అవినాష్‌కు 15 రోజుల రిమాండ్ | Avinasku remanded in 15 days | Sakshi
Sakshi News home page

అవినాష్‌కు 15 రోజుల రిమాండ్

Published Sat, Mar 14 2015 2:25 AM | Last Updated on Tue, Aug 21 2018 7:39 PM

Avinasku remanded in 15 days

సామర్లకోట : మానవ హక్కుల సంఘం మాటున మోసాలకు, దురాగతాలకు పాల్పడి, రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన పేరాబత్తుల అవినాష్ దేవ్‌చంద్రను పోలీసుల హైడ్రామా మధ్య శుక్రవారం రాత్రి పెద్దాపురం సబ్ జెయిల్‌కు తరలించారు. పెద్దాపురం పోలీస్‌స్టేషన్‌లో శుక్రవారం సాయంత్రం జిల్లా ఎస్పీ రవిప్రకాష్ విలేకరుల సమావేశం ఏర్పాటు చేసినట్టు పోలీసులు సమాచారం ఇచ్చారు. అయితే ఎస్పీ వచ్చే సమయానికే అవినాష్‌ను పెద్దాపురం ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి కోర్టుకు తీసుకువచ్చారు.

అప్పటికే కోర్టు సమయం దాటిపోవడంతో జడ్జి ఎస్.శ్రీనివాస్ ఇంటి వద్ద హాజరు పర్చారు. సుమారు గంట విచారణ చేసిన తరువాత జడ్జి ఈనెల 27 వరకు రిమాండ్ విధించారు. దాంతో పోలీసులు భారీ భద్రత మధ్య పెద్దాపురం సబ్ జెయిల్‌కు తరలించారు. కాగా పెద్దాపురం పోలీసులు అవినాష్‌పై పెట్టిన కేసులు (క్రైమ్ నెం.63/2015 యు/ఎస్.419,420,506,170 ఆర్/డబ్లు 34 ఐపీసీ) కూడా బెయిల బుల్ కావడంపై పలు సందేహాలు వ్యక్తమవుతున్నారుు.

ఈ సెక్షన్ల కింద కేసులు పెట్టడం వల్ల అవినాష్ వెంటనే విడుదల అయ్యే అవకాశం ఉందంటున్నారు. అవినాష్ ఉపయోగించిన  కారును, సెల్ ఫోనును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ప్రత్యేకాధికారి డీఎస్పీ ఎం.వెంకటేశ్వరరావు కేసు దర్యాప్తు చేస్తున్నారు. కోర్టుకు తీసుకు వచ్చిన సమయంలో అవినాష్‌ను చూడటానికి అనేక మంది వచ్చారు.
 
హ్యూమన్ రైట్స్ ఆర్గనైజేషన్ జిల్లా కో ఆర్డినేటర్ అరెస్టు
అమలాపురం టౌన్ : కాగా మానవ హక్కుల వేదిక పేరుతో జిల్లాలో అక్రమ వసూళ్లు, దందాలకు దిగిన అవినాష్ మోసాలు తవ్వేకొద్దీ బయటపడుతున్న క్రమంలోనే హ్యూమన్ రైట్స్ ఆర్గనైజేషన్ పేరుతో కొందరు వ్యక్తులు చేసిన అక్రమాలు వెలుగు చూశాయి. పెద్దాపురం మండలం కొండపల్లి వేదికగా హ్యూమన్ రైట్స్ ఆర్గనైజేషన్ జిల్లా కో ఆర్డినేటర్‌గా చెప్పుకుంటున్న అదే గ్రామానికి చెందిన కోండ్రు సతీష్‌ను అమలాపురం పోలీసులు శుక్రవారం అరెస్టు చే శారు.

అమలాపురం పట్టణ సీఐ వై.ఆర్.కె.శ్రీనివాస్ అరెస్టు చేసిన సతీష్‌ను విలేకరులకు చూపి, వారి మోసాలను వివరించారు. చెన్నై కేంద్రంగా పని చేస్తున్న అంతర్జాతీయ హ్యూమన్ రైట్స్ ఆర్గనైజేషన్ అంటూ నకిలీ ఐడెంటిటీ కార్డులు, కరపత్రాలు ముద్రించి గ్రామాల్లో, పట్టణాల్లో యువకులను సభ్యులుగా చేర్చుకుంటున్నారు. సంస్థకు రాష్ట్ర కార్యదర్శిగా జి.డి.గోపి, ఆర్గనైజర్‌గా ఉబయతుల్లాఖాన్, రాష్ట్ర కో ఆర్డినేటర్‌గా తిరుమలరెడ్డి వ్యవహరిస్తూ జిల్లా శాఖకు సతీష్‌ను కో ఆర్డినేటర్‌గా నియమించారు.
 
సతీష్ జిల్లాలో పలు చోట్ల యువకుల వద్దకు వెళ్లి తమ ఆర్గనైజేషన్‌లో చేరితే పదవులతోపాటు ఐడెంటిటీ కార్డులు ఇస్తామని, వాటితో ప్రభుత్వ కార్యాలయాలకు, హాస్టళ్ల వంటి సంస్థలకు వెళ్లి ప్రశ్నించే హక్కు ఉంటుందని, పోలీసులు కూడా భయపడతారని నమ్మించాడు. సభ్యత్వానికి రూ.5వేల చొప్పున వసూలు చేశాడు. ప్రభుత్వ కార్యాలయాలకు వెళ్లి బెదిరిస్తే ఇచ్చే సొముమ్ల్లో కొంత తమకు ఇవ్వాలన్న షరతు పెట్టాడు. అమలాపురానికి చెందిన తొమ్మిదిమందికి నకిలీ ఐడెంటిటీ కార్డులు జారీ చేశాడు.

అవినాష్ ఉదంతం బయటపడగానే అమలాపురం గడియారస్తంభం సెంటర్‌లో ఈ ఆర్గనైజేషన్ పేరుతో ఉన్న ఫ్లెక్సీని పోలీసులు సీజ్ చేసి అందులోని ఫోటోల ఆధారంగా కొందరి అదుపులోకి తీసుకుని విచారించగా తీగలాగితే డొంక కదిలినట్టు ఈ బోగస్ మానవహక్కుల వేదిక  మోసాలు వెలుగు చూశారుు. ఈనెల 9న పెద్దాపురంలో తమ సంస్థ అంతర్జాతీయ సభ నిర్వహిస్తున్నట్టు ఖరీదైన ఆహ్వాన పత్రాలు ముద్రించి, వాటిపై హోంమంత్రి, జిల్లాలోని పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల పేర్లను ముద్రించి వారు హాజరవుతున్నట్టు పేర్కొన్నారు.

దీనిపై అమలాపురం పోలీసులు  ఆరా తీయగా ఆ ప్రజాప్రతినిధులెవరూ తమకు ఆహ్వానాలు లేవని చెప్పారు. కాగా సతీష్‌తోపాటు ఆ ఆర్గనైజేషన్ రాష్ట్ర నాయకులైన గోపి, ఖాన్, తిరుమల రెడ్డితోపాటు మరో 10మందిపై కేసులు నమోదు చేశామని, వారిని కూడా త్వరలో అరెస్టు చేస్తామని సీఐ చెప్పారు. వీరిపై 415, 419, 420, 471, 384 సెక్షన్ల కింద కేసులు నమోదు చేశామన్నారు. సతీష్‌ను కోర్టులో హాజరుపరిచామని చెప్పారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement