిరియాలు 40 సెంట్లలో సాగు చేస్తున్నారు. 30 పనస, 6 చింత చెట్లున్నాయి. అన్ని పంటలు, కోళ్లు, గొర్రెలు, మేకల ద్వారా ఏటా సగటున రూ. 5 లక్షల నికరాదాయం పొందుతున్నట్లు వినీత తెలిపారు. -
బీజీ–3 పత్తి సాగులో వాడే కలుపు మందుతో కేన్సర్ వస్తుందని తెలుసా?
కలుపు మందును తట్టుకునే (హెర్బిసైడ్ టాలరెంట్) విధంగా జన్యుమార్పిడి చేసిన పత్తి రకం (దీన్నే ‘బీజీ 3 పత్తి’ అని కూడా అంటున్నారు) దేశవ్యాప్తంగా అక్రమంగా సాగులో ఉంది. దీనికి ప్రభుత్వ అనుమతి లేదు. గ్లైఫొసేట్ అనే ప్రమాదకరమైన కలుపు మందు చల్లినా తట్టుకునే విధంగా జన్యుమార్పిడి చేసిన పత్తి పంట ఇది. సాధారణ బీజీ 2 పత్తి రకాలకు మాత్రమే ప్రభుత్వ అనుమతి ఉంది. ప్రభుత్వ అనుమతి లేకపోయినా కొందరు రైతులకు వ్యాపారులు బీజీ 3 పత్తి విత్తనాలను అంటగడుతున్నారు. ఇటీవల తెలంగాణ రాష్ట్రంలో ఇటీవల అనేక సార్లు అక్రమంగా తరలిస్తున్న క్వింటాళ్ల కొద్దీ బీజీ 3 పత్తి విత్తనాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ నేపథ్యంలో నిషిద్ధ హెచ్.టి. పత్తి సాగు వల్ల కలిగే అనర్థాలేమిటో రైతులకు తెలియజెప్పే ప్రయత్నమే ఈ కథనం. గ్లైఫొసేట్ కలుపు /గడ్డి మందు వల్ల కేన్సర్ వంటి జబ్బులు రావటంతో పాటు భూమి, నీరు, గాలి కలుషితం అవుతాయని, రైతులు వాస్తవాలు తెలుసుకొని ఈ విత్తనాలు వాడకుండా జాగ్రత్తపడాలని తెలంగాణ విత్తనాభివృద్ధి సంస్థ మేనేజింగ్ డైరెక్టర్, సీనియర్ శాస్త్రవేత్త డా. కేశవులు ‘సాక్షి సాగుబడి’ ద్వారా సూచిస్తున్నారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే.. హెర్బిసైడ్ టాలరెంట్ (హెచ్.టి.) పత్తి అనేది ప్రభుత్వ ఆమోదం లేని కలుపు మందును తట్టుకునే జన్యువును కలిగి ఉన్న ఒక రకమైన జన్యుమార్పిడి పత్తి. దీన్ని సాధారణంగా బీజీ–3 (రౌండ్ అప్ రెడీ ఫ్లెక్స్)గా వ్యవహరిస్తుంటారు. దీని సాగుకు భారత ప్రభుత్వ ఆమోదం లేదు. బీజీ 3 పత్తి విత్తనాలను ఉత్పత్తి చేయటం, అమ్మటం మన దేశంలో చట్టవిరుద్ధం. కలుపు మందును తట్టుకునే పత్తి రకాన్ని మోనో శాంటో అభివృద్ధి చేసి ‘రౌండ్–అప్ రెడీ ఫ్లెక్స్ (ఆర్.ఆర్.ఎఫ్.) పేరుతో అమెరికాలో విక్రయిస్తూ ఉంది. మన దేశంతో సహా ప్రపంచదేశాల్లో కూడా అమ్మటానికి ఆ కంపెనీ ప్రయత్నిస్తోంది. హెచ్.టి. పత్తి గింజలో గ్లైఫోసేట్ కలుపు మందును తట్టుకునే అదనపు జన్యువు ఉంది. అందువల్ల, ఈ పంటను పొరపాటున సాగు చేసే రైతులు పొలాల్లో కలుపు మొక్కల నియంత్రణ కోసం గ్లైఫోసేట్ను గుడ్డిగా పిచికారీ చేసే ప్రమాదం ఉంది. అయితే, గ్లైఫోసేట్ కలుపు మందు క్యాన్సర్ కారక ప్రభావాన్ని కలిగి ఉందని రైతులు తెలుసుకోవాలి. అంతేకాదు, మీరు పొలాల్లో అనుమతి లేని ఈ పంటను సాగు చేస్తే పరాగ సంపర్కం ద్వారా సమీపంలోని మొక్కలకు కలుపు మందును తట్టుకునే జన్యువు అనియంత్రితంగా వ్యాప్తి చెందే ప్రమాదం ఉంది. ఇది వివిధ రకాల ‘సూపర్ వీడ్’(కలుపు మందులకు లొంగని మొండి జాతి కలుపు మొక్క)లను సృష్టిస్తుంది. భారత ప్రభుత్వ ఆమోదం లేని కలుపు మందులను తట్టుకునే లక్షణం కలిగిన జన్యువు ఉద్దేశపూర్వకంగానో లేదా అనుద్దేశపూర్వకంగానో గుర్తు తెలియని సంస్థలు/ ఏజెన్సీల ద్వారా మన దేశంలోని రైతుల పొలాల్లోకి, పర్యావరణంలోకి విడుదలైంది. అది ఇప్పుడు రైతులు పండించిన పత్తి పొలాల్లోకి చేరి ఇతర సంకరజాతి పత్తి రకాలను కూడా కలుషితం చేస్తూ.. జీవ వనరుల స్వచ్ఛతకు ముప్పుగా పరిణమించింది. జెనెటిక్ ఇంజనీరింగ్ అప్రైజల్ కమిటీ(జీఈఏసీ) అనుమతి లేకుండా ఏదైనా పత్తి విత్తనాన్ని ఉత్పత్తి చేయడం/అమ్మటం పర్యావరణ పరిరక్షణ చట్టం ప్రకారం చట్టవిరుద్ధం. ఇది జీఈఏసీ ఆమోదం పొందనందున, మన దేశంలో అక్రమంగా విక్రయిస్తున్న బీజీ3ౖ విత్తనం నాణ్యతపై జవాబుదారీతనం లేదు. అంతేకాదు, పర్యావరణం కలుషితమవుతున్నది. చట్టవిరుద్ధమైన బీజీ 3 పత్తి విత్తనాలు చిన్న, సన్నకారు పత్తి రైతులను నాశనం చేయడమే కాకుండా దేశంలోని మొత్తం చట్టపరమైన పత్తి విత్తన మార్కెట్‌కు కూడా ముప్పుగా తయారయ్యాయి. అంతేకాదు, గ్లైఫోసేట్ కలుపు మందును పంటలు వేయని ప్రాంతాల్లో మాత్రమే వాడటానికి చట్టం అనుమతిస్తుంది. అందువల్ల, అనుమతి లేని బీజీ 3 పత్తి విత్తనాలు వేసి గ్లైఫోసేట్ కలపు మందును రైతులు విచక్షణారహితంగా పొలాల్లో పిచికారీ చేస్తే.. అది మనుషులు, జంతువుల ఆరోగ్యంతో పాటు జీవవైవిధ్యం, నేల ఆరోగ్యంపై, భూసారంపై ప్రతికూల ప్రభావం చూపుతుంది. అందువల్లౖ రైతులు కలుపు మందును తట్టుకునే (హెచ్.టి.) బీజీ 3 పత్తిని ఎందుకు సాగు చేయకూడదంటే : – బీజీ 3 పత్తి సాగుకు ప్రభుత్వ∙అనుమతి లేదు. దేశంలో దీని సాగు చట్టవిరుద్ధం. – బీజీ 3 పత్తి సాగు గ్లైఫోసేట్ వినియోగాన్ని ప్రోత్సహిస్తుంది. ఇది క్యాన్సర్‌కు కారణం కావచ్చు. నేల ఆరోగ్యంపై, భూ సారంపై ప్రతికూల ప్రభావం చూపుతుంది. నీటిని కలుషితం చేస్తుంది. జంతువులు, మనుషుల ఆరోగ్యాన్ని కూడా దెబ్బ తీస్తుంది. – రైతులు ఈ అక్రమ విత్తనాలను ఉపయోగించడం వలన పంట పోవచ్చు/ దిగుబడి నష్టం జరగొచ్చు/ ఆదాయం తగ్గిపోవచ్చు. – ఈ రకం పత్తి సాగు వల్ల కొన్నాళ్లకు కలుపు మందులు చల్లినా చనిపోని మొండి కలుపు మొక్కలు తయారు కావచ్చు. మొండి కలుపును నియంత్రించడం చాలా కష్టం. అంటే, రైతులు ఈ కలుపు మొక్కల నియంత్రణకు మరింత ఎక్కువ డబ్బు ఖర్చు చేయాల్సి ఉంటుంది. పైగా తక్కువ దిగుబడి/పంట నష్టానికి దారితీయవచ్చు. కాబట్టి, బీజీ 3/హెచ్.టి. పత్తి విత్తనాలకు రైతులు దూరంగా ఉంటే మంచిది. – పంతంగి రాంబాబు, సాక్షి సాగుబడి డెస్క్ తెలంగాణ విత్తనాభివృద్ధి సంస్థ మేనేజింగ్ డైరెక్టర్, సీనియర్ శాస్త్రవేత్త డా. కేశవులు -
పంట పొలాల్లో తిష్టవేసుకొని కూర్చున్న ప్లాస్టిక్ భూతం
పంట పొలాల్లో ప్లాస్టిక్ భూతం తిష్టవేసుక్కూచుంది. వ్యవసాయంలో చాలా పనుల కోసం ప్లాస్టిక్ ఉత్పత్తుల వాడకం గత 70 ఏళ్లుగా అనేక రెట్లు పెరిగింది. మల్చింగ్ షీట్లు, ఫామ్‌పాండ్ లైనింగ్, ప్లాస్టిక్ డ్రిప్ లేటరల్స్, పీవీసీ పైపులు, గ్రీన్ హౌస్‌ల పైకప్పులు, సైలేజీ గడ్డి బేల్స్ కోసం ఫిల్మ్‌ల తదితర పనుల కోసం వ్యవసాయంలో ప్లాస్టిక్ వాడకం అంతకంతకూ పెరుగుతోంది. వీటిల్లో ప్లాస్టిక్ మల్చింగ్ షీట్ ముఖ్యమైనది. ఒక పంట కాలంలో చిరిగిపోయే పల్చటి షీట్ ఇది. కలుపును నివారించడం ద్వారా కలుపు తీత శ్రమతో పాటు ఖర్చును లేదా రసాయనిక కలుపు మందుల ముప్పును/ వాటి కొనుగోలు ఖర్చును తగ్గించడం.. మట్టిలో నుంచి నీటి తేమ ఆరిపోకుండా చూడటం ద్వారా నీటిని ఆదా చేయటం ద్వారా దిగుబడి పెరుగుదలకు ప్లాస్టిక్ మల్చింగ్ షీట్లు ఉపయోగపడుతున్నాయి. కోటి 25 లక్షల టన్నుల ప్లాస్టిక్ సేద్యం 2019వ సంవత్సర కాలంలో ప్రపంచవ్యాప్తంగా పంటల సాగు, ఆక్వా సాగు, చేపల వేట దగ్గరి నుంచి ఆయా ఆహారోత్పత్తులను వినియోగదారులకు చేర్చే వరకు ఉన్న దశలన్నిటిలో కలిపి సుమారు కోటి 25 లక్షల టన్నుల ప్లాస్టిక్‌ను వినియోగించినట్లు ఐరాసకు చెందిన ఆహార వ్యవసాయ సంస్థ (ఎఫ్.ఎ.ఓ.) అంచనా వేసింది. ప్రపంచవ్యాప్తంగా పంటలు/ఉద్యాన తోటల సాగులో, పశువుల పెంపకంలో ఏడాదికి కోటి టన్నుల ప్లాస్టిక్ వాడుతుండగా.. ఇందులో మల్చింగ్ ఫిల్మ్ వాటా 34 లక్షల టన్నులు. చేపల వేట, ఆక్వా సాగులో 21 లక్షల టన్నులు, అటవీ ఉత్పత్తులకు సంబంధించి మరో 2 లక్షల టన్నుల ప్లాస్టిక్ సామగ్రి వాడుతున్నారు. 2030 నాటికి వ్యవసాయంలో ప్లాస్టిక్ వాడకం 50% పెరగనుందని వ్యాపారుల అంచనా. ఖచ్చితమైన గణాంకాలు అందుబాటులో లేకపోయినప్పటికీ, వ్యవసాయ రంగంలో ప్రపంచవ్యాప్తంగా వాడుతున్న ప్లాస్టిక్‌లో సింహభాగం అంటే 60 లక్షల టన్నుల ప్లాస్టిక్ (ప్రపంచ వినియోగంలో సగం)ను ఆసియా దేశాల్లో రైతులే వాడుతున్నారని ఎఫ్.ఎ.ఓ. చెబుతోంది. ప్లాస్టిక్ అవశేషాలతో ముప్పేమిటి? పంట భూముల్లో మిగిలిపోయే ప్లాస్టిక్ మల్చింగ్ షీట్ అవశేషాల వల్ల ఆయా భూములు కాలుష్యం బారిన పడినందున సూక్ష్మజీవరాశి నశించి పంట దిగుబడులు తగ్గిపోతున్నట్లు ఎఫ్.ఎ.ఓ. పేర్కొంది. ఇలా భూమిలో కలిసిన ప్లాస్టిక్ (ముఖ్యంగా మల్చింగ్ ఫిల్మ్ అవశేషాల) ద్వారా వెలువడే మైక్రోప్లాస్టిక్స్ (సూక్ష్మప్లాస్టిక్ కణాలు) ఆహారోత్పత్తులు, నీటి ద్వారా తిరిగి మనుషులకు చేరి వారికి అనారోగ్యం కలిగించడం కూడా జరుగుతోందని ఎఫ్.ఎ.ఓ. ఆందోళన వ్యక్తం చేసింది. పెద్ద ఎత్తున పోగుపడే వ్యవసాయ ప్లాస్టిక్ వ్యర్థాల వల్ల వన్యప్రాణులు, మూగజీవాలు కూడా అనారోగ్యం పాలువుతున్నాయి. కొన్ని ప్లాస్టిక్ కణాలలో ఉండే థాలేట్స్, బిస్పినాల్స్ వంటి విషతుల్య పదార్థాలు మనుషుల హార్మోన్ వ్యవస్థను అస్థవ్యస్థం చేసి ఆనారోగ్యాల బారిన పడేస్తాయి. ఈ ప్లాస్టిక్ వస్తువులు, సూక్ష్మప్లాస్టిక్ కణాలు వాగులు, కాలువల ద్వారా సముద్రంలోకి చేరి జలచరాలకు దీర్ఘకాలం హాని చేస్తున్నాయి. వ్యవసాయ ప్లాస్టిక్ వ్యర్థాలను ఒక పద్ధతి ప్రకారం సేకరించి, పునర్వినియోగించే పటిష్ట వ్యవస్థ కొరవడింది. సేకరించి పొలాల్లోనే తగటబెడుతున్నారు. ఒక వేళ చెత్త కుప్పల్లో వేసినా.. అక్కడ వాటికి నిప్పు పెడుతున్నారు. తగలబడిన ప్లాస్టిక్ నుంచి పాలీక్లోరినేటెడ్ డిబెన్జో–పి–డయాక్సిన్లు, ఫ్యురాన్లు వంటి విషతుల్య వాయువులు వెలువడుతూ ప్రజారోగ్యానికి, పర్యావరణానికి పెనుముప్పుగా మారుతున్నాయి. ఒక వైపు ఆహారోత్పత్తి పెరుగుదలకు దోహదపడుతున్న ఈ ప్లాస్టిక్.. మరోవైపు ఆహారభద్రతపై, ఆహార నాణ్యత, పౌష్టికాహార శోషణపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతున్నాయి. అదేవిధంగా, సాంఘిక, ఆర్థిక పరంగా నష్టాలకు కారణభూతమవుతోంది. అందువల్ల, వ్యవసాయంలో ప్లాస్టిక్ ఉత్పత్తుల వాడకాన్ని గాడిన పెట్టి, ప్రత్యామ్నాయాలపై సీరియస్‌గా దృష్టి సారించాల్సిన అవసరం ఉందంటూ ఎఫ్.ఎ.ఓ. శాస్త్రవేత్తలకు, పారిశ్రామికవేత్తలకు, పాలకులకు అనేక సూచనలు చేసింది. కిలో షీట్‌తో 700 చ.అ.ల భూమి కలుషితం పంట పూర్తయిన తర్వాత చీలికలు పేలికలయ్యే మల్చింగ్ ప్లాస్టిక్ షీట్ ముక్కలను ఏరివేయటం పెద్ద సమస్యగా మారింది. వీలైనంత వరకు ఏరి తగులబెట్టడం లేదా చెత్తకుప్పలో వేస్తున్నారు. మిగతా ప్లాస్టిక్ ముక్కలు భూమిలో అలాగే ఉండిపోతున్నాయి. వీటితో పాటు డ్రిప్ లేటరల్స్ ముక్కలు తదితర ప్లాస్టిక్ వస్తువులను సక్రమంగా ఏరి తిరిగి ఉపయోగించే పరిస్థితి లేనందున భూమి ప్లాస్టిక్ కాలుష్యం బారిన పడుతోంది. ఆసియా దేశాల్లో 10 శాతాన్ని మాత్రమే సేకరించి, తిరిగి వాడగలుగుతున్నామని అంచనా. మట్టిలో కలిసే సూక్ష్మ ప్లాస్టిక్ కణాలు మట్టిలోని సూక్ష్మజీవరాశిని నాశనం చేస్తున్నాయి. దీంతో భూసారం దెబ్బతింటున్నది. ఒక కిలో పల్చటి ప్లాస్టిక్ షీట్ 700 చదరపు అడుగుల విస్తీర్ణంలో వ్యవసాయ భూమిని కలుషితం చేస్తోందని అంచనా. చమురు, సహజవాయువు లేదా బొగ్గు వంటి శిలాజ ఇంధనాలను శుద్ధిచేసి 99% ప్లాస్టిక్ ఉత్పత్తులను తయారు చేస్తున్నారు. ఇవి ఒక వైపు ఉపయోగపడుతూనే నిర్వహణ లోపం వల్ల మనుషులు, పశు పక్ష్యాదుల ఆరోగ్యానికి, పర్యావరణానికి తీరని హాని కలిగిస్తున్నాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ప్రత్యామ్నాయాలున్నప్పటికీ..! రసాయనిక కలుపు మందులు వాడకుండా, కలుపు మొలవకుండా చూసేందుకు వ్యవసాయంలో వాడుతున్న ప్లాస్టిక్ మల్చింగ్ ఫిల్మ్‌కు ప్రత్యామ్నాయాలు అనేకం. పంటల మార్పిడి పాటించడం, పంట పొలంలో ఖాళీ లేకుండా అంతర పంటలు వేయటం(సజీవ ఆచ్ఛాదన) లేదా ఎండుగడ్డి వంటి పంట వ్యర్థాలను మల్చింగ్గా వాడటం వంటి మార్గాలున్నాయి. త్వరగా చివికి భూమిలో కలిసిపోయే పర్యావరణహితమైన (బయోడీగ్రేడబుల్) మల్చింగ్ ఫిల్మ్‌లను సంపన్న దేశాల్లో వాడుతున్నారు. అదేవిధంగా, మన కాయిర్ బోర్డు రూపొందిస్తున్న కొబ్బరి పీచుతో తయారు చేసే ‘భూవస్త్రాలు’ కూడా పంటల మధ్య ఆచ్ఛాదనకు ఉపయోగపడతాయి. కొద్ది నెలల్లో మట్టిలో కలిసిపోతాయి. అయితే, వీటితో వచ్చిన చిక్కేమిటంటే.. ప్లాస్టిక్ మల్చింగ్ ఫిల్మ్ కన్నా వీటి ధర 2–3 రెట్లు ఎక్కువగా ఉండటమే. ఈ ప్రతిబంధకాలను అధిగమించేందుకు ముఖ్యంగా ఆసియా దేశాలు పరిశోధనలకు ఊతమివ్వాలి. శాస్త్ర సాంకేతిక పరిశోధనలు ఫలించి, ధర అందుబాటులోకి వస్తే బయోడీగ్రేడబుల్ మల్చింగ్ ఫిల్మ్‌లు మన దేశంలోనూ రైతులకు అందుబాటులోకి వస్తాయని ఆశించవచ్చు. – పంతంగి రాంబాబు, సాక్షి సాగుబడి డెస్క్ -
తక్కువ స్థలంలో ఎక్కువ కూరగాయలు.. ఇంటిపంట ఇలా వేసుకోండి
ఇరవై రెండేళ్ల మందిసా మటేంజ్వా స్వస్థలం.. దక్షిణ ఆఫ్రికా, క్వాజూలూ–నటాల్ రాష్ట్రంలోని ఎంపాంగని అనే పట్టణం. రెండేళ్ల క్రితం.. యూనివర్సిటీ ఆఫ్ ద ఫ్రీ స్టేట్‌లో బీఎస్సీ పూర్తిచేసింది. అందులో అగ్రికల్చర్ కూడా ఒక సబ్జెక్ట్. డిగ్రీ అయ్యాక ఏదో ఒక ఉద్యోగం వెతుక్కుంటున్న క్రమంలో మిస్టర్ ప్రైస్ ఫౌండేషన్ ఆఫర్ చేస్తున్న ‘హేండ్పిక్’ అర్బన్ అగ్రికల్చర్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ గురించి తెలిసి జాయినైంది. డర్బన్ నగరంలో అర్బన్ అగ్రికల్చర్ శిక్షణ కేంద్రంలో ఇంటర్న్‌గా చేరింది. 12 నెలల ఆ శిక్షణ మందిసా జీవితాన్ని అనూహ్యమైన మలుపు తిప్పింది. ప్రస్తుతం ఆమె డర్బన్ నగరంలోని కామతేంజ్వా అర్బన్ ఫామ్‌కి యజమాని కమ్ మేనేజర్. కాప్సికం, ఫ్రిల్లీ, బటర్ లెట్యూస్, బేబీ పాలకూర, తులసి, పచ్చిమిర్చి, పుదీనా, పార్ల్సీ, ఉల్లికాడలు వంటి కూరగాయలు, ఔషధ మొక్కల్ని సాగు చేసి నగరవాసులకు విక్రయిస్తూ మంచి ఆదాయం పొందుతోంది. ఓ యువ గ్రాడ్యుయేట్ సుశిక్షితురాలైన అర్బన్ అగ్రిప్రెన్యూర్‌గా మారింది. సాధికారతకు పవర్ ఇది. మిస్టర్ ప్రైస్ ఫౌండేషన్ గత మూడేళ్లలో మందిసా సహా 24 మంది గ్రాడ్యుయేట్లను ‘హాండ్పిక్’ ప్రోగ్రామ్‌లో భాగంగా స్వతంత్ర అర్బన్ ఫార్మర్స్‌గా మార్చింది. సుస్థిర సాగు పద్ధతులను నేర్పించటం ద్వారా ఆరోగ్యదాయకమైన కూరగాయలు, ఔషధ మొక్కల్ని నగరాల్లో, నగర పరిసర ప్రాంతాల్లో స్థానికంగానే పండించుకొని తినటం అలవాటు చేయటమే మిస్టర్ ప్రైస్ ఫౌండేషన్ లక్ష్యం. ఆఫ్రికన్ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడంతో పాటు గృహస్థులకు, నగరవాసులకు కూడా హైడ్రోపోనిక్స్ పద్ధతిలో పంటల సాగును ఈ ఫౌండేషన్ నేర్పిస్తోంది. తక్కువ స్థలంలో, తక్కువ నీటితో ఎక్కువ పంటలు పండించటం కోసం కొబ్బరి పొట్టు ఎరువులో ద్రవరూప ఎరువులను వాడే పద్ధతిని ఇది ప్రాచుర్యంలోకి తెస్తోంది. ఒక్కో కుండీకి పంటను బట్టి 4–6 మొక్కలు చొప్పున, నిలువుగా ఒకదాని కింద మరొకటి 4 కుండీలు ఉండేలా హైడ్రోపోనిక్ వర్టికల్ టవర్లను ఉపయోగిస్తోంది. 16 నుంచి 24 మొక్కల్ని మనిషి నిలబడేంత చోటులోనే పండించటం ఈ టవర్ల ప్రత్యేకత. ఈ టవర్లకు ‘ఆఫ్రికన్ గ్రోయర్’ అని పేరు పెట్టారు. మిస్టర్ ప్రైస్ ఫౌండేషన్ అనేక చోట్ల అర్బన్ అగ్రికల్చర్ శిక్షణ కేంద్రాలను నిర్వహిస్తోంది. కేప్‌టౌన్ నగరంలోని లాంగా ప్రాంతంలో కొద్ది నెలల క్రితం ఒక సిటీ రూఫ్‌టాప్ ఫామ్ ప్రారంభమైంది. రీడిఫైన్ ప్రాపర్టీస్ అనే రిటైల్ వాణిజ్య సంస్థతో కలసి కెనిల్వర్త్ సెంటర్ పేరిట ఈ ఫామ్‌ను మిస్టర్ ప్రైస్ ఫౌండేషన్ ఏర్పాటు చేసింది. ఈ స్థలాన్ని ఉచితంగా రీడిఫైన్ ప్రాపర్టీస్ ఇచ్చింది. ఈ హైడ్రోపోనిక్ ఫామ్‌లో పండించే కూరగాయలు అమ్మగా వచ్చే ఆదాయం ఫౌండేషన్ కార్యకలాపాలకే వినియోగిస్తున్నారు. రీడిఫైన్ ప్రాపర్టీస్ చీఫ్ సస్టెయినబిలిటీ ఆఫీసర్ అనెలిసా కెకె.. ‘యువత నిరుద్యోగ సమస్యకు అర్థవంతమైన, దీర్ఘకాలిక సుస్థిర పరిష్కారాన్ని వెతకాలని ప్రయత్నిస్తున్నాం. పనిలో పనిగా స్థానిక ప్రజలకు ఆరోగ్యదాయకమైన ఆహారాన్ని అందుబాటులోకి తేవాలన్నది మా ఉద్దేశం. యువత ఉపాధికి, పర్యావరణానికి, ప్రజారోగ్యానికి ఏ విధంగా తోడ్పాటునందించవచ్చో తెలియజెప్పడానికి రిటైల్ వాణిజ్య భవన సముదాయాల యజమానులు ఒక ఉదాహరణగా నిలవాలన్నదే మా ప్రయత్నం’ అంటున్నారు. మిస్టర్ ప్రైస్ ఫౌండేషన్ అర్బన్ అగ్రికల్చర్ కృషికి పలు సంస్థలు తోడ్పాటునందిస్తున్నాయి. మిస్టర్ ప్రైస్ ఫౌండేషన్ హేండ్పిక్ ప్రోగ్రామ్ నిర్వాహకుడు డేవిడ్ చర్చ్మన్ ‘రసాయనిక వ్యవసాయ పద్ధతులకు భిన్నమైన సుస్థిర వ్యవసాయ పద్ధతులను స్థానికులకు అలవాటు చేయటం, స్థానికంగానే కూరగాయలు, ఔషధమొక్కల ఉత్పత్తిని పెంపొందించడటం లక్ష్యంగా పనిచేస్తున్నాం. మా వద్ద శిక్షణ పొందిన వారి సుసంపన్నమైన అనుభవాలను నగరాల్లో జరిగే వివిధ సభలు, సమవేశాల్లో వారితోనే చెప్పిస్తూ ప్రజల్లో చైతన్యం తెచ్చే ప్రయత్నం చేస్తున్నాం. సంతృప్తికరమైన ఫలితాలే వస్తున్నాయి’ అంటూ వివరించారు. – పంతంగి రాంబాబు prambabu.35@gmail.com -
బలవర్ధకమైన ఆరిక అన్నం గురించి ఈ విషయాలు తెలుసా?
మొలిచిన తర్వాత 40–50 రోజులు వర్షం లేకపోయినా.. బతికి ఉండటమే కాదు చక్కని దిగుబడినిచ్చే అద్భుత ఆహార పంట.. ఆరిక అన్నం గురించి ఈ విషయాలు మీకు తెలుసా? ఆరిక అన్నం ఇంటిల్లపాదికీ అత్యంత బలవర్ధకమైన, ఔషధ గుణాలున్న ఆహారం. ఖరీఫ్‌లో మాత్రమే సాగయ్యే చిరుధాన్య పంట ఆరిక మాత్రమే. ఆరిక 160–170 రోజుల పంట. విత్తిన తర్వాత దాదాపు 6 నెలలకు పంట చేతికి వస్తుంది. ఆరికలు విత్తుకోవడానికి ఆరుద్ర కార్తె (జూన్ 22 నుంచి జూలై 6 వరకు) అత్యంత అనువైన కాలం. మొలిచిన తర్వాత 40–50 రోజులు వర్షం లేకపోయినా ఆరిక పంట నిలుస్తుంది. ఇతర పంటలు అంతగా నిలవ్వు. చిరుధాన్యాల్లో చిన్న గింజ పంటలు (స్మాల్ మిల్లెట్స్).. ఆరిక, కొర్ర, సామ, ఊద, అండుకొర్ర. ఆరిక మినహా మిగతా నాలుగు పంటలూ 90–100 రోజుల్లో పూర్తయ్యేవే. చిరుధాన్యాల సేంద్రియ సాగులో అనుభవజ్ఞుడు, వైఎస్సార్ కడప జిల్లాకు చెందిన రైతు శాస్త్రవేత్త కె.విజయకుమార్ ‘సాక్షి సాగుబడి’కి వివరించారు. సేంద్రియ పద్ధతుల్లో ఆరికల సాగులో మెలకువలను ఆయన మాటల్లోనే ఇక్కడ పొందుపరుస్తున్నాం.. ఆరిక గింజలు ఒక్క వర్షం పడి తేమ తగలగానే మొలుస్తాయి. ఒక్కసారి మొలిస్తే చాలు. గొర్రెలు తిన్నా మళ్లీ పెరుగుతుంది ఆరికె మొక్క. మొలిచిన తర్వాత దీర్ఘకాలం వర్షం లేకపోయినా తట్టుకొని బతకటం ఆరిక ప్రత్యేకత. మళ్లీ చినుకులు పడగానే తిప్పుకుంటుంది. అందువల్ల సాధారణ వర్షపాతం కురిసే ప్రాంతాలతో పాటు అత్యల్ప వర్షపాతం కురిసే ప్రాంతాలకూ ఇది అత్యంత అనువైన పంట. నల్ల కంకి సమస్యే ఉండదు. దిబ్బ ఎరువు/గొర్రెల మంద ఆరిక పంటకు రసాయనిక ఎరువులు, పురుగుమందులు అవసరం లేదు. పొలాన్ని దుక్కి చేసుకొని మాగిన పశువుల దిబ్బ ఎరువు ఎకరానికి 4–5 ట్రాక్టర్లు(12 టన్నులు) వెదజల్లాలి. లేదా గొర్రెలు, మేకలతో మందగట్టడం మంచిది. గొర్రెలు, మేకలు మూత్రం పోసిన చోట ఆరిక అద్భుతంగా దుబ్బు కడుతుంది. శ్రీవరి సాగులో మాదిరిగా 30–40 పిలకలు వస్తాయి. పొలాన్ని దుక్కి చేసి పెట్టుకొని.. మంచి వర్షం పడిన తర్వాత ఆరికెలను విత్తుకోవాలి. వెదజల్లటం కన్నా గొర్రుతో సాళ్లుగా విత్తుకోవడం మంచిది. గొర్రుతో విత్తితే విత్తనం సమాన లోతులో పడుతుంది. ఒకరోజు అటూ ఇటుగా మొలుస్తాయి. ఒకేసారి పంటంతా కోతకు వస్తుంది. 8 సాళ్లు ఆరికలు విత్తుకొని, 1 సాలు కందులు, మళ్లీ 8 సాళ్లు ఆరికలు, ఒక సాలు ఆముదాలు విత్తుకోవాలి. ఎకరానికి 3 కిలోల ఆరిక విత్తనం కావాలి. కంది విత్తనాలు ఎకరానికి ఒకటిన్నర కిలోలు కావాలి. కిలోన్నర కందుల్లో వంద గ్రాములు సీతమ్మ జొన్నలు, 50 గ్రాములు తెల్ల / చేను గోగులు కలిపి విత్తుకోవాలి. ఎకరానికి 3 కిలోల ఆముదం విత్తనాలు కావాలి. ఎకరానికి పావు కిలో నాటు అలసందలు /బొబ్బర్లు, అర కిలో అనుములు, వంద గ్రాముల చేను చిక్కుళ్లు ఆముదాలలో కలిపి చల్లుకోవాలి. ఆరికలు విత్తుకునేటప్పుడు కిలో విత్తనానికి 4 కిలోల గండ్ర ఇసుక కలిపి విత్తుకోవాలి. ఆరికల విత్తనాలు ఎంత సైజులో ఉంటాయో అదే సైజులో ఉండే ఇసుక కలిపి గొర్రుతో విత్తుకోవాలి. కందులు, ఆముదం తదితర విత్తనాలను అక్కిలి / అక్కిడి కట్టెలతో విత్తుకోవాలి. ఆరికలను మిశ్రమ సాగు చేసినప్పుడు పెద్దగా చీడపీడలేమీ రావు. వ్యయ ప్రయాసలకోర్చి కషాయాలు పిచికారీలు చేయాల్సిన అవసరం లేదు.ఐదారు రకాల పంటలు కలిపి సాగు చేయడం వల్ల చీడపీడలు నియంత్రణలో ఉంటాయి. రైతు కుటుంబానికి కవాల్సిన అన్ని రకాల పంటలూ చేతికి వస్తాయి. ఆహార భద్రత కలుగుతుంది. కంది, సీతమ్మ జొన్న తదితర పంట మొక్కల పిలకలు తుంచేకొద్దీ మళ్లీ చిగుర్లు వేస్తూ పెరుగుతాయి. పక్షి స్థావరాలుగా కూడా ఇవి ఉపయోగపడతాయి. చేను చిక్కుళ్లు వర్షానికే పెరుగుతాయి. అనుములు, అలసందలు 35–40 రోజుల నుంచే కాయలు కోతకు వస్తాయి. రైతు కుటుంబానికి ఆహార భద్రత కలుగుతుంది. ఆర్నెల్లకు మంచి ఆదాయం కూడా వస్తుంది. వీటిని ఒకసారి విత్తితే చాలు. తర్వాత పెద్దగా చేయాల్సిన పనులేమీ ఉండవు. ఆరుద్ర కార్తెలో విత్తుకుంటే డిసెంబర్ చివర్లోనో, జనవరి మొదట్లోనో కోత కోసుకోవచ్చు. కోతల తర్వాత ఆరిక దుబ్బు మళ్లీ చిగురిస్తుంది. అది పశువులకు మంచి బలమైన మేత. ఆరిక గడ్డి వరి గడ్డి కన్నా గట్టిది. త్వరగా కుళ్లిపోదు. అందువల్ల ఎయిర్ కూలర్లలో వాడుతుంటారు. ఎకరాకు రూ. 60 వేల నికరాదాయం వర్షాధారంగా మెట్ట భూముల్లో ఆరికలు సాగు చేస్తే ఎకరానికి ఎంత లేదన్నా 6–8 క్వింటాళ్ల వరకు దిగుబడి వస్తుంది. కందులు 3 క్వింటాళ్లు వస్తాయి. ఆముదాలు 5 క్వింటాళ్లు వస్తాయి. అలసందలు, అనుములు, జొన్నలు ఇంకా అదనం. ఆరికలు ప్రధాన పంటగా ఈ పద్ధతిలో సాగు చేస్తే ఎకరానికి రూ. 40 వేల నుంచి 60 వేల వరకు రైతుకు నికరాదాయం వస్తుంది. నీటి వసతి ఉండే రైతులు నాలుగు తడులు ఇస్తే దిగుబడి ఇంకా పెరుగుతుంది. ఆరు నెలల పంటైనందున ఆరికలను ఆరుద్ర కార్తెలోనే విత్తుకోవడం అనాదిగా రైతులు అనుసరిస్తున్న పద్ధతి. ఆరికలతోపాటు ఇతర సిరిధాన్యాలను కూడా ఈ కాలంలో విత్తుకోవచ్చు. పూర్తిగా ఎండిన తర్వాతే కోయాలి పక్వానికి రాక ముందే కోయకుండా జాగ్రత్తవహించిన రైతులకు నాణ్యమైన ఆరిక ధాన్యం దిగుబడి వస్తుంది. విత్తిన తర్వాత ఆరికలను 160–170 రోజులు పొలంలో ఉంచాల్సిందే. పూర్తిగా పంట ఎండి గింజ, కర్ర నలుపు రంగులోకి రావాలి. అటూ ఇటూ కాకుండా ఊదా రంగులో ఉన్నప్పుడు కొయ్యకూడదు. తొందరపడి ముందే కోస్తే తాలు గింజ ఎక్కువగా వస్తుంది. 8 క్వింటాళ్లు రావాల్సిన దిగుబడి 5 క్వాంటాళ్లే వస్తుంది. పైగా అవి విత్తనంగా పనికి రావు. బియ్యం దిగుబడి కూడా తగ్గిపోతుంది. అందువల్ల వ్యాపారులు రైతులకు మంచి ధర ఇవ్వలేని పరిస్థితి వస్తుంది. పక్వానికి వచ్చే వరకు ఆగి కోసి, కుప్పపై కొద్ది రోజులు ఉంచి నూర్పిడి చేయాలి. అప్పుడు మంచి తూకం వస్తుంది. అన్నం కూడా మంచి రుచి వస్తుంది. ♦ కొర్రలు, అండుకొర్రలు, ఊదలు, బరిగెలు, గోల్డు బరిగలను సాగు చేయవచ్చు. వీటి పంటకాలం 10–80 రోజులు. ఎకరానికి 8–9 క్వింటాళ్ల దిగుబడి వస్తుంది. ఎటువంటి రసాయనిక ఎరువులు, పురుగుమందులు వేయాల్సిన అవసరం లేదు. ఎటువంటి నేలల్లోనైనా పండుతాయి. ఎకరాకు 3 కిలోల విత్తనం చాలు. ♦ కొర్రలో జడ కొర్ర, ముద్ద కొర్ర రకాలుంటాయి. ముద్ద కొర్ర కంకిపై నూగు పీచు అధికంగా ఉంటుంది. కాబట్టి పిచుకలు తినడానికి అవకాశం ఉండదు. 85–95 రోజుల్లో కోతకు వస్తాయి. నల్లరేగడి, తువ్వ, ఎర్రచెక్క, ఇసుక నేలల్లో ఎకరాకు 8 క్వింటాళ్ల దిగుబడి వస్తుంది. చౌడు గరప నేలల్లో దిగుబడి తక్కువగా వస్తుంది. ఎకరానికి 3 కిలోల విత్తనం చాలు. ♦ ఊదలు ఎటువంటి నేలల్లోనైనా సాగు చేయవచ్చు. ఒకమాదిరి జిగట, ఉప్పు నేలల్లోనూ, నీరు నిలువ ఉన్న నేలల్లోనూ సాగు చేయవచ్చు. భూమిని తేలికపాటుగా మెత్తగా దున్ని పశువుల ఎరువు ఎకరానికి 5 టన్నులు వేసి కలియదున్నాలి. అది లేకపోతే గొర్రెలు, ఆవుల మందను పొలంలో మళ్లించాలి. కలుపు లేకుండా చూసుకోవాలి. ♦ రసాయనిక ఎరువులు, పురుగుమందుల అవసరం లేదు. భూమి సారవంతంగా ఉంటే 8–10 క్వింటాళ్ల దిగుబడి వస్తుంది. వంద నుంచి 110 రోజుల పంటకాలం. 5 సార్లు నీరు పారించాల్సి ఉంటుంది. వర్షాకాలంలో నీరు కట్టాల్సిన అవసరం లేదు. ♦ అండుకొర్రను ఏడాది పొడవునా సాగు చేయవచ్చు. ఎటువంటి నేలల్లోనైనా పండుతుంది. నీరు నిల్వ ఉండే భూములు పనికిరావు. దీన్ని పల్చగా విత్తుకోవాలి. ఎకరానికి 2 కిలోల విత్తనం సరిపోతుంది. పలచగా ఉంటే ఎక్కువ పిలకలు వస్తాయి. రసాయనిక ఎరువులు వాడకూడదు. యూరియా వేస్తే బాగా పెరిగి పడిపోతుంది. 90–105 రోజుల్లో పంట వస్తుంది. ♦ పంట పక్వానికి రాక ముందే కోస్తే గింజలు నాసిరకంగా ఉంటాయి. బియ్యం సరిగ్గా ఉండవు. పిండి అవుతాయి. సిరిధాన్యాలు ఏవైనా సరే గింజ ముదరాలి. కర్రలు బాగా పండాలి. అప్పుడు కోస్తేనే మంచి నాణ్యత వస్తుంది, మంచి ధర పలుకుతుంది. సిరిధాన్యాలు సాగు చేసిన భూమి ఏగిలి మారి సారవంతమవుతుంది. ♦ విత్తనాలు వేసుకునే ముందు విధిగా మొలక పరీక్ష చేసుకోవాలి. కొబ్బరి చిప్పలోనో, ప్లాస్టిక్ గ్లాసులోనో అడుగున చిన్న చిల్లి పెట్టి, మట్టి నింపాలి. తగుమాత్రంగా నీరు పోసి 2 గంటల తర్వాత 10–20 విత్తనాలు వేసి తేలికగా మట్టి కప్పేయాలి. రకాన్ని బట్టి 3–7 రోజుల మధ్య మొలక వస్తుంది. మొలక తక్కువగా ఉంటే ఆ ధాన్యం విత్తనానికి పనికిరాదని గుర్తించాలి. ♦ సిరిధాన్యాల సాగుపై సలహాల కోసం విజయకుమార్ (98496 48498) ను ఆంధ్రప్రదేశ్ రైతులు ఉ. 6–9 గం. మధ్యలో, తెలంగాణ రైతులు సా. 6–9 గం. మధ్య సంప్రదించవచ్చు. – పంతంగి రాంబాబు, సాక్షి సాగుబడి డెస్క్ వైఎస్సార్ కడప జిల్లాకు చెందిన రైతు శాస్త్రవేత్త కె.విజయకుమార్ -
అధరహో.. రైతులకు సంతృప్తి నిస్తోన్న పొగాకు ధరలు
సాక్షి ప్రతినిధి, ఒంగోలు: లం కేంద్రాల్లో పొగాకు ధరలు ఆల్‌టైమ్ రికార్డులు నమోదు చేసుకుంటున్నాయి. ఎన్నడూలేని విధంగా ఈ సారి ధరలు అధరహో అనిపిస్తున్నాయి. నాలుగైదు దశాబ్దాల కాలంలో ఈ స్థాయిలో రికార్డు ధరలు రాలేదని పొగాకు బోర్డు అధికారులు అంటున్నారు. ఈ ఏడాది వేలం ప్రక్రియ ప్రారంభం నుంచే ధరలు ఆశాజనకంగా ఉన్నాయి. ఉమ్మడి ప్రకాశం జిల్లా పరిధిలోని 11 వేలం కేంద్రాల్లో కేజీ గరిష్ట ధర రూ.249 నమోదు కావడం కూడా రికార్డే. అంతర్జాతీయంగా డిమాండ్ ఉండడంతో గ్రేడ్లతో సంబంధం లేకుండా పొగాకు కొనుగోలు చేసేందుకు వ్యాపారులు పోటీపడుతున్నారు. గత సీజన్‌తో పోలిస్తే ఈ సారి సరాసరి ధర సుమారు రూ.67 పెరిగింది. ఎప్పుడూ కనీవినీ ఎరుగని ధరలు పడడంతో పాత రికార్డులు బద్దలవుతున్నాయి. ఒకప్పుడు పొగాకు సాగు చేసిన రైతులు గిట్టుబాటు ధర లభించక ఆత్మహత్య చేసుకున్నారు. నష్టాల పాలై కుటుంబాలకు కుటుంబాలే దిక్కులేనివయ్యాయి. నాడు పగాకు ఉన్న పొగాకు నేడు సిరులు కురిపిస్తోంది. పొగాకు పంట పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు అత్యధిక స్థాయి ధర పలకడంతో రైతు కాలర్ ఎగురేస్తున్నాడు. ఇదిలా ఉండగా ఈ సీజన్లో పొగాకు కేజీ ధర ఆల్‌టైం రికార్డు స్థాయికి చేరి రూ.249 పలికింది. కనిష్ట స్థాయి ధర రూ.160 కూడా పొగాకు పంట మొదలెట్టినప్పటి నుంచి పలకలేదంటే అతిశయోక్తి కాదు. అటు హైగ్రేడ్, ఇటు లో గ్రేడ్ పొగాకు ధర రెండూ కలుపుకున్నా ఇవి కూడా ఆల్‌టైం రికార్డే. సరాసరి కేజీ పొగాకు ధర రూ.239.43 పలకడంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. గత సీజన్లో సరాసరి ధర రూ.172.49 పలికింది. నాలుగేళ్లుగా ఏ సీజన్‌కు ఆ సీజన్ ధరలు పెరుగుదలకు అంతర్జాతీయంగా ఉన్న డిమాండ్ ఒక కారణమైతే రైతులు సంక్షోభంలో ఉన్నప్పుడు ముఖ్యమంత్రి వైఎస్.జగన్మోహన్రెడ్డి ప్రభుత్వ రంగ సంస్థ అయిన మార్క్‌ఫెడ్‌ను రంగంలోకి దించడం మరో కారణం. అప్పటి నుంచే వ్యాపారులు కేజీ పొగాకు ధరను రూ.220కి దాటించి కొనుగోలు చేశారు. ధరల పెరుగుదల ఇలా.. వేలం చివరికి వచ్చే కొద్దీ పొగాకు రేట్లు ఊహించని స్థాయిలో పెరుగుతున్నాయి. ఈ నెల ప్రారంభం నాటికి గ్రేడ్–1 పొగాకు కేజీ ధర రూ.200 ఉండగా వారం రోజుల్లో ధర అమాంతం రూ.14కు పెరిగి అత్యధిక ధర రూ.214 కు చేరింది. ఆ తర్వాత మార్కెట్ ఊపందుకుంది. ఎవరూ ఊహించని విధంగా 10వ తేదీ నాటికి ధర రూ.243కి చేరింది. క్రమంగా ధరలు పెరుగుతూ వచ్చాయి. 16వ తేదీ నాటికి ధర రూ.249 చేరి ఆల్‌టైం రికార్డు నమోదు చేసింది. ప్రస్తుతం ధరలు రూ.245 వద్ద స్థిరంగా కొనసాగుతున్నాయి. ఇదిలా ఉండగా మన కంటే ముందు ముగిసిన కర్ణాటక మార్కెట్లో కేజీ పొగాకు ధర రూ.270 పలికింది. అదే స్థాయిలో ధరలు పెరుగుతాయని రైతులు ఆశాభావం వ్యక్తం చేశారు. అయితే వ్యాపారులు రేట్లు పెంచే విషయంలో ఆచితూచి వ్యవహరిస్తున్నారని, అందువల్లే ఇక్కడి మార్కెట్లో ఆ స్థాయిలో రేట్ల పెంచడం లేదనే వాదన రైతుల్లో ఉంది. డిమాండ్ ఉన్నా సరే వ్యాపారులు కొంత సిండికేట్‌గా ఏర్పడి భారీగా రేట్లు పెంచకుండా జాగ్రత్త పడుతున్నారని బోర్డు అధికారులు చెప్తున్నారు. ఈ నేపథ్యంలో వచ్చే నెల రోజుల్లో రేట్లు మరింత పెరిగే అవకాశం ఉన్నా ఏ స్థాయిలో రేట్లు పెరుగుతాయనేది వ్యాపారుల చేతుల్లోనే ఉంది. వ్యాపారుల్లో పెరిగిన పోటీ... పొగాకు వేలంలో గుత్తాధిపత్యాన్ని లేకుండా చేయటంతో పాటు రైతులను నిలువు దోపిడీ చేస్తున్న పొగాకు వ్యాపారులకు సీఎం వైఎస్ జగన్ చెక్ పెట్టారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో వ్యాపారులు పొగాకు రైతులను నిలువు దోపిడీ చేస్తున్నా అప్పటి సీఎం చంద్రబాబు నాయుడు కనీసం పట్టించుకున్న పాపాన పోలేదు. దీంతో వరుసగా టీడీపీ ప్రభుత్వ హయాంలో పొగాకు రైతులు ఐదేళ్ల పాటు నష్టాల పాలవుతూనే వచ్చారు. దీనిని గమనించిన సీఎం వైఎస్ జగన్ గత 2020–21 సంవత్సరంలో ప్రభుత్వ రంగ సంస్థ అయిన మార్క్‌ఫెడ్‌ను పొగాకు బహిరంగ వేలంలోకి దించారు. అందుకోసం రూ.220 కోట్లు విడుదల చేశారు. లో గ్రేడ్ పొగాకును కూడా ఎక్కువ ధరకు కొనుగోలు చేసి రైతులను ఆదుకున్నారు. అప్పటి నుంచి వేలంలో పొగాకు వ్యాపారులు పోటీపడి కొంటున్నారు. దీంతో రైతుకు మంచి ధర వస్తోంది. 70 శాతం నాణ్యమైన పొగాకు ఉత్పత్తి ఈ సారి పంట దిగుబడి ఎక్కువ రావటంతో పాటు నాణ్యమైన పొగాకు 70 శాతం దిగుబడి వచ్చి లో గ్రేడ్ పొగాకు 30 శాతం దిగుబడి వచ్చింది. అందులోనూ పండిన పంటలో 5 నుంచి 6 శాతం పండుగుల్ల పొగాకు దిగుబడి వచ్చింది. రెండు సార్లు వేయటం వల్ల నిర్దేశించిన పంట లక్ష్యంకంటే అదనంగా 5,182 హెక్టార్లలో పంట సాగు చేయాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. దాంతో పాటు పొగాకు బోర్డు నిర్దేశించిన పంట దిగుబడి 87.61 మిలియన్ కేజీల పొగాకు ఉత్పత్తి లక్ష్యంగా ఇచ్చారు. అయితే మాండూస్ తుపాను కారణంగా రెండుసార్లు పంట వేయటం వల్ల దిగుబడి అత్యధికంగా వచ్చింది. పొగాకు బోర్డు 87.61 మిలియన్ కేజీల పంట దిగుబడి లక్ష్యంగా ఇచ్చింది. అయితే 107 మిలియన్ కిలోల దిగుబడి వచ్చింది. అంటే 19.39 మిలియన్ కిలోల పొగాకు అదనంగా వచ్చింది. బ్యారన్‌కు రూ.4 లక్షల వరకు ఆదాయం ఈ సంవత్సరం నాలుగు పొగాకు బ్యారన్ల పరిధిలో 40 ఎకరాల పొగాకు చేశాను. గత సంవత్సరంతో పోలిస్తే ఈ ఏడాది పొగాకు ధరలు ఆశాజనకంగా ఉన్నాయి. గత సంవత్సరం కేజీ పొగాకు ధర అత్యధికంగా రూ.180 అమ్ముకోగలిగాను. అదే క్వాలిటీ పొగాకు ధర ఈ సంవత్సరం కేజీ పొగాకు రూ.249 వరకు అమ్ముకున్నాను. బ్యారన్‌కు సాగు ఖర్చు పోను రూ.4 లక్షల వరకు ఆదాయం మిగిలే అవకాశం ఉంది. ఈ సంవత్సరం ధరల పట్ల రైతులు సంతోషంగా ఉన్నారు. – మోపత్తి నారాయణ, పొగాకు రైతు, పెరిదేపి గ్రామం, కొండపి మండలం పొగాకు సరాసరి ధరలు సంవత్సరం ధర (రూ) 2018–19 126 2019–20 124.55 2020–21 148.54 2021–22 172.49 2022–23 239.43 (వేలం ఇంకా కొనసాగుతోంది) 5182 హెక్టార్లలో అదనంగా సాగు ప్రకాశం, నెల్లూరు, గుంటూరు ఉమ్మడి జిల్లాల్లో కలిపి 11 పొగాకు వేలం కేంద్రాలున్నాయి. ఆయా ప్రాంతాల్లో దక్షిణ ప్రాంత నల్లరేగడి నేలలు (ఎస్బీఎస్), దక్షిణ ప్రాంత తేలకపాటి నేలలు (ఎస్ఎల్ఎస్)లలో కలుపుకొని మొత్తం 24,353 పొగాకు బ్యారన్లు ఉన్నాయి. వాటి పరిధిలో 30,240 మంది రైతులు పొగాకు పండిస్తున్నారు. పొగాకు బోర్డు నిర్దేశించిన ప్రకారం 58,300 హెక్టార్లలో పొగాకు సాగు చేయాల్సి ఉండగా, 63,482 హెక్టార్లలో పొగాకును సాగు చేశారు. 5182 హెక్టార్లలో పొగాకును అదనంగా సాగు చేశారు. -
కలుపును నిర్మూలించే రోబోలొస్తున్నాయ్!
మన దేశంలో పంట పొలాల్లో కలుపు వల్ల రైతులకు ఏటా జరుగుతున్న ఆర్థిక నష్టం రూ. 1980 కోట్లని నాలుగేళ్ల క్రితం నాటి అంచనా. పురుగులు, తెగుళ్ల నష్టాలకన్నా కలుపు నష్టమే ఎక్కువని భారతీయ వ్యవసాయ పరిశోధనా మండలి లెక్కతేల్చింది. ఆధునిక వ్యవసాయ పద్ధతుల్లో భాగంగా స్వతంత్రంగా పనిచేస్తూ కలుపు మొక్కల్ని మాత్రమే నిర్మూలించే రోబోలు (అటానమస్ రొబోటిక్ వీడ్ కంట్రోల్ సిస్టమ్స్) వస్తున్నాయి. కృత్రిమ మేధ, జీపీఎస్, జిఐఎస్ వంటి అత్యాధునిక సాంకేతికతలతో రూపొందిన ‘రోబో కూలీలు’ ఇవి. వీటిల్లో అనేక రకాలున్నాయి. కలుపు తీసే రోబో తనను తానే నడుపుకుంటూ పంట సాళ్లలో వెళ్తూ సాళ్ల మధ్యన, వరుసల్లో మొక్కలు/చెట్ల మధ్యన ఉండే నిర్దేశించిన కలుపు మొక్కల్ని మాత్రమే గుర్తించి నాశనం చేస్తాయి. నాశనం చేసే పద్ధతులు అనేకం ఉన్నాయి. గాలి, మంట (ఫ్లేమ్), చలి గాలి, మైక్రోవేవ్స్, లేజర్ కిరణాలు, వాటర్ జెట్‌ను ప్రయోగించటం ద్వారా (పంట మొక్కలు, చెట్లకు హాని జరగకుండా) కేవలం కలుపు మొక్కల్ని నిర్మూలించటం ఈ రోబోల ప్రత్యేకత. వీటి ఖరీదెక్కువ. నిర్వహణకు నైపుణ్యం కలిగిన పనివారి అవసరం ఉంటుంది. కూలీల సమస్యను అధిగమించే క్రమంలో కస్టమ్ హైరింగ్ సెంటర్ల ద్వారా డ్రోన్ల మాదిరిగా వీటిని మన దేశంలోనూ వినియోగించే అవకాశాలు ఉన్నాయి. – పంతంగి రాంబాబు, సాక్షి సాగుబడి డెస్క్ -
Green Roof : మండుటెండల్లో రేకుల ఇల్లు కూడా చల్లచల్లగా..!
వేసవిలో మండే ఎండలు, ఉక్కపోత నుంచి ఉపశమనం కోసం ఎగువ మధ్యతరగతి, ధనికులైతే ఇళ్లలో ఏసీలు పెట్టుకొని సేదతీరుతుంటారు... మరి నగరాల్లోని బస్తీలు, మురికివాడల్లో రేకుల ఇళ్లలో నివసించే పేదల పరిస్థితి ఏమిటి? పైకప్పుల నుంచి లోపలికి వచ్చే వేడికి తాళలేక, నిద్ర పట్టక వారు విలవిల్లాడా ల్సిందేనా? ఈ ప్రశ్నకు వినూత్న ప్రయోగాలు చవకైన ప్రత్యామ్నాయాలను అందుబాటులోకి తెస్తున్నాయి. భూతాపం ఏటేటా పెరిగిపోతున్న ఈ కాలంలో పేదల ఇళ్లను చల్లబరిచే పనిని విస్తృతంగా వ్యాప్తిలోకి తేవడానికి జూన్ 6న ‘వరల్డ్ గ్రీన్ రూఫ్ డే’ని జరుపుకుంటున్నాం. ఈ నేపథ్యంలో ప్రత్యేక కథనం. (బ్రెజిల్‌లోని రియో డి జెనీరో నగరంలోని ఓ మురికివాడ (ఫావెల్)లో లూయిస్ కాసియానో తన అస్బెస్టాస్ రేకుల ఇంటిపై స్వయంగా ఏర్పాటు చేసుకున్న గ్రీన్ రూఫ్ (ఏరియల్ వ్యూ)) జూన్ 6 వరల్డ్ గ్రీన్ రూఫ్ డే పై ఫొటోలో తన ఆకుపచ్చని ఇంటి పైకప్పుపై కూర్చున్న వ్యక్తి పేరు లూయిస్ కాసియానో (53). బ్రెజిల్‌లోని రియో డి జెనీరో మహానగరంలో పార్క్యు అరర అనే మురికివాడలో ఆస్బెస్టాస్ సిమెంటు రేకుల ఇంట్లో 85 ఏళ్ల తల్లితో కలసి నివాసం ఉంటున్నాడు. వేసవిలో అక్కడ పగటి ఉష్ణోగ్రత 50 డిగ్రీల సెల్షియస్ దాటిపోతూ ఉంటుంది. ‘ఇటుకలు పగలు వేడిని పీల్చుకొని రాత్రుళ్లు వదులుతూ ఉంటాయి. తెల్లవారుజామున 3 గంటలయ్యే వరకు ఇల్లు చల్లబడేది కాదు. చెమటలు ఆగేవి కాదు. నిద్రపట్టేది కాదు. (మురికివాడలో ఇరుకైన రేకుల ఇళ్ల మధ్య 50 డిగ్రీల సెల్షియస్ ఎండలోనూ మొక్కలతో పచ్చగా లూయిస్ కాసియానో ఇల్లు. పైపు డ్రిప్ ద్వారా ఈ మొక్కలకు తగుమాత్రంగా నీరు ఇస్తూ లూయిస్ పరిరక్షించుకుంటున్నారు.) భరించలేనంత వేడిగా ఉండేది..’అని పదేళ్ల క్రితం పరిస్థితిని కాసియానో గుర్తు చేసుకుంటూ ఉంటారు. కానీ ఆయన స్వయంగా తన ఇంటిపై గ్రీన్ రూఫ్ ఏర్పాటు చేసుకోవటంతో పరిస్థితి సానుకూలంగా మారిపోయింది. 2012లో రేకుల ఏటవాలు పైకప్పు మీద మొక్కల్ని పెంచడం మొదలుపెట్టాక ఇల్లు చల్లబడింది. ‘ఇరుగు పొరుగు ఇళ్లకన్నా మా ఇల్లు 15 డిగ్రీల సెల్సియస్ వరకు చల్లగా ఉంటోంది. రాత్రివేళల్లో విద్యుత్ సరఫరా కొన్ని గంటలు లేకపోయినా ఇంట్లో ఉండగలుగుతున్నాం’అని కాసియానో చెప్పారు. (లూయిస్ కాసియానో రేకుల ఇంటి పైకప్పుపై మొక్కల్ని పెంచుతున్నది ఇలా) రియో డి జెనీరో యూనివర్సిటీలో గ్రీన్రూఫ్స్పై పరిశోధన చేస్తున్న బ్రూనో రెసెండో సహకారంతో కాసియానో తన ఇంటిపై ప్లాస్టిక్ కూల్‌డ్రింక్ సీసాలను రీసైకిల్ చేసి తీసిన తేలికపాటి పాలిస్టర్ నాన్‌ఓవెన్ జియోటెక్స్‌టైల్ పరదాను పరచి, మట్టి పోసి తీవ్ర ఎండలను సైతం తట్టుకొనే మొక్కలను పెంచుతున్నారు. గ్రీన్‌రూఫ్ పేరిట ఓ స్వచ్ఛంద సంస్థను ఏర్పాటు చేసి మరీ ఆయన ప్రచారం చేస్తున్నారు. గ్రీన్‌రూఫ్‌లు.. కొన్ని ప్రయోగాలు ముంబై, బెంగళూరులలో సీబ్యాలెన్స్, హసిరుదల వంటి స్వచ్ఛంద సంస్థలు ఇళ్ల పైకప్పులపై వినూత్న ప్రయోగాలు చేస్తున్నాయి. బెంగళూరులోని జ్యోతిపుర మురికివాడలో రేకుల ఇంటి పైకప్పు మీద నీలిరంగు టార్పాలిన్‌పై నీరు నింపిన ప్లాస్టిక్ సీసాలను సీబ్యాలెన్స్ సంస్థ ఏర్పాటు చేసింది. ఈ సీసాల్లోని నీరు ఉష్ణోగ్రతను గ్రహించడం వల్ల ఆ మేరకు ఇల్లు తక్కువగా వేడెక్కుతుందని ఆ సంస్థ చెబుతోంది. రేకుల ఇంటిపై నీలిరంగు ప్యానెళ్లను అమర్చడం ద్వారా కూడా వేడిని తగ్గించవచ్చు. రేకుల ఇంటిపై తెల్ల టి ‘ఎకోబోర్డ్ పేనల్స్’ను పరచి అధిక ఉష్ణోగ్రత నుంచి కొంత మేరకు రక్షణ పొందొచ్చు. రేకుల ఇంటిపై అడుగు ఎత్తున ఇనుప ఫ్రేమ్‌ను ఏర్పాటు చేసి.. దానిపై ఎకోబోర్డ్ ప్యానళ్లను అమర్చటం వల్ల అధిక ఉష్ణోగ్రతను ఎదుర్కొనే ప్రయత్నం చేయొచ్చు. ఈ ఉపాయం సత్ఫలితాలిస్తున్నట్లు సీబ్యాలెన్స్ సంస్థ చెబుతోంది. (బెంగళూరులోని జ్యోతిపుర మురికివాడలో రేకుల ఇంటిపై ఎకోబోర్డ్ ప్యానల్స్‌ను పరచి అధిక ఉష్ణోగ్రతను తట్టుకునే ప్రయత్నం) మొండి మొక్కలతో కూల్‌కూల్‌గా.. 50 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతల్లోనూ ఇళ్ల పైకప్పులను చల్లగా ఉంచే కొన్ని మొండి జాతుల మొక్కలను కేంద్ర శాస్త్ర, సాంకేతిక శాఖకు చెందిన స్వతంత్ర పరిశోధనా సంస్థ పుణేలోని అఘార్కర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ (ఎఆర్ఐ) ఇటీవల గుర్తించింది. పశ్చిమ కనుమల్లో కనుగొన్న 62 రకాల మొండి జాతి మొక్కలు 95% తేమను కోల్పోయినా చనిపోవని, తిరిగి తేమ తగిలినప్పుడు చిగురిస్తాయని తెలిపింది. (బెంగళూరులోని జ్యోతిపుర మురికివాడలో ఓ రేకుల ఇంటిపైన అడుగు ఎత్తున ఇనుప ఫ్రేమ్‌ను ఏర్పాటు చేసి, దానిపై ఎకోబోర్డ్ ప్యానళ్లను అమర్చటం వల్ల అధిక ఉష్ణోగ్రతను ఎదుర్కొనే ప్రయత్నం) నగరాల్లో పేద, మధ్యతరగతి ప్రజలు ఎక్కువగా నివసించే రేకులు, శ్లాబ్ ఇళ్ల పైకప్పులపై ఈ జాతులను పెంచితే స్వల్ప ఖర్చుతోనే గ్రీన్‌రూఫ్‌లు అందుబాటులోకి వస్తాయి. డ్రిప్ ద్వారా నీటిని తగుమాత్రంగా అందిస్తే ఎంత ఎండైనా ఇవి పచ్చగానే పెరిగే అవకాశం ఉంది. – పంతంగి రాంబాబు, సీనియర్ న్యూస్ ఎడిటర్, సాక్షి సాగుబడి డెస్క్ -
దున్నకుండానే మొక్కజొన్న, వేరుశనగ! తక్కువ శ్రమ.. ఖర్చు ఆదా
దుక్కి దున్నకుండానే మొక్కజొన్న సాగు(జీరో టిల్లేజి) పద్ధతి శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో ఇటీవల చాలా ప్రాచుర్యం పొందింది. దీనికి ఏకైక కారణం డాక్టర్ రెడ్డీస్ ఫౌండేషన్ అందుబాటులోకి తెచ్చిన ‘డబుల్ వీల్ మార్క్ర్’ (రెండు చక్రాలతో రంధ్రాలు వేసే పరికరం). సార్వా(ఖరీఫ్)లో వరి సాగు చేసిన భూముల్లో దుక్కి దున్నకుండా ఈ పరికరంతో రైతులు సులభంగా నేలపై రంధ్రాలు చేసి విత్తనాలు వేసుకుంటున్నారు. వరి కోసిన తర్వాత తక్కువ సమయంలోనే మొక్కజొన్న విత్తుకోవడానికి ఈ పరికరం రైతులకు ఎంతో ఉపయోగ పడుతోంది. నాలుగేళ్ల క్రితం ఈ పరికరం తొలుత అందుబాటులోకి వచ్చింది. సార్వా వరి తర్వాత మొక్కజొన్న పంటను వరుసగా మూడు దఫాలు సాగు చేస్తూ మంచి ఆదాయం పొందుతున్న రైతులు ఉత్తరాంధ్రలో ఉన్నారు. వరుసల మధ్య దూరం తగ్గించుకునే చిన్న మార్పు చేసుకొని దుక్కిలేని పద్ధతిలో వేరుశెనగ విత్తుకోవడానికి కూడా ఈ పరికరం ఉపయోగపడుతోందని రైతులు సంతోషిస్తున్నారు. మొక్కజొన్నతో పాటు వేరుశనగ మొక్కల మధ్య 20 సెం.మీ. దూరం, వరుసల మధ్య 60 సెం.మీ.ల దూరంలో డబుల్ వీల్ మార్కర్‌తో రంధ్రాలు చేసి దుక్కి చేయకుండానే మొక్కజొన్న విత్తుకోవచ్చు. అదేవిధంగా వేరుశనగ విత్తుకోవడానికి మార్కర్‌లో స్వల్ప మార్పు చేసుకోవాల్సి ఉంటుంది. మొక్కల మధ్య 20 సెం.మీ. దూరం, వరుసల మధ్య 40 సెం.మీ.ల దూరంలో వేరుశనగ విత్తుకోవాలి. ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో గత రబీలో వరి కోసిన 48,146 ఎకరాల్లో దున్నకుండా డబుల్ వీల్ మార్కర్‌తో మొక్కజొన్నను సాగు చేశారు. 18 మండలాల్లో సుమారు 25 లక్షల వ్యంతో మండలానికి 40 చొప్పున 720 పరికరాలను అందుబాటులోకి తీసుకువచ్చినట్లు డాక్టర్ రెడ్డీస్ ఫౌండేషన్ తెలిపింది. ఈ పరికరాలన్నీ ఎల్. సత్యనారాయణ తయారు చేసి ఇచ్చినవే. సమాన దూరంలో విత్తనాలు నాటడం వలన గాలి, వెలుతురు ధారాళంగా సోకి, పంటలకు పురుగులు, తెగుళ్ల బెడద తక్కువగా ఉంది. చేను ఏపుగా పెరిగి సాధారణ పద్ధతిలో కంటే జీరోటిల్లేజ్ పద్ధతిలో మేలైన దిగుబడులు నమోదు అవుతుండటం విశేషం. మహిళలు ఉపయోగించడానికి డబుల్ వీల్ మార్క్ర్ అనువుగా ఉండటం మరో విశేషం. మహిళా రైతులకు, ముఖ్యంగా చిన్న, సన్నకారు ఒంటరి మహిళా రైతులకు ఈ ఆవిష్కరణ ఎంతో ఉపయోగకరంగా ఉంది. నెల కాలం కలిసి వస్తుంది! తొలకరి వరి చేను కోసిన తరువాత పొలంలో వరి కొయ్యకాళ్లలో దుక్కి దున్నకుండానే పదును చూసుకుని డబుల్ వీల్ మార్కర్‌ను నడిపి మొక్కజొన్న విత్తనాలు నేరుగా విత్తుకోవాలి. ఈ విధానంలో రైతులకు దుక్కి ఖర్చులు ఆదా అవ్వటమే కాకుండా నెల రోజుల పంట కాలం కలిసి వస్తుంది. మొక్కజొన్న సాగు ప్రారంభమైన తొలినాళ్లలో శ్రీకాకుళం జిల్లా రణస్థలం మండలంలో రైతులకు కొయ్యతో గాని, కొయ్యతో చేసిన పెగ్ మార్కర్ అనే పరికరంతో గాని వరి మాగాణిల్లో నేరుగా రంధ్రాలు చేసి మొక్క జొన్న విత్తనాలు విత్తేవారు. పెగ్ మార్కర్ పరికరాన్ని ఉపయోగించేటప్పుడు ఎక్కువ శ్రమ, ఎక్కువ సమయం వృథా అవుతుండేది. మగ కూలీలు మాత్రమే పెగ్ మార్కర్‌ను ఉపయోగించేవారు. 2016 నుంచి ప్రయోగాలు కూలీల ఖర్చు, శ్రమ తగ్గించుకుంటూ మొక్కజొన్న, వేరుశెనగ పంటలను దుక్కి దున్నకుండా నేరుగా ఎలా విత్తుకోవాలనే అంశంపై డాక్టర్ రెడ్డీస్ ఫౌండేషన్ ప్రతినిధి హరిబాబు (84999 28483) 2016 నుంచి అనేక ప్రయోగాలు చేసి ఎట్టకేలకు సఫలీకృతులయ్యారు. తొలుత ఒక చక్రం ఉన్న మార్కర్‌ను, తర్వాత ఐదు చక్రాల మార్క్ర్లను డిజైన్ చేసి రైతులకు అందించారు. వీటితో సరైన ఫలితాలు రాకపోవడంతో డబుల్ వీల్ మార్క్ర్ను డిజైన్ చేశారు. ఇది రైతులకు ఉపయోగకరంగా ఉండటంతో మంచి స్పందన వచ్చింది. ఆముదాలవలసలోని ఏరువాక కేంద్రం, కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్తల సూచనల మేరకు ఉక్కుతో రెండు చక్రాల మార్కర్ (డబుల్ వీల్ మార్కర్) పరికరం దిద్దుకుంది. తుది రూపుదిద్దిన సత్యనారాయణ డాక్టర్ రెడ్డీస్ ఫౌండేషన్ రూపొందించిన డబుల్ వీల్ మార్కెర్కు రైతు లంకలపల్లి సత్యనారాయణ (83741 02313) మార్పులు చేసి బరువు తగ్గించి 2019లో తుది రూపుదిద్దారు. సత్యనారాయణ వ్యవసాయం చేస్తూనే వెల్డర్‌గా పనిచేస్తున్నారు. ఆ అనుభవంతో సులభంగా ఒక వ్యక్తి తన పొలానికి భుజాన వేసుకొని తీసుకుని వెళ్లేందుకు వీలుగా డబుల్ వీల్ మార్కర్ పరికరాన్ని మార్చారు. మొదట తన పొలంలో ఉపయోగించి సంతృప్తి చెందిన తర్వాత, తానే తయారు చేసి రూ. 2,900కు ఇతర రైతులకు అందిస్తున్నారు. 2021 రబీ నాటికి రణస్థలం మండలంలో రైతులకు 85 డబుల్ వీల్ మార్కర్లను ఇచ్చారు. ఆ తర్వాత రైతుల్లో ఇది ప్రాచుర్యంలోకి వచ్చింది. – గంగి నాగరాజు, సాక్షి, రణస్థలం, శ్రీకాకుళం జిల్లా