బీజీ–3 పత్తి సాగులో వాడే కలుపు మందుతో కేన్సర్‌ వస్తుందని తెలుసా? | Do You Know BG-3 Herbicide Used In Cotton Cultivation Causes Cancer | Sakshi
Sakshi News home page

బీజీ–3 పత్తి సాగులో వాడే కలుపు మందుతో కేన్సర్‌ వస్తుందని తెలుసా?

Published Mon, Jun 26 2023 4:29 PM | Last Updated on Mon, Jun 26 2023 5:02 PM

Do You Know BG-3 Herbicide Used In Cotton Cultivation Causes Cancer - Sakshi

కలుపు మందును తట్టుకునే (హెర్బిసైడ్‌ టాలరెంట్‌) విధంగా జన్యుమార్పిడి చేసిన పత్తి రకం (దీన్నే ‘బీజీ 3 పత్తి’ అని కూడా అంటున్నారు) దేశవ్యాప్తంగా అక్రమంగా సాగులో ఉంది. దీనికి ప్రభుత్వ అనుమతి లేదు. గ్లైఫొసేట్‌ అనే ప్రమాదకరమైన కలుపు మందు చల్లినా తట్టుకునే విధంగా జన్యుమార్పిడి చేసిన పత్తి పంట ఇది. సాధారణ బీజీ 2 పత్తి రకాలకు మాత్రమే ప్రభుత్వ అనుమతి ఉంది.

ప్రభుత్వ అనుమతి లేకపోయినా కొందరు రైతులకు వ్యాపారులు బీజీ 3 పత్తి విత్తనాలను అంటగడుతున్నారు. ఇటీవల తెలంగాణ రాష్ట్రంలో ఇటీవల అనేక సార్లు అక్రమంగా తరలిస్తున్న క్వింటాళ్ల కొద్దీ బీజీ 3 పత్తి విత్తనాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ నేపథ్యంలో నిషిద్ధ హెచ్‌.టి. పత్తి సాగు వల్ల కలిగే అనర్థాలేమిటో రైతులకు తెలియజెప్పే ప్రయత్నమే ఈ కథనం.

గ్లైఫొసేట్‌ కలుపు /గడ్డి మందు వల్ల కేన్సర్‌ వంటి జబ్బులు రావటంతో పాటు భూమి, నీరు, గాలి కలుషితం అవుతాయని, రైతులు వాస్తవాలు తెలుసుకొని ఈ విత్తనాలు వాడకుండా జాగ్రత్తపడాలని తెలంగాణ విత్తనాభివృద్ధి సంస్థ మేనేజింగ్‌ డైరెక్టర్, సీనియర్‌ శాస్త్రవేత్త డా. కేశవులు ‘సాక్షి సాగుబడి’ ద్వారా సూచిస్తున్నారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే.. హెర్బిసైడ్‌ టాలరెంట్‌ (హెచ్‌.టి.) పత్తి అనేది ప్రభుత్వ ఆమోదం లేని కలుపు మందును తట్టుకునే జన్యువును కలిగి ఉన్న ఒక రకమైన జన్యుమార్పిడి పత్తి. దీన్ని సాధారణంగా బీజీ–3 (రౌండ్‌ అప్‌ రెడీ ఫ్లెక్స్‌)గా వ్యవహరిస్తుంటారు. దీని సాగుకు భారత ప్రభుత్వ ఆమోదం లేదు. బీజీ 3 పత్తి విత్తనాలను ఉత్పత్తి చేయటం, అమ్మటం మన దేశంలో చట్టవిరుద్ధం.

కలుపు మందును తట్టుకునే పత్తి రకాన్ని మోనో శాంటో అభివృద్ధి చేసి ‘రౌండ్‌–అప్‌ రెడీ ఫ్లెక్స్‌ (ఆర్‌.ఆర్‌.ఎఫ్‌.) పేరుతో అమెరికాలో విక్రయిస్తూ ఉంది. మన దేశంతో సహా ప్రపంచదేశాల్లో కూడా అమ్మటానికి ఆ కంపెనీ ప్రయత్నిస్తోంది. హెచ్‌.టి. పత్తి గింజలో గ్లైఫోసేట్‌ కలుపు మందును తట్టుకునే అదనపు జన్యువు ఉంది. అందువల్ల, ఈ పంటను పొరపాటున సాగు చేసే రైతులు పొలాల్లో కలుపు మొక్కల నియంత్రణ కోసం గ్లైఫోసేట్‌ను గుడ్డిగా పిచికారీ చేసే ప్రమాదం ఉంది. అయితే, గ్లైఫోసేట్‌ కలుపు మందు క్యాన్సర్‌ కారక ప్రభావాన్ని కలిగి ఉందని రైతులు తెలుసుకోవాలి. అంతేకాదు, మీరు పొలాల్లో అనుమతి లేని ఈ పంటను సాగు చేస్తే పరాగ సంపర్కం ద్వారా సమీపంలోని మొక్కలకు కలుపు మందును తట్టుకునే జన్యువు అనియంత్రితంగా వ్యాప్తి చెందే ప్రమాదం ఉంది. ఇది వివిధ రకాల ‘సూపర్‌ వీడ్‌’(కలుపు మందులకు లొంగని మొండి జాతి కలుపు మొక్క)లను సృష్టిస్తుంది.

భారత ప్రభుత్వ ఆమోదం లేని కలుపు మందులను తట్టుకునే లక్షణం కలిగిన జన్యువు ఉద్దేశపూర్వకంగానో లేదా అనుద్దేశపూర్వకంగానో గుర్తు తెలియని సంస్థలు/ ఏజెన్సీల ద్వారా మన దేశంలోని రైతుల పొలాల్లోకి, పర్యావరణంలోకి విడుదలైంది. అది ఇప్పుడు రైతులు పండించిన పత్తి పొలాల్లోకి చేరి ఇతర సంకరజాతి పత్తి రకాలను కూడా కలుషితం చేస్తూ.. జీవ వనరుల స్వచ్ఛతకు ముప్పుగా పరిణమించింది. జెనెటిక్‌ ఇంజనీరింగ్‌ అప్రైజల్‌ కమిటీ(జీఈఏసీ) అనుమతి లేకుండా ఏదైనా పత్తి విత్తనాన్ని ఉత్పత్తి చేయడం/అమ్మటం పర్యావరణ పరిరక్షణ చట్టం ప్రకారం చట్టవిరుద్ధం. ఇది జీఈఏసీ ఆమోదం పొందనందున, మన దేశంలో అక్రమంగా విక్రయిస్తున్న బీజీ3ౖ విత్తనం నాణ్యతపై జవాబుదారీతనం లేదు.

అంతేకాదు, పర్యావరణం కలుషితమవుతున్నది. చట్టవిరుద్ధమైన బీజీ 3 పత్తి విత్తనాలు చిన్న, సన్నకారు పత్తి రైతులను నాశనం చేయడమే కాకుండా దేశంలోని మొత్తం చట్టపరమైన పత్తి విత్తన మార్కెట్‌కు కూడా ముప్పుగా తయారయ్యాయి. అంతేకాదు, గ్లైఫోసేట్‌ కలుపు మందును పంటలు వేయని ప్రాంతాల్లో మాత్రమే వాడటానికి చట్టం అనుమతిస్తుంది. అందువల్ల, అనుమతి లేని బీజీ 3 పత్తి విత్తనాలు వేసి గ్లైఫోసేట్‌ కలపు మందును రైతులు విచక్షణారహితంగా పొలాల్లో పిచికారీ చేస్తే.. అది మనుషులు, జంతువుల ఆరోగ్యంతో పాటు జీవవైవిధ్యం, నేల ఆరోగ్యంపై, భూసారంపై ప్రతికూల ప్రభావం చూపుతుంది. అందువల్లౖ రైతులు కలుపు మందును తట్టుకునే (హెచ్‌.టి.) బీజీ 3 పత్తిని ఎందుకు సాగు చేయకూడదంటే : – బీజీ 3 పత్తి సాగుకు ప్రభుత్వ∙అనుమతి లేదు.

దేశంలో దీని సాగు చట్టవిరుద్ధం. – బీజీ 3 పత్తి సాగు గ్లైఫోసేట్‌ వినియోగాన్ని ప్రోత్సహిస్తుంది. ఇది క్యాన్సర్‌కు కారణం కావచ్చు. నేల ఆరోగ్యంపై, భూ సారంపై ప్రతికూల ప్రభావం చూపుతుంది. నీటిని కలుషితం చేస్తుంది. జంతువులు, మనుషుల ఆరోగ్యాన్ని కూడా దెబ్బ తీస్తుంది. – రైతులు ఈ అక్రమ విత్తనాలను ఉపయోగించడం వలన పంట పోవచ్చు/ దిగుబడి నష్టం జరగొచ్చు/ ఆదాయం తగ్గిపోవచ్చు. – ఈ రకం పత్తి సాగు వల్ల కొన్నాళ్లకు కలుపు మందులు చల్లినా చనిపోని మొండి కలుపు మొక్కలు తయారు కావచ్చు. మొండి కలుపును నియంత్రించడం చాలా కష్టం. అంటే, రైతులు ఈ కలుపు మొక్కల నియంత్రణకు మరింత ఎక్కువ డబ్బు ఖర్చు చేయాల్సి ఉంటుంది. పైగా తక్కువ దిగుబడి/పంట నష్టానికి దారితీయవచ్చు. కాబట్టి, బీజీ 3/హెచ్‌.టి. పత్తి విత్తనాలకు రైతులు దూరంగా ఉంటే మంచిది.
పంతంగి రాంబాబు, సాక్షి సాగుబడి డెస్క్‌

తెలంగాణ విత్తనాభివృద్ధి సంస్థ మేనేజింగ్‌ డైరెక్టర్, సీనియర్‌ శాస్త్రవేత్త డా. కేశవులు

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement