అమరావతిలో 12 వేల ప్రభుత్వ క్వార్టర్లు
- న్యాయమూర్తులు, సీనియర్ ఐఏఎస్ అధికారులకు డూప్లెక్స్ హౌస్‌లు
- మిగిలినవారికి జీ ప్లస్ 9 అపార్ట్‌మెంట్‌లు
- సీఆర్‌డీఏ ప్రణాళిక సిద్ధం
సాక్షి, విజయవాడ బ్యూరో : ఆంధ్రప్రదేశ్ సచివాలయ సిబ్బంది అమరావతికి తరలివస్తున్న నేపథ్యంలో 12 వేల క్వార్టర్లు నిర్మించాలని సీఆర్‌డీఏ ప్రణాళిక సిద్ధం చేసింది. సమాచారశాఖ రీసెర్చ్ అండ్ రిఫరెన్స్ విభాగం సోమవారం మీడియాకు ఆ వివరాలు విడుదల చేసింది. గృహ నిర్మాణ శాఖకు చెందిన ముగ్గురు ఇంజినీర్లతో ప్లాన్‌లను రూపొందించారు. ఏడు కేటగిరీలుగా మంత్రులు, ఎమ్మెల్యేలు, 12 వేల మంది ప్రభుత్వ ఉద్యోగులకు క్వార్టర్స్ నిర్మించడానికి సీఆర్‌డీఏ ప్రతిపాదనలు సిద్ధం చేసింది.
ఈ ప్రకారం న్యాయమూర్తులు, ఉన్నత న్యాయాధికారులు, ఆల్ ఇండియా సర్వీసెస్‌కు చెందిన సీనియర్ అధికారుల కోసం 3,500 అడుగుల ప్లిన్త్ ఏరియాతో డూప్లెక్స్ హౌస్‌లు నిర్మిస్తారు. మిగిలిన వారందరికీ జీప్లస్ 9 అంతస్తుల అపార్ట్‌మెంట్లలో ఫ్లాట్లు నిర్మిస్తారు. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు కూడా 3,500 అడుగుల ప్లిన్త్ ఏరియాలో ఫ్లాట్లు ఉంటాయి. ఆల్ ఇండియా సర్వీసెస్ జూనియర్ అధికారులు, అన్ని శాఖల హెడ్స్ కోసం మూడు వేల అడుగుల ప్లిన్త్ ఏరియా ఫ్లాట్లతో అపార్ట్‌మెంట్స్ నిర్మిస్తారు. 1,800 అడుగుల ప్లిన్త్ ఏరియాలో గజిటెడ్ అధికారుల క్వార్టర్లు, 1,200 అడుగుల్లో నాన్ గెజిటెడ్ అధికారుల క్వార్టర్లు, నాలుగో తరగతి ఉద్యోగులందరికీ 800 అడుగుల ప్లిన్త్ ఏరియా గల అపార్టుమెంట్లు నిర్మిస్తారు. నాలుగు, మూడు బెడ్ రూమ్‌ల డూప్లెక్స్ హౌస్‌లతోపాటు అపార్ట్‌మెంట్లలో మూడు, రెండు బెడ్‌రూమ్‌ల ఫ్లాట్లు నిర్మిస్తారు. దీనికి ఆమోదం లభించాల్సి ఉంది.