మాయలపకీర్ వేషాలు మానుకో బాబూ! | AP cc Vice President N . Tulasireddy fire on cm chandrababu | Sakshi
Sakshi News home page

మాయలపకీర్ వేషాలు మానుకో బాబూ!

Published Sun, Mar 27 2016 1:38 AM | Last Updated on Sat, Jul 28 2018 3:33 PM

మాయలపకీర్ వేషాలు మానుకో బాబూ! - Sakshi

మాయలపకీర్ వేషాలు మానుకో బాబూ!

 విజయవాడ సెంట్రల్ :  ముఖ్యమంత్రి చంద్రబాబు మాయల పకీర్ వేషాలు మానుకుంటే మంచిదని ఏపీసీసీ ఉపాధ్యక్షుడు ఎన్.తులసిరెడ్డి హితవు పలికారు. రాజధాని పేరుతో బాబు హంగామా ప్రజలకు అర్థమైపోయిందన్నారు. ఆంధ్రరత్న భవన్లో శనివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. రాజధాని మాస్టర్‌ప్లాన్‌కు సింగపూర్ కంపెనీకి రూ.15 కోట్లు చెల్లించిన బాబు, భవనాల డిజైన్ల కోసం జపాన్‌కు చెందిన మకి కంపెనీకి రూ.97.50 లక్షలు చెల్లించారన్నారు. రాజధాని నిర్మాణానికి నిధులు ఎలా సేకరించాలి అని సలహా చెప్పినందుకు మెకిన్సీ కంపెనీకి రూ.112 కోట్లు చెల్లించేందుకు బాబు రంగం సిద్ధం చేస్తున్నారన్నారు. రాజధాని నిర్మాణం పేరుతో అడ్డగోలు దోపిడీకి బాబు తెరతీశారని పేర్కొన్నారు.

విభజన చట్టంలో సెక్షన్-6 ప్రకారం రాజధాని నిర్మాణానికి సంబంధించి సూచనలు, సలహాలు ఇచ్చేందుకు నియమించిన శివరామకృష్ణన్ కమిటీ ఇచ్చిన నివేదికను ప్రభుత్వం బుట్టదాఖలు చేసిందన్నారు. ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టంలో సచివాలయం, రాజ్‌భవన్, శాసనసభ, శాసన మండలి, హైకోర్టు, రోడ్లు, ఇతర మౌలిక సదుపాయాలకు సంబంధించి కేంద్రప్రభుత్వం నిధులు సమకూర్చాలని స్పష్టంగా ఉందన్నారు.

మాస్టర్‌ప్లాన్, డిజైన్లు, ప్రజాభిప్రాయం, భూమి పూజలు, శంకుస్థాపనల పేరుతో బాబు ప్రదర్శిస్తున్న టక్కుటమార విద్యలు ప్రదర్శిస్తున్నారని ఎద్దేవాచేశారు. ప్రభుత్వం తన వైఫల్యాలను కప్పిపుచ్చుకొనేందుకే ఇలాంటి చీప్‌ట్రిక్స్ ప్రదర్శిస్తోందని దుయ్యబట్టారు. ఎన్నికల మేనిఫెస్టోను అమలు చేయడం చేతకాని బాబు రాజధాని నిర్మాణమెలా పూర్తి చేయగలరో చెప్పాలని ప్రశ్నిం చారు. ఆయనతోపాటు పార్టీ నాయకుడు కొలనుకొండ శివాజీ తదితరులు ఉన్నారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement