వచ్చే ఏడాది నుంచి ఇళ్ల నిర్మాణం : సీఎం జగన్‌ | Beneficiaries Should Pay Nothing Says AP CM YS Jagan Mohan Reddy | Sakshi
Sakshi News home page

వచ్చే ఏడాది నుంచి ఇళ్ల నిర్మాణం : సీఎం జగన్‌

Published Tue, Jul 2 2019 6:11 PM | Last Updated on Tue, Jul 2 2019 10:31 PM

Beneficiaries Should Pay Nothing Says AP CM YS Jagan Mohan Reddy - Sakshi

సాక్షి, అమరావతి : ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి గృహనిర్మాణ శాఖ అధికారులతో మంగళవారం సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో ఇల్లు లేనివారెవరూ ఉండకూడదని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. ఇల్లు పొందే క్రమంలో లబ్ధిదారుడు ఎక్కడా ఒక్క పైసా కూడా ఖర్చు చేయాల్సిన పనిలేదని అన్నారు. ఈ సంవత్సరం శాచ్యురేషన్‌ విధానంలో ప్రతి గ్రామంలో లబ్ధిదారులందరికీ ఇళ్లస్థలాలు ఇస్తామని చెప్పారు. 1.5 సెంట్లు చొప్పున ఇంటిస్థలాలు పంపిణీ చేయనున్నామని సీఎం తెలిపారు. ఈ కార్యక్రమంలో మంత్రులు బొత్స సత్యనారాయణ, శ్రీరంగనాథ రాజు, గృహనిర్మాణశాఖ అధికారులు పాల్గొన్నారు.



వచ్చే ఏడాది నుంచి ఇళ్ల నిర్మాణం చేపడతామని, ఉగాది రోజున ఇళ్లస్థలాలు, పట్టాల పంపిణీ కార్యక్రమం అన్ని జిల్లాలో ఘనంగా చేపట్టాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. వైయస్సార్‌ ఇళ్ల పథకం కింద నాలుగు విడతల్లో ఇళ్ల నిర్మాణం చేస్తామని తెలిపారు. గ్రామ వలంటీర్ల ద్వారా ఈ కార్యక్రమాన్ని పారదర్శకంగా అమలు చేస్తామని చెప్పారు. లబ్దిదారుల జాబితాను గ్రామ సచివాలయంలోనే ప్రదర్శిస్తామని, పెన్షనర్ల జాబితా కూడా గ్రామ సచివాలయాల్లో బోర్డుపై ఉంచుతామని అన్నారు. 365 రోజులు ఆ జాబితా అందరికీ అందుబాటులో ఉంచేలా చూడాలని అన్నారు. దీనివల్ల సోషల్‌ ఆడిట్‌ నిరంతరం కొనసాగుతున్నట్టుగా ఉంటుందన్నారు. 
(చదవండి : ఆకస్మిక తనిఖీలు చేస్తాను : సీఎం వైఎస్‌ జగన్‌)

‘లబ్ధిదారుల ఎంపికలో పక్షపాతం, అవినీతికి తావులేకుండా చేస్తాం. ఎవరైనా తప్పులు చేస్తే వారిపై కఠిన చర్యలు ఉంటాయి. పక్షపాతం, అవినీతి వల్లే సమస్యలు వస్తున్నాయి. మా పార్టీకి ఓటు వేయకపోయినా అర్హత ఉంటే ఇల్లు ఇవ్వాల్సిందే. మేం చేసే మంచిని చూసి మాకు ఓటేయాలి అన్నదే మా సిద్ధాంతం. వ్యవస్థ మారాలి, ఆ తపనతోనే పనిచేయండి. నిజాయితీగా వెళ్తే కచ్చితంగా మార్పు వస్తుంది. ఇళ్ల నిర్మాణం కోసం గ్రామాల్లో అందుబాటులో ఉన్న ప్రభుత్వ భూమిని వినియోగించండి. ప్రభుత్వ భూమి లేనిచోట ప్రభుత్వమే భూమి కొనుగోలు చేసి పేదలకు ఇస్తుంది. కొనుగోలుచేసిన భూమిని ప్లాట్ల రూపంలో విభజించి వాటిని లబ్ధిదారులకు రిజిస్ట్రేషన్‌ చేయాలి. ఉగాది నాటికి ఈ పనులన్నీ అధికారులు పూర్తి చేయాలి.

కేవలం పట్టా ఇచ్చి, తన ఇంటి స్థలం ఎక్కడ ఉందో తెలియని పరిస్థితి లబ్ధిదారుడికి రాకూడదు. రాళ్లు పాతి, మార్కింగ్‌ వేసి పక్కాగా ఇంటి స్థలాన్ని అక్కచెల్లెమ్మల పేరిట రిజిస్ట్రేషన్‌ చేయాలి. ఆధార్‌కార్డుతో లింక్‌ చేసి ఇళ్ల స్థలాలను పంపిణీ చేయండి. పట్టణాలు, నగరాల్లో కూడా ఎంత ప్రభుత్వ భూమి అందుబాటులో ఉందో చూడండి.  భూమి లేకపోతే కొనుగోలు చేయండి. స్థలంలో ఫ్లాట్లు కట్టి లబ్ధిదారులకు ఇవ్వాలి. ఏ ఫ్లాట్‌ ఎక్కడ కడుతున్నారో ముందుగానే గుర్తించి ఫలానా ప్లాటు, ఫలానా వారికి వస్తుందని ముందుగానే కేటాయించండి. ఈ ఫ్లాట్ల లబ్ధిదారులకు భూమిలో అన్‌ డివైడెడ్‌ షేర్, దీంతోపాటు ఫ్లాట్‌ రిజిస్ట్రేషన్‌ చేసి ఇవ్వండి.  రీజనబుల్‌ సైజులో ఫ్లాట్లు కట్టి ఇవ్వాలి. గతంలో చదరపు అడుగు రూ.1100 అయ్యే దాన్ని రూ. 2200–2300కు పెంచి దోచేశారు. షేర్‌వాల్‌ అని పేరుపెట్టి రూ.1100లతో అయ్యేదాన్ని రూ.2300 చేస్తే ఎలా?

పేదలపై ప్రతి నెలా రూ.3 వేల భారం వేయడం భావ్యమా. పేదలకు  ఉచితంగా ఇళ్లు ఇవ్వాల్సిందిపోయి... రూ.3 లక్షల భారం వేయడం న్యాయమా. అర్బన్‌ హౌజింగ్‌లో కడుతున్న ఫ్లాట్లపై రివర్స్‌ టెండరింగ్‌కు వెళ్లాలి. అదే టెక్నాలజీ, అదే స్పెసిఫికేషన్స్‌తో రివర్స్‌ టెండరింగ్‌ నిర్వహించాలి. కాంట్రాక్టర్లను వేధించడం ఉద్దేశం కాదు, మాకు ఎవరిపైనా  కక్షలేదు. బీదవాడికి నష్టం రాకూడదు. ఇరవయ్యేళ్లపాటు నెలా నెలా డబ్బు కట్టే పరిస్థితి ఆ పేదవాడికి ఉండకూడదన్నదే నా ఉద్దేశం. లంచాల వల్ల  బీదవాడు నష్టపోకూడదన్నదే మా అభిప్రాయం. విపరీతమైన ప్రచారం ఇచ్చి.. ఎక్కువ మంది రివర్స్‌ టెండరింగ్‌లో పాల్గొనేలా చూడాలి. ఎక్కువమంది రివర్స్‌ టెండరింగ్‌లో పాల్గొనేందుకు ఎలిజిబిలిటీ క్రైటేరియాను తగ్గిద్దాం. పునాది స్థాయి దాటని, శాంక్షన్‌ అయినా ప్రారంభం కాని ఫ్లాట్ల విషయంలో ఏ టెక్నాలజీని అయినా అనుమతించాలనుకుంటున్నాం. ఈ నిర్ణయాల వల్ల ఎంత ఆదా చేయగలమో చేయండి. నిర్మాణాల నాణ్యతలో, సౌకర్యాల కల్పనలో రాజీ పడొద్దు. ప్రస్తుతం నడుస్తున్న ఇళ్ల నిర్మాణంలో అత్యవసరంగా పూర్తిచేయాల్సిన వాటిని గుర్తించండి’ అన్నారు.

ఇక సెక్‌డేటా సక్రమంగా లేకపోవడం వల్ల కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన నిధుల్లో నష్టం జరుగుతోందని అధికారులు సీఎం దృష్టికి తీసుకొచ్చారు. సెక్‌ డేటాను సరిచేయాలని, రీసర్వే చేయాలని ప్రధానికి లేఖ రాయాలని సీఎం సూచించారు. సరిదిద్దిన డేటా ఆధారంగా ఇళ్లను కేటాయించాల్సిందిగా ప్రధాని మంత్రికి లేఖ రాయాలని అన్నారు. గ్రామ వలంటీర్ల సాయంతో డేటాను పూర్తిగా సేకరించి కేంద్రానికి పంపాలని సీఎం చెప్పారు. 

హర్షం వ్యక్తం చేసిన బీమామిత్రలు..
బీమామిత్ర ప్రతినిధులు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని కలిశారు. వారికి రూ.3 వేలు గౌరవ వేతనంగా చెల్లించనున్నట్టు సీఎం ప్రకటించారు. దాంతోపాటు ప్రతి క్లెయిమ్‌కు రూ.250 నుంచి రూ.1000కి పెంచుతున్నట్టు వెల్లడించారు. ముఖ్యమంత్రి సానుకూల స్పందనపట్ల 13 జిల్లాలో నుంచి వచ్చిన బీమామిత్ర ప్రతినిధులు సంతోషం వ్యక్తం చేశారు. సీఎం జగన్‌కు కృతజ్ఞతలు తెలిపారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement