శ్రీకాళహస్తి పోలీస్టేషన్‌లో బిర్యానీ పంచిపెడుతున్న బీజేపీ నాయకులు (ఫైల్)
సాక్షి, శ్రీకాళహస్తి: ‘‘రాష్ట్రంలో అరాచకం సృష్టించేందుకు చంద్రబాబు కుట్ర చేస్తున్నారు. కరోనా వైరస్‌తో అధికార యంత్రాంగం యుద్ధం చేస్తుంటే.. వారి ఆత్మస్థైర్యం దెబ్బతీస్తున్నారు. ప్రజలకు సాయం చేసేవారిని భయభ్రాంతులకు గురిచేస్తూ రాక్షసానందం పొందుతున్నారు’’ అని ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తంచేశారు. శ్రీకాళహస్తిలో బుధవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. కరోనా వైరస్ వ్యాప్తికి తానే కారణమని చంద్రబాబు చేసిన ఆరోపణలను తీవ్రంగా ఖండించారు. తన వల్ల ఒక్కరికి పాజిటివ్ వచ్చిందని నిరూపిస్తే వెంటనే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని సవాల్ విసిరారు. 30 ఏళ్లపాటు అధికారం అనుభవించిన బొజ్జల కుటుంబసభ్యులు, ప్రజలకు సేవ చేయకపోగా ఇళ్ల నుంచి బయటకు రావద్దని ఉచిత సలహాతో చేతులు దులుపుకున్నారని విమర్శించారు.
శ్రీకాళహస్తిలో రెక్కాడితే గాని డొక్కాడని కూలీలు 40శాతం ఉన్నారని, వారు ఆకలితో అలమటించకూడదనే ఉద్దేశంతోనే సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సూచన మేరకు తన వంతు సాయం చేస్తున్నానని చెప్పారు. అందులో భాగంగానే ట్రాక్టర్‌లో నిత్యావసర సరుకులు తీసుకెళ్లి పట్టణంలోని 35 వార్డులో ఇంటింటికి పంపిణీ చేసినట్లు వెల్లడించారు. ఆ సమయంలో వాహనాల మధ్య 10 అడుగుల దూరం పాటించామన్నారు. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించలేదని స్పష్టం చేశారు. అదే చంద్రబాబు పుట్టిన రోజును పురస్కరించుకుని టీడీపీ నాయకులు కుప్పంలో సుమారు 200 మందికి బిర్యానీ పంచిపెట్టారని, అయితే దాన్ని తాను తప్పుపట్టలేదని గుర్తుచేశారు.
ఈ విధంగా అయినా.. కొంత మంది పేదలకు అన్నదానం చేసినందుకు ఆనందించానన్నారు. శ్రీకాళహస్తిలో మాంసం విక్రయాలపై నిషేధం ఉన్నప్పటికీ ఆదివారం ఒక బీజేపీ నాయకుడు రెడ్‌జోన్ పరిధిలోనే బిర్యానీ చేయించి పోలీస్టేషన్‌లో పంపిణీ చేశారని తెలియజేశారు. ఆ బిర్యానీ తయారు చేసిన వ్యక్తికి కరోనా పాజిటివ్ బయటపడిందని, అతడి ద్వారానే పోలీసులకు వైరస్ సోకిందని వెల్లడించారు. దీన్ని బట్టి ప్రభుత్వ ఉద్యోగులకు కరోనా సోకడానికి ఎవరు కారణమో తెలుస్తోందన్నారు. విపత్కర సమయంలో ప్రాణాలకు తెగించి సేవలందిస్తున్న పారిశుధ్య కారి్మకులు, వైద్య సిబ్బంది, పోలీసులు, వలంటీర్లు, సచివాలయ ఉద్యోగులు దేవుళ్లని కొనియాడారు. అందుకే వారికి పాదపూజ చేసి ఆ నీళ్లు నెత్తిన చల్లుకున్నానని, అందుకు చాలా గర్వపడుతున్నానని తెలిపారు. విమర్శలు చేస్తున్నవారికి మానవత్వం ఉంటే సాయం చేయాలి కానీ, సేవలందిస్తున్న వారి చేతులు నరకడం ధర్మం కాదని ఆవేదన వ్యక్తం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment