ప్రత్యేక వాహనంలో ఊరేగింపు చేస్తున్న దృశ్యం
విజయనగరం టౌన్ : పురవీధులు పులకించిపోయాయి. భక్తిప్రపత్తులతో, బాబా నామస్మరణతో మెట్ట ప్రాంతం నిండిపోయింది. కులమతాలకతీతంగా ప్రతిఒక్కరూ భక్తిభావంతో మదినిండుగా ప్రత్యేక ప్రార్థనలు చేశారు. బాబా చిత్రపటంవద్ద, సమాది వద్ద గులాబీలు, చాదర్ ఉంచి పూజలు నిర్వహించారు. దూరప్రాంతాల నుంచి వచ్చే భక్తులకు ఎటువంటి లోటుపాట్లు లేకుండా బాబా దర్గా నిర్వహకులు ఏర్పాట్లు చేశారు.
దారంతా ప్రత్యేక ఒంటెల ఆకర్షణ, గుర్రపు బగ్గీపై బాబా చిత్రపటంతో ఊరేగింపుతో భక్తులు తన్మయత్వం పొందారు. హజరత్ సయ్యద్ బాబా మహమ్మద్ తాజుద్దీన్ తాజుల్ అవులియా (నాగపూర్) ప్రియ శిష్యులు హజరత్ సయ్యద్ షహిన్‌షా బాబా ఖాదర్‌వలీ (విజయనగరం)బాబా 59వ గంథమహోత్సవ వేడుకలు శుక్రవారం స్థానిక ఖాదర్ నగర్‌లోఉన్న బాబామెట్టలో ఉన్న దర్గాలో అంగరంగ వైభవంగా జరిగాయి.
ఉదయం 6 గంటలకు ఖురాన్ షరీఫ్ పఠనం, అనంతరం దర్బార్, షరీఫ్ నుంచి నషాన్, చాదర్ సందల్ షరీఫ్‌లతో ఫకీర్ మేళా ఖవ్వాళితో ప్రత్యేక వాహనంలో నగర వీధుల్లో దర్గా షరీఫ్‌కు భారీ ఊరేగింపు చేశారు. ముతావల్లి మహమ్మద్ అతావుల్లా షరీఫ్ షా తాజ్ ఖాదరీబాబా (చీమలపాడు) బాబా దివ్యసందేశాన్ని భక్తులకు అందజేశారు. అనంతరం సుమారు 30వేలమందికి పైగా భక్తులు అన్నప్రసాదాన్ని స్వీకరించారు.
కార్యక్రమంలో ఉత్తరాఖండ్ నుంచి వచ్చిన హజరత్ సాబిర్ ముగ్దుమ్ కలియార్ ముతవల్లి అలీ ఎజాజ్ సాబ్రీ, ఆస్తాన్ ఏ తాజ్ ఖాదరియా (ఏటీకే) ఆధ్యాత్మిక సేవా సంస్థ ప్రతినిధులు ఎమ్‌ఎస్.జాఫర్ సాదీక్, మహ్మద్ ఖలీలుల్లా షరీఫ్, ఖ్వాజా మెహీద్దీన్, అతా మహమ్మద్, సిద్దిక్, షేక్ బహుదూర్, హజరత్ ఖాదర్ వలీ బాబా దర్గా, దర్బార్ షరీఫ్ షా ముతావల్లి«(దర్మకర్త) అతావుల్లా తాజ్ ఖాదరీ బాబా తదితరులు పాల్గొన్నారు.
ఆకట్టుకున్న ప్రదర్శనలు..
ఖాదర్ వలీ బాబా గంథమహోత్సవాన్ని పురస్కరించుకుని ఏర్పాటుచేసిన సాంస్కృతిక ప్రదర్శనలు, కోలాటం, భజనలు భక్తులను ఆకట్టుకున్నాయి. ఒంటెలు ప్రధాన ఆకర్షణగా నిలిచాయి.
Comments
Please login to add a commentAdd a comment