ఆహా.. ఏం ఆదర్శం! | Adarsha School Place Lease to Shopping Complex in Gajuwaka | Sakshi
Sakshi News home page

ఆహా.. ఏం ఆదర్శం!

Published Wed, Apr 24 2019 12:30 PM | Last Updated on Mon, Apr 29 2019 11:25 AM

Adarsha School Place Lease to Shopping Complex in Gajuwaka - Sakshi

గాజువాక వినాయకనగర్‌లో ఆదర్శ స్కూల్‌ కోసం వుడా నిర్మిస్తున్న పాఠశాల భవనం

విశాఖ నగరాభివృద్ధి సంస్థ (వుడా) ఇప్పటి వరకు జనావాసాలకు సంబంధించిన లే అవుట్‌లను వేయడం చూశాం. అవసరమైతే అందులో దుకాణాలను నిర్మించి ఇవ్వడం కూడా తెలిసిందే. కానీ ఇప్పటి వరకు ఎక్కడా లేని విధంగా ఒక ప్రైవేట్‌ పాఠశాలకు కోటిన్నర రూపాలయతో వుడా స్థలంలో పక్కా  భవన నిర్మాణాన్ని చేపట్టిన ఘనత గాజువాకలో చోటు చేసుకుంది.

గాజువాక : అక్షరాలా అది ఓ ప్రైవేట్‌ పాఠశాల. ఫీజులు చెల్లిస్తేనేగాని చదువు చెప్పని సంస్థ. వుడా షాపింగ్‌ కాంప్లెక్స్‌ను లీజుకు తీసుకుని కొనసాగిస్తున్న ఆ పాఠశాల కోసం వుడా అధికారులు ఏకంగా భవనాన్నే నిర్మిస్తున్నారు. దీనికి గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు కూడా తన అభివృద్ధి నిధుల నుంచి కొంత మొత్తాన్ని కేటాయించడం మరో విశేషం. గాజువాకలోని వుడా కాలనీ వినాయకనగర్‌లోని షాపింగ్‌ కాంప్లెక్స్‌లో కొనసాగుతున్న ఆదర్శ స్కూల్‌ను అక్కడి నుంచి తరలించేందుకు అటు అధికారులు, ఇటు ప్రజాప్రతినిధి చేసిన ఉపకారమిది. కోట్ల రూపాయల విలువైన స్థలంలో మరో కోటిన్నర ప్రభుత్వ ధనాన్ని వెచ్చించి భవనం నిర్మిస్తుండటం వెనుక ఏం జరిగి ఉంటుందో వారే చెప్పాల్సిన పరిస్థితి.

అసలు విషయం ఏమిటంటే..
వినాయకనగర్‌ను ఏర్పాటు చేసిన సమయంలో వుడా అధికారులు ఐదు ఎకరాల 22 సెంట్ల ఓపెన్‌  స్పేస్‌ను భవిష్యత్‌ అవసరాల కోసం కేటాయించారు. అందులో కొన్ని దుకాణాలను కూడా నిర్మించారు. ఆ దుకాణాలను ఆదర్శ స్కూల్‌ యాజమాన్యం 33 ఏళ్లకు లీజుకు తీసుకొని పాఠశాలను నిర్వహిస్తోంది. మరో మూడేళ్లలో ఆ లీజు కూడా పూర్తి కానుంది. అయితే ఓపెన్‌ స్పేస్‌లో క్రీడా మైదానాన్ని అభివృద్ధి చేయాలని రెండు దశాబ్దాల క్రితం నిర్ణయించారు. వివిధ ఇబ్బందుల నేపథ్యంలో అది సాధ్యం కాలేదు. పదేళ్ల క్రితం మళ్లీ అదే ప్రతిపాదన రావడంతో అధికారుల చర్యలు ముమ్మరమయ్యాయి. అయితే క్రీడా ప్రాంగణాన్ని అభివృద్ధి చేయడానికి అందులో ఉన్న పాఠశాలను తరలించాలని ప్రతిపాదనలు చేశారు.

తమకు లీజు సమయం ఉండటంతో ఖాళీ చేయలేమని ఆ పాఠశాల యాజమాన్యం చెప్పింది. తమకు వేరే స్థలం చూపిస్తే అప్పుడు ఖాళీ చేస్తామని స్పష్టం చేసింది. దీనికోసం గత ఎమ్మెల్యేలు విఫలయత్నం చేశారు. వినాయకనగర్‌లో కాకుండా ఇతర ప్రాంతాల్లో స్థలం ఇస్తామని చెప్పడంతో ఆ పాఠశాల యాజమాన్యం నిరాకరించింది. చివరకు కోర్టును కూడా ఆశ్రయించింది. దీంతో వారి ప్రతిపాదనలు కార్యరూపం దాల్చలేదు. క్రీడా ప్రాంగణాన్ని నిర్మించాలన్న డిమాండ్‌ దృష్ట్యా ప్రస్తుత ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరవు మాత్రం ఒకడుగు ముందుకేశారు. ఏకంగా ఆ పాఠశాల కోసం భవనాన్నే నిర్మించి ఇచ్చేస్తామని హామీ ఇచ్చి తన అభివృద్ధి నిధుల నుంచి రూ.50లక్షలు కేటాయించారు. మరో కోటి రూపాయలను వుడా నుంచి మంజూరు చేయించా రు. ఈ భవనాన్ని చూపించి ఆ పాఠశాల యాజమాన్యం ఫీజులను పెంచేసిందని విద్యార్థుల తల్లిదండ్రులు చెబుతున్నారు.

ఆసక్తి వెనుక అంతరార్థం ఏమిటో?
వుడా అధికారులు ఎక్కడా పాఠశాల భవనాలను కట్టిన దాఖలాలు లేవు. కానీ ఇక్కడి ఆదర్శ స్కూల్‌ కోసం ఏకంగా మూడు అంతస్తుల భారీ భవనాన్ని నిర్మిస్తున్నారు. విశాఖ స్టీల్‌ప్లాంట్‌ వంటి భారీ ప్రభుత్వరంగ సంస్థలు సైతం ప్రైవేట్‌ పాఠశాలలకు తమ స్థలాలను లీజుకు మాత్రమే ఇచ్చాయి. భవనాలను నిర్మించి ఇవ్వలేదు. అలాంటిది మరో మూడేళ్లలో లీజు పూర్తవుతున్న పాఠశాలకు వుడా అధికారులు అంత అత్యాధునిక భవనాన్ని నిర్మించి ఇవ్వాల్సిన అసరమేమిటన్న ప్రశ్నలకు సమాధానాలు రావడం లేదు. లీజు కాలం పూర్తయితే ఆ పాఠశాలతో వుడాకు ఎటువంటి సంబంధమూ ఉండదు. సంబంధం లేని పాఠశాలపై వుడా ఇంత మొత్తంలో ఎందుకు వెచ్చిస్తోందన్న అనుమానాలను నివృత్తి చేయాల్సిన అవసరముందని స్థానికులు డిమాండ్‌ చేస్తున్నారు. ఈ భవనం నిర్మాణానికి శంకుస్థాపన చేసిన రోజే కాలనీవాసులు అడ్డుకోవడానికి ప్రయత్నం చేశారు. వారిని సామదానబేధ దండోపాయాలతో శాంతింపజేశారనే ప్రచారం సాగుతోంది.

లీజు పూర్తయ్యాక వేలం వేస్తాం
ఈ విషయాన్ని వుడా కార్యదర్శి ఎ.శ్రీనివాస్‌వద్ద ప్రస్తావించగా... ప్రస్తుతం తాము పాఠశాల భవనం నిర్మిస్తున్నామని, ఆదర్శ స్కూల్‌ లీజు సమయం గడిచిన తరువాత బహిరంగ వేలం వేస్తామని చెప్పారు. అంతపెద్ద భవనం పాఠశాలను నడిపేందుకు తప్ప ఇతర అవసరాలకు ఉపయోగపడదు కదా అని అడగ్గా... ఆ విషయం తరువాత చూడాలన్నారు. తమ లీజు సమయం ముగిసిన తరువాత లీజు సమయాన్ని పొడిగించాలని పాఠశాల యాజమాన్యం కోర్టును ఆశ్రయించే అవకాశం ఉంది కదా అని ప్రశ్నించగా... తాను ఏమీ స్పందించలేనన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement