మూలకు చేరిన 108 వాహనం
108.. అంటే ప్రజలకు గుర్తొచ్చేది దివంగత మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర్‌రెడ్డి. ఆయన ఆలోచన నుంచి పురుడుపోసుకున్న 108 వాహన పథకానికి నేటి టీడీపీ ప్రభుత్వం తూట్లు పొడుస్తోంది. ఆపదలో ఉన్న రోగులను సకాలంలో ఆస్పత్రులకు తరలించి ఎంతో మంది ప్రాణాలు కాపాడిన వాహనాలు నేడు కుయ్యో..మర్రో..అంటూ మూలుగుతూ మూలకు చేరాయి. ఆకస్మికంగా అనారోగ్యానికి గురయ్యే వారు, రోడ్డు ప్రమాదాల్లో తీవ్రంగా గాయపడిన వారు ఇప్పుడు 108 వాహనాలకు ఫోన్‌లు చేయడం క్రమంగా మానుకుంటున్నారు. ఫోన్ చేసినా వాహనం వస్తుందో రాదో తెలియక ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకోవాల్సి వస్తోంది. దివంగత మహానేత వైఎస్సార్ పాలనలో కుయ్..కుయ్..కుయ్.. అంటూ వచ్చిన 108 వాహనాలు నేడు షెడ్లకు పరిమితమయ్యాయి.
ఒంగోలు సెంట్రల్: 108 అంబులెన్సులు మూగబోతున్నాయి. జిల్లాలో 35 అంబులెన్సులు ఉండగా వీటిలో చాలా వరకు పదేళ్ల సర్వీసు పూర్తి చేసుకున్నవే. మరమ్మతులకు గురైన వాహనాలకు స్పేర్‌లు దొరక్క, కొత్త వాహనాలు అందుబాటులో లేక వాటి సేవలు ప్రజలకు అందడం లేదు. మరమ్మతులకు గురైన వాహనాలు బాగు చేసినందుకు సర్వీస్ సెంటర్లకు ప్రభుత్వం ఇప్పటికే దాదాపు రూ.5లక్షలకుపైగా చెల్లించాల్సి ఉంది. పాలకులు హామీలు నీటి మీద రాతలుగా మారాయి. కొట్లాది రూపాయల నిదులు నీళ్లులా ఖర్చు చేసారే తప్ప ప్రజలకు చేసిన ప్రయోజనం అంతంత మాత్రమే. కాలం చెల్లిన వాహనాలు, అరకొర వసతులు ప్రమాదాలకు గురవుతున్న ప్రజల ప్రాణాలను గాలిలో దీపాలుగా మార్చాయి.
2005లో పురుడు పోసుకున్న పథకం
అప్పటి ముఖ్యమంత్రి మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర్‌రెడ్డి 2005లో ప్రతిష్టాత్మకంగా 108 వాహనాల సేవలను ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చారు. కొన్నేళ్ల పాటు కుయ్..కుయ్.. కుయ్..అంటూ 108 వాహనాలు రోడ్లపై హల్‌చల్ చేశాయి. ఆ తర్వాత రకరకాల సమస్యలతో అవి కునారిల్లుతున్నాయి. జిల్లాలో 56 మండలాలు ఉన్నాయి. మండలానికి కనీసం ఒకటి చొప్పున 108 వాహనాలు ఏర్పాటు చేయాల్సి ఉంది. జిల్లాకు కేవలం 32 అంబులెన్సులనే కేటాయించారు. అదనంగా మరో 3 వాహనాలు రిజర్వుగా ఉంచారు. కానీ వాటిలో ఒక్క వాహనం రోడ్డు ఎక్కదు. వాహనాలు కేటాయించినా ఆ తర్వాత కాలంలో కొన్ని మరమ్మతులకు గురైతే వాటని కూడా లెక్కలోనే ఉంచుతున్నారు. ఒక్కో వాహనంలో ముగ్గురు సాంకేతిక నిపుణులు, ముగ్గురు పైలెట్లు ఉండాలి. ఇదే విధంగా ప్రతి 8 గంటలకు ఒక షిఫ్ట్ చొప్పున 24 గంటలూ ముగ్గురు పని చేసేలా పథకాన్ని రూపొందించారు. కానీ ప్రతి 108 వాహనానికి ఇద్దరు చొప్పున మాత్రమే సిబ్బందిని నియమించారు.
ఒక్కో షిఫ్టలో సిబ్బంది 12 గంటలు పని చేయాల్సి వస్తోంది. ఇది ప్రధానమైన సమస్య. వాహనాల నిర్వహణ సక్రమంగా ఉండటం లేదు. సాంకేతిక సమస్యలు విపరీతంగా పెరిగిపోయాయి. పదేళ్ల క్రితం ఉన్న వాహన నమూనాలను కంపెనీ మార్చివేయడంతో పాత వాహనాలకు కనీసం స్పేర్ పార్ట్స్ కుడా లభ్యం కాని పరిస్థితి. కొన్ని వాహనాలకు ఇంజిన్ సమస్యలు తలెత్తి మధ్యలొనే ఆగిపోతున్నాయి. వాహనాలకు ఎక్కడికక్కడ పంక్చర్లవుతున్నాయి. ఉన్న వాహనాల్లో చాలా వరకూ తొమ్మిదేళ్ల కిందటివే ఉన్నాయి. వాటి స్థానంలో కొన్నిటిని మాత్రమే ఇచ్చారు. మిగిలినవి పాత వాహనాలే. అన్నింటికీ మించి పది మండలాలకు వాహన సౌకర్యం లేదు. 108 సేవల పేరుతో ప్రజాధనం విపరీతంగా ఖర్చు చేస్తున్నారు. మొదట్లో జీఎంఆర్, అనంతరం జీవీకే ఈఎంఆర్‌ఐ, ప్రస్తుతం భారత్ వికాస్ గ్రూప్ సంస్థలతో రాష్ట్ర ప్రభుత్వం 108 సేవలు అందించేందుకు ఒప్పదం కుదుర్చుకుంది.
మొత్తం 35 వాహనాలు
108 సిబ్బంది నెలకు దాదాపు 3 వేల కేసులు అటెంప్ట్ చేస్తున్నారు. వీటిలో ప్రగ్నెస్నీ కేసులు 1000 వరకు ఉంటున్నాయి. రోడ్డు ప్రమాదాల కేసులు 600, గుండెజబ్బులు కేసులు 1000, ఊపిరితిత్తుల సమస్యల కేసులు 400, అర్బన్ ప్రాంతాల్లో 20 నిమిషాల్లోపు, గ్రామీణ ప్రాంతాల్లో 25 నిమిషాల్లోపు, గిరిజన ప్రాంతాల్లో 30 నిమిషాల్లో సంఘటన స్థలానికి 108 వాహనాలు చేరుకోవాలి. మొత్తం 35 వాహనాలు ఉండగా 3 తుక్కు కింది ఉన్నాయి. 4 వాహనాలు మరమ్మతులు జరుగుతున్నాయి. మిగిలిన 28 వాహనాల్లో ఐదు పాతవి. వీటి మరమ్మతులు, అక్సిజన్, డీజిల్ బంకులు, సర్వీసింగ్ స్టేషన్‌లకు గడిచిన ఆరు నెలల్లో ప్రభుత్వం దాదాపు రూ.30 లక్షలు చెల్లించకుండా పెండింగ్‌లో ఉంచింది. ఫలితంగా మిగిలిన వాహనాలు కూడా మూలనపడుతున్నాయి. అంతిమంగా పేద ప్రజల ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నాయి. మహానేత వైఎస్సార్ లక్ష్యాన్ని నేటి టీడీపీ ప్రభుత్వం నీరుగారుస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment