గురువారం సచివాలయంలో జరిగిన మంత్రివర్గ సమావేశంలో మాట్లాడుతున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి
సాక్షి, అమరావతి : భూ వివాదాలకు తెరదించేందుకు రాష్ట్రవ్యాప్తంగా భూములను సమగ్రంగా సర్వే చేయాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నిర్ణయించారు. దీనిద్వారా భూ యజమానులకు శాశ్వత ప్రాతిపదికన హక్కులు కల్పించనున్నారు. ముఖ్యమంత్రి జగన్ అధ్యక్షతన గురువారం ఉదయం సచివాలయంలో జరిగిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో ఈ మేరకు మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలకు చట్టబద్ధత కల్పించేందుకు ఉద్దేశించిన ముసాయిదా బిల్లులకు ఆమోదం తెలపడంతోపాటు పలు కీలక నిర్ణయాలను తీసుకున్నారు. నూతనంగా ఏర్పాటయ్యే గ్రామ, పట్టణ సచివాలయాల్లో ఏకంగా 1,33,867 కొత్త ఉద్యోగాలను భర్తీ చేయాలని ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకున్నారు. మంత్రివర్గ సమావేశంలో ఆమోదించిన ముసాయిదా బిల్లులను ప్రస్తుత అసెంబ్లీ సమావేశాల్లోనే సభలో ప్రవేశపెట్టి చట్టబద్ధత కల్పించాలని ప్రభుత్వం నిర్ణయించింది. మంత్రివర్గ సమావేశంలో తీసుకున్న కీలక నిర్ణయాలు ఇవీ...
భూ సమస్యలకు సంపూర్ణ పరిష్కారం..
భూముల విషయంలో నెలకొన్న పలు సమస్యలకు సంపూర్ణ పరిష్కారం లభించేలా రాష్ట్ర ప్రభుత్వం సమగ్ర చట్టాన్ని తీసుకురానుంది. ఈ మేరకు ల్యాండ్ టైటిల్ యాక్ట్–2019 ముసాయిదా బిల్లుకు రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. భూముల యజమానులకు శాశ్వత ప్రాతిపదికన హక్కులు కల్పించడంతోపాటు ప్రస్తుతం నెలకొన్న భూ తగాదాలకు పరిష్కారం చూపడం, భవిష్యత్తులో పత్రాలు, భూ రికార్డులను ట్యాంపరింగ్ చేయకుండా నిరోధించేందుకు ఈ చట్టాన్ని ఉద్దేశించారు.
దశలవారీ మద్య నిషేధానికి శ్రీకారం...
రాష్ట్రంలో దశలవారీగా మద్య నిషేధాన్ని అమలు చేస్తామని ముఖ్యమంత్రి జగన్ ఎన్నికల్లో హామీ ఇచ్చిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా వివిధ రాష్ట్రాల్లో అమలులో ఉన్న ఎక్సైజ్ విధానాలను పరిశీలించిన అనంతరం ఇకపై మద్యం దుకాణాలను ప్రభుత్వమే నిర్వహించాలని నిర్ణయం తీసుకుంది. ఇందుకోసం 1993 ఎక్సైజ్ చట్ట సవరణకు వీలుగా రూపొందించిన ముసాయిదా బిల్లుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. దీనివల్ల మద్యం అమ్మకాలన్నీ త్వరలో ఏపీ స్టేట్ బెవరేజెస్ కార్పొరేషన్ ద్వారా జరగనున్నాయి.
1,33,867 ఉద్యోగాల భర్తీకి ఆమోదం...
పరిపాలనలో విప్లవాత్మక అడుగుగా భావిస్తున్న గ్రామ, పట్టణ సచివాలయాల్లో కొత్తగా ఏకంగా 1,33,867 ఉద్యోగాలను కల్పించాలని మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. గ్రామ, పట్టణ సచివాలయాలు, వలంటీర్ల వ్యవస్థ ఏర్పాటుకు మంత్రివర్గం ఆమోద ముద్ర వేసింది. గ్రామం ముంగిట్లోకి ప్రభుత్వ పాలనను తెచ్చేలా ఈ వ్యవస్థను తెస్తున్నట్లు పేర్కొంది. ప్రభుత్వ పథకాలు, సేవలను మరింత సమర్థంగా అందించేందుకు ఇది దోహదపడుతుందని తెలిపింది. ప్రభుత్వం ప్రధానంగా దృష్టిపెట్టిన నవరత్నాల పథకాల ప్రయోజనాలను అర్హులందరికీ అందించేందుకు ప్రతి 2,000 మంది జనాభాకు ఒక గ్రామ సచివాలయాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు మంత్రివర్గం పేర్కొంది.
నవరత్నాల ద్వారా అందించే ప్రతి ప్రయోజనాన్ని డోర్ డెలివరీ చేయడానికి ప్రతి 50 కుటుంబాలకు ఒక వలంటీర్‌ను ఏర్పాటు చేసి నెలకు రూ.ఐదు వేల చొప్పున ఇచ్చేందుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. గ్రామ కార్యదర్శి ఆధ్వర్యంలో సచివాలయం పనిచేస్తుంది. ప్రతి సచివాలయంలో కనీసం 10 నుంచి 12 మంది ఉద్యోగులుంటారు. పట్టణ ప్రాంతాల్లో కూడా ఇదే తరహా వ్యవస్థ ఉంటుంది. గ్రామాల్లో వలంటీర్ల నియామక ప్రక్రియ కోసం మండలానికి రూ.20 వేల చొప్పున మొత్తం రూ.1.5 కోట్లు ఖర్చు కానుంది. రెండు రోజుల పాటు వలంటీర్లకు శిక్షణ ఇస్తారు. రోజుకు వలంటీర్‌కు రూ.250, మెటీరియల్‌కు రూ.100 చొప్పున రూ.12 కోట్లు వ్యయం అవుతుందని అధికారులు తెలిపారు. ఆగస్టు 15వ తేదీ నుంచి గ్రామాల్లో వలంటీర్ల వ్యవస్థ అందుబాటులోకి వస్తుంది.
దేవాలయాల నామినేటెడ్ పోస్టుల్లో సగం బీసీ, ఎస్సీ, ఎస్టీలకే
ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు దేవాలయాల్లో నామినేటెడ్ పోస్టుల్లో 50 శాతం బీసీ, ఎస్సీ, ఎస్టీలకు ఇచ్చేలా చట్టసవరణకు రెండో కేబినెట్ సమావేశంలోనే ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి నిర్ణయం తీసుకున్నారు. ప్రజా ప్రయోజనాల దృష్ట్యా దేవాదాయ, ట్రస్టుల కమిటీల్లో ఎప్పుడైనా మార్పులు, చేర్పులు చేయడానికి, రద్దు చేసేందుకు ప్రభుత్వానికి అధికారం ఉంటుంది. ఇందుకు అనుగుణంగా 1987 హిందూ ధార్మిక సంస్థలు, దేవాదాయ చట్ట సవరణకు సంబంధించిన ముసాయిదా బిల్లుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది.
ఎస్టీలకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్తు
ఎస్టీ కాలనీలు, తండాల్లో నివసించే ఎస్టీలకు 200 యూనిట్ల వరకు ఉచితంగా విద్యుత్ సరఫరా చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం ఏటా రూ.81.11 కోట్లు వ్యయం చేసేందుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది.
కౌలు రైతులకు భరోసా..
కౌలు రైతులకు ఊరటనిచ్చేలా మేనిఫెస్టోలో పొందుపరిచిన మరో ప్రధాన హామీకి రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. భూ యజమానుల హక్కులకు భంగం కలగకుండా 11 నెలలు పాటు సాగు ఒప్పందం చేసుకునేందుకు వీలు కల్పించే ముసాయిదా బిల్లుకు రాష్ట్ర మంత్రివర్గం ఆమోద ముద్ర వేసింది. దీంతోపాటు ‘వైఎస్సార్ రైతు భరోసా’ పథకాన్ని కౌలు రైతులకు కూడా వర్తింపచేయనున్నారు. ఈ పథకం కింద అన్నదాతలకు ఏటా రూ.12,500 చొప్పున అందిస్తామని ప్రకటించిన సంగతి తెలిసిందే.
ఆక్వా రైతులకు రూ.1.50కే యూనిట్ విద్యుత్తు
ఆక్వా రైతులకు యూనిట్ విద్యుత్‌ను రూపాయిన్నరకే సరఫరా చేస్తామని ప్రజాసంకల్ప పాదయాత్రలో వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి హామీ ఇచ్చిన విషయం తెలిసిందే. ఇందుకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే జీవో జారీ చేసింది. ఈ జీవోకు రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఆక్వా రైతులకు యూనిట్ విద్యుత్ రూపాయిన్నరకే సరఫరా చేసేందుకు ఈ ఏడాది బడ్జెట్‌లో రూ.475 కోట్లను కేటాయించారు.
అంగన్‌వాడీల జీతాల పెంపునకు ఆమోదం..
అంగన్‌వాడీ వర్కర్ల జీతాలను పెంచుతూ తీసుకున్న నిర్ణయానికి రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. తాజా నిర్ణయంతో అంగన్‌వాడీ వర్కర్ల జీతాలు రూ.11,500కి, మినీ అంగన్ వాడీ వర్కర్లకు రూ.7000, అంగన్‌వాడీ హెల్పర్లకు రూ.7000కు పెరుగుతాయి. పెరిగిన జీతాలు జూలై నుంచి అమల్లోకి రానున్నాయి. ఈ నిర్ణయంతో 1,04,377 మందికి ప్రయోజనం చేకూరుతుంది. వీరికి జీతాల రూపంలో ప్రతి నెలా రూ.125.25 కోట్లు చెల్లించనున్నారు. గతంలో అంగన్‌వాడీ వర్కర్ల జీతం ఏడు వేల రూపాయలు మాత్రమే కాగా హెల్పర్ల జీతాలు రూ.4,500 మాత్రమే ఉండేవి.
ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల తయారీ పార్క్ కోసం చిత్తూరు జిల్లా ఏర్పేడు మండలం వికృతమాల గ్రామంలో 149 ఎకరాలను ఏపీఐఐసీకి కేటాయిస్తూ గతంలో ఇచ్చిన ఉత్తర్వులకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. గడువు తీరిన స్థానిక సంస్థల్లో ప్రత్యేక అధికారులను నియమిస్తూ జారీ చేసిన ఉత్తర్వులకు కూడా రాష్ట్ర మంత్రివర్గం అమోదం తెలిపింది.
Comments
Please login to add a commentAdd a comment