మూసీకి మరో ముప్పు
Published Tue, Aug 6 2013 12:10 AM | Last Updated on Tue, Jun 4 2019 6:33 PM
హైదరాబాద్ నగరంలోని కాలుష్య కారక కంపెనీలన్నింటినీ ఔటర్ రింగ్‌రోడ్డు ఆవలికి తరలించాలన్న ప్రభుత్వ నిర్ణయంతో జిల్లాలోని మూసీ ఆయకట్టు ప్రాంత ప్రజలకు ముప్పు వాటిల్లబోతోంది. తీవ్రమైన కాలుష్య కారకమైన కంపెనీలలోంచి వెలువడే వ్యర్థ రసాయనాలు నేరుగా మూసీలోకి పంపించే కుట్ర సాగుతోందని ఇక్కడి ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. జీఓ నంబర్ 20 ప్రకారం కాలుష్య, కాలుష్యరహిత కంపెనీలను తొల గించి నగర శివారుల్లోని 48చోట్ల పారిశ్రామికవాడలను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా జిల్లా పొరుగునే గల ఎదులాబాద్, అంకుశాపురం, మాదారం గ్రామాల శివార్లలో 630 ఎకరాల్లో పారిశ్రామికవాడను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఈ మేరకు భూ సేకరణ కోసం ఆయా కంపెనీల యజమానులు ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తున్నారు. ఈ ప్రాంతంలో కంపెనీలు ఏర్పాటైతే వాటి నుంచి విడుదలయ్యే కాలుష్య కారకాలు ఆ ప్రాంతం కంటే పొరుగునే ఉన్న జిల్లాలోని మూసీ పరీవాహక మండలాలపై తీవ్ర ప్రభావాన్ని చూపనున్నాయి. ఇప్పటికే మూసీ కాలుష్యంతో ఇబ్బం ది పడుతున్న ఈ ప్రాంత ప్రజలకు కంపెనీల ఏర్పాటు శరాఘాతంగా మారనుంది.
నాలుగు మండలాలపై ప్రధాన ప్రభావం
మూసీని ఆనుకొని ఉన్న బీబీనగర్, భూదాన్‌పోచంపల్లి, వలిగొండ, రామన్నపేట మండలాల్లోని మూసీజలాలు తీవ్రంగా కాలుష్యమయ్యే అవకాశం ఉంది. ప్రస్తుతం రంగారెడ్డి జిల్లా ఘట్కేసర్ మండలం పోతురాజుగూడెం వద్ద ఏర్పాటు చేసే ఇండస్ట్రియల్ పార్కునుంచి వెలువడే వ్యర్థ రసాయనాలను మూసీలోకి నేరుగా వదలడంతో మక్తానంతారం మీదుగా పడమటిసోమారం చిన్నచెరువు, వెంకిర్యాల పెద్దచెరువు, మక్తానంతారం కత్వల్లో కాలుష్యం పెరిగే అవకాశం ఉంది. మూసీకి అనుసంధానంగా ఏర్పాటు చేసిన బునాదిగాని, పిల్లాయిపల్లి కాల్వల ద్వారా కూడా రసాయనాలు ప్రజలను నష్టాల పాలు చేసే అవకాశం ఉంది.
సాగుపై మరింత ప్రభావం
జిల్లాలోని మూసీ పరీవాహక ప్రాంతంలో మూసీ నీటితో లక్ష ఎకరాలకు పైగా వరిసాగుతో రైతులకు మేలు జరుగుతోంది. రికార్డుల ప్రకారం 70వేల ఎకరాలు ఉన్నప్పటికీ అనధికారికంగా మరో 50వేల ఎకరాలు సాగవుతుంది. వరిసాగుతో పెరిగిన ఉత్పత్తి వల్ల జరిగే లాభంతో పాటు అంతే స్థాయిలో ఇక్కడి ప్రజల ఆరోగ్యం దెబ్బతింటోంది. వ్యవసాయం, పాడిపంటలు, మత్స్య పరిశ్రమ, గీత వృత్తి తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉంది. ఇటీవల భూ సేకరణ కోసం ప్రభుత్వం ప్రయత్నాలు ప్రారంభించడంతో తమకు నష్టాలు జరుగుతాయని ఆ ప్రాంత ప్రజలు ఆందోళనకు సిద్ధమవుతున్నారు.
మూసీ జలాల్లో ప్రాణాంతకమైన రసాయనాలు
గతంలో వర్షాకాలం ప్రారంభంతోనే కురిసే వానల కోసం ఎదురుచూసే హైదరాబాద్ పారిశ్రామికవాడల్లోని యజమానులకు ఇక్కడ ఇండస్ట్రియల్ పార్కు ఏర్పాటు చేస్తే ఆ పరిస్థితి ఉండదు. నిబంధనల ప్రకారం ఆ కంపెనీల్లో వ్యర్థ రసాయనాలను నిర్వీర్యం చేయాలి. అలా చేయకుండా వర్షాకాలం వచ్చే వరకు ఆ ప్రాణాంతకమైన రసాయనాలను ఆపి వర్షాలు కురవగానే ఆ నీటిలో వ్యర్థరసాయనాలను కలుపుతారు. దీంతో పెద్ద ఎత్తున రసాయనాలు వరద నీటిలో కలిసి నురగలు కక్కుకుంటూ మూసీ వెంట పరుగులు తీస్తాయి. ఈ రసాయనాల్లో పాదరసం, జింక్, హీలియం, కాడ్మియం, క్రోమియం వంటి ప్రాణాంతక రసాయనాలు మూసీలో కలుపుతారు. తాజా ఇండస్ట్రియల్ పార్కు నుంచి వెలువడే కాలుష్య కారకాలు మూసీపై ఆధారపడి జీవించే లక్షలాది మంది జీవితాల్లో దుర్భర పరిస్థితులను నెలకొల్పనుంది.
ఆరోగ్యంపై మరింత దుష్ర్పభావం
మూసీ జలాలతో ఇప్పటికే అవస్థలు పడుతూ వ్యవసాయం చేసుకుంటున్న వారికి తాజా కంపెనీల కాలుష్యం మరణశాసనం రాయబోతుంది. కాలుష్యపు నీటితో పండించే పంటలు, కూరగాయలు, ఆకుకూరలు తినడం ద్వారా ప్రజలకు భయంకరమైన జబ్బులు ప్రబలుతున్నాయి. ప్రధానంగా మూసీ పరీవాహక ప్రాంతాల్లోని గ్రామాల్లో ఆర్థరైటిస్, గాస్ట్రోఎంటరైటిస్, చర్మవ్యాధులు, మలేరియా, కంటి సంబంధ వ్యాధులు, ఒళ్లు, కీళ్లనొప్పులు, గర్భస్రావాలు, కిడ్నీ సంబంధ, ఆర్గాన్స్, హార్మోన్స్ సంబంధిత వ్యాధులు సోకి ప్రజలు అవస్థలు పడుతున్నారు.
మూసీ వెంట ఇండస్ట్రియల్ పార్కును ఏర్పాటు చేయొద్దు
ఇప్పటికే కాలుష్యంతో నిండిన మూసీని రక్షించలేని ప్రభుత్వం తాజాగా ఇచ్చిన పారిశ్రామిక పార్కుల అనుమతితో మరింత నష్టం జరుగనుంది. రంగారెడ్డి జిల్లా ఘట్కేసర్ మండలంలో ఏర్పాటు చేసే ఇండస్ట్రియల్ పార్కు వల్ల బీబీనగర్, పోచంపల్లి, వలిగొండ, రామన్నపేట మండలాల ప్రజల జీవనంపై తీవ్ర ప్రభా వం చూపనుంది. మూసీ వెంటే ఫ్యాక్టరీలు ఏర్పాటైతే కాలుష్యాన్ని నేరుగా మూసీలో కలుపుతాయి. దీనివల్ల మూసీజలాలు అత్యంత విషపూరితం కానున్నాయి.
- కొమ్మిడి నర్సింహారెడ్డి,
మాజీ ఎమ్మెల్యే, భువనగిరి
Advertisement
Advertisement