సచిన్ కోసం చకచక..
సాక్షి ప్రతినిధి, నెల్లూరు: క్రికెట్ దిగ్గజం, రాజ్యసభ సభ్యుడు సచిన్ టెండూల్కర్ పుట్టంరాజువారి కండ్రిగకు వస్తున్న సందర్భంగా ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. ఆ మేరకు జిల్లా అధికారులు పుట్టంరాజువారి కండ్రిగలో తిష్టవేసి పనులను పర్యవేక్షిస్తున్నారు. సంసాద్ ఆదర్శ గ్రామయోజన పథకం కింద సచిన్‌టెండూల్కర్ పుట్టంరాజువారి కండ్రిగను దత్తత తీసుకున్న విషయం తెలిసిందే. అందులో భాగంగా సచిన్ ఆదివారం గ్రామంలో పర్యటించనున్నారు.
అందుకు సచిన్ శనివారమే జిల్లాకు చేరుకుని కృష్ణపట్నం పోర్టులో బసచేయనున్నారు. గ్రామాన్ని ఆదర్శగ్రామంగా తీర్చిదిద్దే క్రమంలో గ్రామంలో పలు అభివృద్ధి పనులను చేపడుతున్నారు. ఇప్పటికే గ్రామంలో కొత్తగా సిమెంటు రోడ్డు ఏర్పాటు చేశారు. అయితే అది అసంపూర్తిగా దర్శనమిస్తోంది. సిమెంటు రోడ్డు వేసిన వరకు ఇరువైపులా చిప్స్ ఏర్పాటు చేస్తున్నారు. దాని పక్కనే ఫుట్‌పాత్ కూడా ఏర్పాటు చేసేందుకు అవసరమైన సిమెంటు రాళ్లను తీసుకొచ్చారు. అదేవిధంగా అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ ఏర్పాటు కోసం గ్రామంలో జేసీబీతో పెద్దపెద్ద కాలువలు తీసి ఉంచారు.
తాగునీటి పైప్‌లైన్ ఏర్పాటు కోసం అంతా సిద్ధం చేసి ఉన్నారు. స్కూల్ ప్రహరీగోడ నిర్మాణానికి అవసరమైన సామగ్రిని సిద్ధం చేశారు. పనులు ఇంకా ప్రారంభం కాలేదు. స్కూలు భవనం, ఆటస్థలం పనులు కూడా అసంపూర్తిగా ఉన్నాయి. రెండురోజులుగా ఎడతెరిపి లేని వర్షాల కారణంగా పనులు ముందుకు సాగలేదు. గ్రామం అంతా బురదమయమై చిత్తడి చిత్తడిగా దర్శనమిస్తోంది.
కలెక్టర్, ఎమ్మెల్యే పర్యటన
పుట్టంరాజువారి కండ్రిగలో సచిన్ ఆదివారం పలు అభివృద్ధి పనులకు సంబంధించి ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేయనున్నారు. కలెక్టర్ శ్రీకాంత్, జేసీ రేఖారాణి, గూడూరు ఎమ్మెల్యే పాశం సునీల్‌కుమార్ శుక్రవారం గ్రామంలో పర్యటించారు. కలెక్టర్, జేసీ గ్రామంలో పలువురి నివాసాలకు వెళ్లి పలుకరించారు. గ్రామం ముఖద్వారం ముందు ఏర్పాటు చేస్తున్న పైలాన్ పనులను పర్యవేక్షించారు. సచిన్ ఆదివారం ఉదయం గ్రామంలోకి ప్రవేశించగానే పైలాన్‌ను ప్రారంభిస్తారు.
అనంతరం నేరుగా స్వయంసహాయక సంఘాలు, రైతులు, విద్యార్థులతో ముఖాముఖి ఉంటుంది. అందుకు సంబంధించి కలెక్టర్, జేసీ ముందుగా ఎవరితో మాట్లాడించాలనే విషయంపై చర్చించారు. గ్రామంలో రచ్చబండ వద్ద రైతులు, అటువైపు మహిళలు, ఆ తరువాత విద్యార్థులతో మాట్లాడించాలని నిర్ణయించారు. ఆ తరువాత వర్షం లేకపోతే విద్యార్థులు, యువతతో సచిన్ కాసేపు క్రికెట్ ఆడేలా ఏర్పాట్లు చేస్తున్నారు.
స్థానికులతో కలెక్టర్ మాటా మంతి..
కలెక్టర్‌ః పాపా నీపేరేంటి?
పాపః సుహాసిని
కలెక్టర్‌ః స్కూలుకెళ్తున్నావా?
సుహాసినః లేదు సార్
కలెక్టర్‌ః ఎందుకెళ్లలేదు? ఏమ్మా పాపను స్కూలుకు పంపడం లేదా?
పద్మమ్మః ఏడాదిగా స్కూలుకు పంపలేదు సార్
కలెక్టర్‌ః ఎందుకు?
పద్మమ్మః కష్టంగా ఉంది సార్
కలెక్టర్‌ః అబ్బే.. అలా కాదు. రేపటి నుంచి పాపను స్కూలుకు పంపండి. గూడూరులో హాస్టల్‌లో ఉంచి బాగా చదివిస్తాం.
పద్మమ్మ, సుహాసినిః మౌనం
కలెక్టర్‌ః ఇంట్లో ఏంటి పొగ
పద్మమ్మః వంటి చేస్తున్నాం సార్
కలెక్టర్‌ః గ్యాస్ లేదా?
పద్మమ్మః లేదు సార్
కలెక్టర్‌ః మంటలురేగి అంటుకుంటే ప్రమాదం కదా? పీఏగారూ.. వీరికి గ్యాస్ ఏర్పాటు చేయండి. ఇక్కడ ఉన్న గిరిజనులకు పక్కా గృహాలు మంజూరయ్యాయి. గ్రామంలో పనులు పూర్తవుతూనే పక్కా ఇళ్ల నిర్మాణం మొదలు పెట్టాలి.
చెంచుక్రిష్ణమ్మః సారూ.. నాకు పింఛను రాలేదు సార్
కలెక్టర్‌ః ఎందుకమ్మా? ఒకే నీకు పింఛను వచ్చేలా చూస్తాను. ఇలా కలెక్టర్ గ్రామంలో పలువురిని పలకరిస్తూ పనులను పర్యవేక్షించారు. జిల్లా అధికారులకు సూచనలు, సలహాలు ఇచ్చారు.