తాడేపల్లిగూడెం, న్యూస్‌లైన్ : సమైక్యాంధ్ర పరిరక్షణ కోరుతూ తాడేపల్లిగూడెం జాయింట్ యాక్షన్ కమిటీ 72 గంటల నిరవధిక బంద్‌కు పిలుపునిచ్చింది. మంగళవారం రాత్రి బీవీఆర్ కళా కేంద్రంలో నిర్వహించిన సమావేశంలో వివిధ వర్గాల ప్రతినిధులతో చర్చించిన అనంతరం నిర్ణయాన్ని ప్రకటించారు. వ్యాపార, వాణిజ్య వర్గాలతోపాటు ప్రభుత్వ కార్యాల యాలు, బ్యాంకులు మూతపడతాయి. బుధవారం నుంచి శుక్రవారం వరకు బంద్ కొనసాగుతుంది. ప్రభుత్వ, ప్రైవేటు విద్యాసంస్థలకు మూడు రోజులపాటు సెలవు ప్రకటించారు. ఆర్టీసీ బస్సుల తోపాటు, ఆటోలు కూడా మూడు రోజులపాటు తిరగవు. అత్యవసర సేవలకు బంద్ నుంచి మినహా యింపు ఇచ్చారు. పాలు, నీటి సరఫరా, మెడికల్ షాపులు, ఏటీఎంల వినియోగానికి సడలింపులు ఉంటాయి. బంద్ సందర్భంగా పోలీస్ ఐలాండ్ వద్ద శిబిరాన్ని ఏర్పాటు చేస్తున్నారు.
శిబిరాన్ని కేంద్రంగా చేసుకుని కార్యక్రమాలను కొనసాగిస్తారు. రిలే దీక్షలు, వంటా వార్పు వంటి కార్యక్రమాలను చేపట్టాలని నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రం విడిపోతే కలిగే నష్టాలు, నీటి సమస్యలు, కరెంటు కష్టాలు, విద్య, ఉద్యోగ అవకాశాలు తదితర విషయాలలో కలిగే నష్టాలపై రైతులకు, సామాన్యులకు అవగాహన కల్పించాలని తీర్మానించారు. శాంతి మార్గంలో ర్యాలీలు, ప్రదర్శనలు చేయాలని నిర్ణయించారు. ఉద్యమాన్ని నడిపించే విషయంలో వివిధ వర్గాలు, విద్యార్థి సంఘాలతో సంప్రదింపులు జరిపారు. వ్యాపార వర్గాల కోణంలో ఇబ్బందులు, ప్రజా జీవనానికి కలిగే ఇబ్బందులపై చర్చించారు. అనంతరం కార్యాచరణను రూపొందించారు. సమావేశానికి జేఏసీ చైర్మన్ ఈతకోట తాతాజీ అధ్యక్షత వహించారు. గమిని సుబ్బారావు, గ్రంధి సత్యనారాయణ, పేరిచర్ల మురళీ కృష్ణంరాజు, మాకా శ్రీనివాసరావు, కొవ్వూరి నాగేంద్రరెడ్డి, తోట హరిశ్చంద్రప్రసాద్,చలంచర్ల మాధవరావు, గంధం సుధాకర్ హాజరయ్యారు.
72 గంటల నిరవధిక బంద్
Published Wed, Aug 7 2013 5:08 AM | Last Updated on Mon, Aug 20 2018 3:26 PM
Advertisement