ప్రభుత్వ ఉద్యోగాల అర్హత వయో పరిమితి పెంపు | An increase in the age limit to qualify for a government job | Sakshi
Sakshi News home page

ప్రభుత్వ ఉద్యోగాల అర్హత వయో పరిమితి పెంపు

Published Wed, Sep 24 2014 12:34 AM | Last Updated on Thu, Mar 28 2019 6:31 PM

ప్రభుత్వ ఉద్యోగాల అర్హత వయో పరిమితి పెంపు - Sakshi

ప్రభుత్వ ఉద్యోగాల అర్హత వయో పరిమితి పెంపు

34 నుంచి 40 సంవత్సరాలకు పెంచిన ఏపీ సర్కారు
ఎస్‌సీ, ఎస్‌టీ, బీసీలకు మరో ఐదేళ్లు.. అంటే వారికి 45 ఏళ్లు
30-09-2016 వరకు చేసే డెరైక్ట్ రిక్రూట్‌మెంట్లకు పెంపు వర్తింపు
పోలీస్, ఎక్సైజ్, అగ్నిమాపక, జైళ్లు, అటవీ శాఖలకు పెంపు వర్తించదు
ఆంధ్రప్రదేశ్‌లో ప్రస్తుతం 1.38 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు ఖాళీ
వెంటనే ఈ పోస్టులను భర్తీ చేస్తేనే వయోపరిమితి పెంపునకు ఫలితం
లేదంటే కిరణ్ సర్కారు ఉత్తర్వుల తరహాలో కాగితాలకే పరిమితం

 
హైదరాబాద్: ప్రభుత్వ ఉద్యోగాల నియామకాల అర్హత వయోపరిమితిని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆరు సంవత్సరాలు పెంచింది. ప్రస్తుతం 34 సంవత్సరాలున్న వయోపరిమితిని 40 సంవత్సరాలకు పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఐ.వై.ఆర్.కృష్ణారావు మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ పెంపుదల 2016 సెప్టెంబర్ 30 వరకు చేసే డెరైక్ట్ రిక్రూట్‌మెంట్ పోస్టుల భర్తీకి వర్తిస్తుందని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. జనరల్ కేటగిరీలో వయోపరిమితి పెంచిన నేపథ్యంలో ఎస్‌సీ, ఎస్‌టీ, బీసీలకు మరో ఐదేళ్ల వయో పరిమితి పెరుగుతుంది. అంటే ఎస్‌సీ, ఎస్‌టీ, బీసీల వయోపరిమితి 45 సంవత్సరాలుగా ఉంటుంది.

ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్‌తో పాటు ఇతర ఏజెన్సీలు నేరుగా భర్తీ చేసే పోస్టులకు వయోపరిమితి పెంపు వర్తిస్తుందని ప్రభుత్వ ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు. శరీర దారుఢ్య పరీక్షలు తప్పనిసరిగా ఉండే యూనిఫాం సర్వీసు పోస్టులైన పోలీసు, ఎక్సైజ్, అగ్నిమాపక, జైళ్లు, అటవీ శాఖలకు ఈ పెంపు వర్తించదని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. రాష్ట్ర విభజన నేపథ్యంలో ప్రభుత్వ ఉద్యోగాలను నిరుద్యోగ యువత కోల్పోయారని, ఈ నేపథ్యంలో వయోపరిమితిని పెంచాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

ఏపీలో 1,38,747 పోస్టులు ఖాళీ..

రాష్ట్రం విడిపోయిన తరువాత ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో ఉద్యోగుల సంఖ్య 6,80,516 గా ఆర్థికశాఖ లెక్క తేల్చింది. అందులో 1,38,747 పోస్టులు ఖాళీగా ఉన్నట్లు లెక్కగట్టింది. ఉమ్మడి రాష్ట్రంలోనే పలు శాఖల్లో 65,000 పోస్టుల భర్తీకి కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రభుత్వం అనుమతిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అయితే రాష్ట్ర విభజన నేపథ్యంలో ఆ పోస్టుల భర్తీ నిలిచిపోయింది. ఇప్పుడు ప్రభుత్వం వయోపరిమితి పెంపు నిర్ణయం వయసు మీరిన నిరుద్యోగులకు ఉపయోగపడాలంటే వెంటనే ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి చర్యలు తీసుకోవాలని నిరుద్యోగ యువత కోరుతోంది. ఏపీపీఎస్సీ ద్వారా ఉద్యోగాలు భర్తీ చేసిన పక్షంలో అనేక మంది నిరుద్యోగులకు ఉపయోగపడుతుంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇప్పుడా అప్పుడా అని ఊరిస్తున్న డీఎస్సీకి సంబంధించి అభ్యర్థులకు ఈ వయస్సు పెంపు వల్ల ఒక ఏడాది కలిసొస్తుంది. డీఎస్సీ ద్వారా ఉపాధ్యాయుల భర్తీకి గరిష్ట వయోపరిమితి 39 సంవత్సరాలుగా ఉన్న విషయం తెలిసిందే. బీఈడీ, ఎస్‌జీటీ పోస్టులకు హాజరయ్యే నిరుద్యోగులకు తాజా పెంపు వల్ల ఒక ఏడాది కలిసిరానుండగా, ఒక ఏడాది కలిసొచ్చే నిరుద్యోగులు అన్ని కేటగిరీలు కలిపి 30 నుంచి 40 వేల మంది అభ్యర్థులు డీఎస్సీకి అర్హత పొందుతారని అధికార వర్గాలు చెప్పాయి.
 
 భర్తీ జాప్యం చేస్తే.. పెంపు ముగిసిపోతుంది

గతంలో కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రభుత్వం ఉమ్మడి రాష్ట్రంలో వయో పరిమితిని 34 సంవత్సరాల నుంచి 36 సంవత్సరాలకు పెంచారు. అయితే ఆ పెంపు వర్తించే గడువు లోపు అప్పటి ప్రభుత్వం ఎలాంటి ఖాళీలను భర్తీ చేయలేదు. దీంతో ఆ పెంపు కాగితాలకే పరిమితమైంది. ఇప్పుడు కూడా వయోపరిమితి పెంచుతూ ఉత్తర్వులు ఇస్తే సరిపోదని, ప్రభుత్వంలో ఖాళీగా ఉన్న ఉద్యోగాలన్నింటినీ వెంటనే భర్తీ చేయాలని నిరుద్యోగ యువత కోరుకుంటున్నారు. అప్పుడే వయోపరిమితి పెంపుకు ఫలితం ఉంటుందని చెప్తున్నారు. అలా కాకుండా పోస్టుల భర్తీని జాప్యం చేస్తే వయోపరిమితి పెంపు కాలపరిమితి ముగిసిపోతుందని, ఈ పెంపు ఉత్తర్వులకు కాలదోషం పడుతుందని అధికార వర్గాలు కూడా పేర్కొంటున్నాయి.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement