తెనాలి: గత ఖరీఫ్‌లో వ్యవసాయ ఉత్పత్తుల దిగుబడులు పెరిగినా ధరలు నిరాశ కలిగించాయి. రానున్న సీజనులోనూ ఇంతకుమించి పెద్దగా పెరుగుదల ఉండకపోవచ్చు. ముఖ్యంగా జిల్లాలో పత్తి సాగుచేస్తున్న రైతులు ప్రత్యామ్నాయ పంటలకు మళ్లాల్సిన ఆవశ్యకత ఉంది. పత్తి సాగు విస్తీర్ణం తగ్గించకపోతే ధర లేక మళ్లీ ఇబ్బందులు పడే ప్రమాదముంది. ఇవన్నీ మార్కెట్ వ్యాపారులు మాట్లాడుకునే మాటలు కాదు. తిరుపతిలోని శ్రీ వేంకటేశ్వర వ్యవసాయ కళాశాల ఆధ్వర్యంలో నడుస్తున్న అగ్రికల్చరల్ మార్కెట్ ఇంటెలిజెన్స్ సెంటర్ (ఏఎంఐసీ) 2015-2016 ఖరీఫ్ పంటల కోత సమయానికి మార్కెట్‌లో ఉండే ధరల అంచనా నివేదికలోని అంశాలివి.
ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయానికి అనుబంధంగా నడుస్తున్న ఈ కేంద్రంలో ఏటా ఖరీఫ్, రబీ సీజన్లలో రైతులు పండించే 12 రకాల పంటల ధరలు కోత సమయానికి ఏ విధంగా ఉంటాయనేది వివిధ మార్కెట్ల అధ్యయనం ఆధారంగా అంచనా వేసి నివేదికను విడుదల చేస్తారు. కరవు, ప్రకృతి వైపరీత్యాలు సంభవిస్తే మరోసారి అంచనాలోకి దిగుతారు. ఫలితాలను‘ఇఫ్కో’ కిసాన్ కాల్ సెంటర్ ద్వారా 6.5 లక్షల రైతులకు సంక్షిప్త సందేశం పంపుతుంటారు. దీనివల్ల రైతులకు పంటల సరళి, కోత సమ యాల్లో నిల్వ చేయాలా? అమ్ముకోవాలా? అనేది నిర్ణయించుకోగలుగుతారు. 2010 నుంచి అయిదేళ్లుగా ఈ కేంద్రం నిర్ణయించిన ధరల అంచనాలు 82-92 శాతం కచ్చితత్వాన్ని కలిగి వున్నట్టు ఏఎంఐసీ-లాం ఫారం వ్యవసాయ ఆర్థిక శాస్తవేత్త డాక్టర్ ఎం.చంద్రశేఖరరెడ్డి వెల్లడించారు.
తాజా నివేదిక ప్రకారం...
తాజాగా విడుదల చేసిన 2015-2016 ఖరీఫ్‌కు సంబంధించిన నివేదిక ప్రకారం జిల్లాలో రైతులు అధికంగా పండించే పత్తి, మిరప, మొక్కజొన్న, పసుపు పంటల్లో పసుపు, మిర్చి, అపరాలు మినహా మిగిలిన పంటల ధరలు ఆశాజనకంగా ఉండే అవకాశం లే దు. చైనాకు ఎగుమతులు తగ్గిపోవటంతో గత సీజనులో పత్తి సాగుచేసి రైతులు చేదు అనుభవాలను ఎదుర్కొన్న విషయం తెలిసిందే. మద్దతు ధర క్వింటాలుకు రూ.4050 ఉండగా, వాస్తవంలో మార్కెట్ ధర రూ.1800-3000లకు మించి లేదు. ఏఎంఐసీ శాస్త్రవేత్తలు గత 14 సంవత్సరాల సరాసరి ధరల ఆధారంగా చేసిన విశ్లేషణ ప్రకారం పత్తి పంట కోత సమయానికి (అక్టోబరు-2015 నాటికి) క్వింటాలు రూ.4000 వరకు మాత్రమే ధర ఉంటుందని డాక్టర్ చంద్రశేఖరరెడ్డి చెప్పారు. పత్తి సాగు చేసే రైతులు ఈ సీజనుకు ప్రత్యామ్నాయం చూసుకుని విస్తీర్ణం తగ్గించుకుంటే ప్రయోజనం ఉంటుందని ఆయన సూచించారు. మద్దతు ధరల నిర్ణయం కాని మిరప, పసుపు పంటలకు ధరలు ఫరవాలేదు.
2016 జనవరి, ఫిబ్రవరి నాటికి మిర్చి ధర క్వింటాలు రూ.6500-7000 వరకు ఉంటాయి. ప్రస్తుత సీజనులో క్వింటాలు దాదాపు ఇదే ధరల్లో అమ్మకాలు జరిగాయి. ప్రస్తుతం క్వింటాలు రూ.6500 సగటున అమ్మకాలు జరుగుతున్న పసుపు 2016 జనవరి నాటికి రూ.7200-7500 వరకు ధర పలుకుతుందన్న సమాచారం సంతోషం కలిగించేదిగా ఉంది. ఇదేవిధంగా మొక్కజొన్న క్వింటాలు రూ.1200-1300, పెసలు రూ.5500-6000, కందులు రూ.5300-5500 వరకు ఉంటాయని అంచనా. జిల్లాలో ఖరీఫ్ సీజనులో ఈ పంటల సాగు విస్తీర్ణం బహు తక్కువనే విషయం తెలిసిందే.
పత్తికి మళ్లీ నిరాశే
Published Thu, Jun 18 2015 1:11 AM | Last Updated on Mon, Oct 1 2018 2:00 PM
Advertisement