విశాఖ : హైదరాబాద్ మోహదీపట్నంలో ఆత్మహత్య చేసుకున్న ఆర్మీ జవాను అప్పలరాజు మృతదేహం మంగళవారం విశాఖ చేరింది. మృతుని బంధువులు, స్థానికులు రేగొండ జంక్షన్ వద్ద మృతదేహంతో ఆందోళనకు దిగారు. ఆందోళనకు యత్నించిన అప్పలరాజు భార్య అనసూయను ఆర్మీ సిబ్బంది అడ్డుకున్నారు. కాగా అప్పలరాజు స్వస్థలం వేపగుంట. జవాను అంత్యక్రియలు నేడు జరగనున్నాయి.
మోహదీపట్నం ఆర్మీ ఏరియాలో గత నెల 8వ తేదీన ముస్తఫా అనే బాలుడు మృతి చెందాడు. ఈ కేసును స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం దర్యాప్తు చేస్తోంది. ఈ క్రమంలోనే అప్పలరాజును కూడా ఇటీవలే విచారించి వదిలిపెట్టారు. తరచు విచారణ పేరుతో అప్పలరాజును వేధిస్తుండటంతో మన స్తాపానికి గురై ఆత్మహత్య చేసుకుని ఉంటాడని మిలటరీ అధికారుల భావిస్తున్నారు.
కాగా ముస్తఫా కేసులో అప్పలరాజును నిందితుడిగా భావించరాదని మిలటరీ ఉన్నతాధికారులు ఒక ప్రకటనలో స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో న అప్పలరాజు ఆర్మీ క్యాంపస్లో సోమవారం తెల్లవారుజామున పిస్టోలుతో కాల్చుకుని మరణించటం మిస్టరీగా మారింది.