పోలీస్ కొలువులు సిద్ధం
రెండేళ్ల తరువాత విడుదల కానున్న నోటిఫికేషన్
చిత్తూరులో 480, తిరుపతిలో 200 పోస్టులు ఖాళీ
చిత్తూరు (అర్బన్): రాష్ట్ర వ్యాప్తంగా పోలీసు శాఖలో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేస్తామని హోం మంత్రి, డీజీపీలు ఇటీవల ప్రకటించారు. దీంతో జిల్లాలో పోలీసు ఉద్యోగాలకోసం వేయి కళ్లతో ఎదురుచూస్తున్న నిరుద్యోగుల్లో ఆశలు చిగురించాయి. దీనికితోడు ఈసారి పోలీసు సెలెక్షన్స్‌లో సమూల మార్పులు చోటుచేసుకోవడంతో ప్రతిభ ఆధారంగానే ఉద్యోగలక్ష్మి వరించనుంది. చిత్తూరు, తిరుపతి పోలీసు జిల్లాల్లో ఖాళీగా ఉన్న వందలాది పోస్టులకు ఈ ఏడాది చివరల్లోపు నోటిఫికేషన్ ఇవ్వనున్నారు. జిల్లాలో ప్రస్తుతం తిరుపతి, చిత్తూరు పోలీసు జిల్లాలు ఉన్నాయి. రెండు ప్రాంతాలకు ఇద్దరు ఎస్పీలు ఉన్నారు. అయితే 2013లో జిల్లా మొత్తం ఒక్కటే పోలీసు జిల్లా. అప్పట్లో జిల్లాలో 700 వరకు పోస్టులను పోలీసు శాఖలో భర్తీచేశారు. ఆ తరువాత ఎలాంటి నోటిఫికేషన్ వెలువడలేదు. మరోవైపు పోలీసుశాఖలో పెద్ద సంఖ్యలో సిబ్బంది ఉద్యోగ విరమణ పొందారు. దీంతో ఖాళీలు ఎక్కువయ్యాయి. దీనికి తోడు రెండు పోలీసు జిల్లాలు ఏర్పడ్డాయి. సిబ్బంది పంపకాలు సైతం పూర్తవడంతో సిబ్బంది లోటుగా మారింది. తాజాగా రాష్ట్ర హోంమంత్రి నుంచి డీజీపీ వరకు కొత్త నోటిఫికేషన్‌పై స్పందిస్తూ, ప్రకటనలు చేస్తుండడం నిరుద్యోగుల్లో కొత్త ఆశలు పుట్టిస్తోంది. అన్నీ సవ్యంగా చేస్తే ఈ ఏడాది చివరిలోపు నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశం ఉంది.
పాత పద్ధతి రద్దు...
మరోవైపు పోలీసుశాఖలో సెలక్షన్స్ అంటేనే కానిస్టేబుల్ నుంచి ఎస్‌ఐ స్థాయి పోస్టు వరకు తప్పనిసరి పరీక్ష 5 కిలో మీటర్ల పరుగుపందెం. ఆ పందేన్ని 25 నిముషాల్లో పూర్తి చేసిన అభ్యర్థులకు తరువాత లాంగ్‌జంప్, హైజంప్, షాట్‌పుట్, 100 మీటర్ల పరుగు పందెం పెడుతారు. ఇందులో మూడు ఈవెంట్స్‌లో అర్హత సాధించిన వారిని రాత పరీక్షలకు ఎంపిక చేస్తారు. చివరిగా రాత పరీక్షల్లో అర్హత సాధించిన వారికి ఈవెంట్స్‌లో వచ్చిన మార్కుల ఆధారంగా ఉద్యోగాలు కేటాయించడం ఇప్పటివరకు ఉన్న పద్ధతి. అయితే 5 కి.మీ పరుగు పందెం నిర్వహిస్తుండటంతో చాలాచోట్ల అభ్యర్థులు సొమ్మసిల్లి పడిపోయి, ఒక్కోసారి చనిపోతున్నారు. దీంతో ఈ పరుగును రద్దు చేసేదిశగా సెలక్షన్ బోర్డు, ప్రభుత్వం యోచిస్తోంది. పాత పద్ధతుల్లో సమూల మార్పులు చేసి, కేవలం ప్రతిభ ఆధారంగా అభ్యర్థుల్ని ఎంపిక చేసే దిశగా కసరత్తు జరుగుతోంది.
ఖాళీలు ఇలా...
చిత్తూరు పోలీసు జిల్లా పరిధిలో ఎస్‌ఐ పోస్టులు 15, సివిల్ కానిస్టేబుల్ (పురుషులు) 230, మహిళలు 15, ఏఆర్ విభాగంలో 220 వరకు పోస్టులు ఖాళీగా ఉన్నాయి. తిరుపతి పోలీసు జిల్లాలో ఎస్‌ఐలు 8, కానిస్టేబుళ్లు (ఏఆర్, సివిల్) 210 వరకు ఖాళీలున్నాయి. కొత్త నోటిఫికేషన్ విడుదలయితే జిల్లా వ్యాప్తంగా దాదాపు 680 పోస్టులు భర్తీ కానున్నాయి.