ఉప్పొంగిన అభిమానం | The overwhelming favorite | Sakshi
Sakshi News home page

ఉప్పొంగిన అభిమానం

Published Mon, Nov 17 2014 2:20 AM | Last Updated on Sat, Sep 2 2017 4:35 PM

ఉప్పొంగిన అభిమానం

ఉప్పొంగిన అభిమానం

‘సచిన్ జిందాబాద్.. ఉయ్ వాంట్ సచిన్’ నినాదాలతో పుట్టంరాజువారి కండ్రిగ మార్మోగింది. క్రికెట్ దిగ్గజం, రాజ్యసభ సభ్యుడు సచిన్ రమేష్ టెండుల్కర్ ఆదివారం దత్తత గ్రామమైన పీఆర్ కండ్రిగలో రెండు గంటల పాటు పర్యటిం చారు. ఎక్కడో క్రికెట్ ఆడుతుంటే.. అతని ఆటను చూసేందుకు టీవీలకు అతుక్కుని చూస్తూ.. సెంచరీ కొట్టాలని దేవుళ్లను ప్రార్థించే అభిమానులు.. ఆ అభిమాన క్రికెటర్ సచిన్ నేరుగా పీఆర్ కండ్రిగకు రావడంతో ప్రజలు పులకించిపోయారు.
 
 సాక్షి ప్రతినిధి, నెల్లూరు  : సచిన్ రాక కోసం నెలరోజులుగా ఎదురుచూస్తున్న పుట్టంరాజువారి కండ్రిగ గ్రామస్తులు, పరిసర ప్రాంతవాసులు ఆదివారం పెద్ద ఎత్తున తరలివచ్చారు. గ్రామం పొలిమేర నుంచి అభిమానులు సచిన్ కోసం ఎదురుచూడటం కనిపించింది. తన అభిమాన క్రికెటర్ కోసం అభిమానులు, ఎమ్మెల్యే భారీ ఎత్తున ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. సచిన్ ఫొటోతో మాస్క్‌లను పంపిణీ చేశారు. వాటిని ధరించిన యువత సచిన్‌కు ఘనంగా స్వాగతం పలికారు.

ఫ్లెక్సీలు గూడూరు పొలిమేర నుంచి ఏర్పాటు చేసి ఉండటం కనిపించింది. క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ కృష్ణపట్నం పోర్టు నుంచి ఆదివారం ఉదయం 9 గంటలకు పీఆర్ కండ్రిగకకు కారులో చేరుకున్నారు. సచిన్ రాక కోసం ఎదురుచూస్తున్న జనం ఒక్కసారిగా ‘సచిన్ జిందాబాద్’ అంటూ నినాదాలు చేశారు. అదేవిధంగా ‘ఉయ్ వాంట్ సచిన్’ అంటూ కేకలు వేశారు.

పోలీసులు ఆంక్షలు విధించడంతో అభిమానులు బారికేడ్లకు ఇరువైపుల సచిన్ చూసేందుకు బారులు తీరారు. సచిన్ నడుస్తూ గ్రామంలోకి వెళ్తుంటే అభిమానులు ‘సచిన్ సార్.. సార్ సచిన్ గారూ’ ఆయన చూపు కోసం పిలువటం కనిపించింది. అభిమానుల పిలుపు విన్న సచిన్ వారికి అభివాదం చేస్తూ.. ముందుకు సాగారు. సచిన్‌తో కరచాలనం చేసేందుకు అభిమానులు, గ్రామస్తులు పోటీపడ్డారు.

 గ్రామస్తులతో మమేకం
 దత్త గ్రామమైన పుట్టంరాజువారికండ్రిగలో పర్యటించిన సచిన్ స్థానికులతో మమేకమయ్యారు. గ్రామంలో పైలాన్‌ను సచిన్ ప్రారంభించాల్సి ఉంది. సచిన్ ఓ చిన్నారితో ప్రారంభింపజేశారు. అనంతరం నేరుగా గిరిజనకాలనీకి వెళ్లి పూరిపాకలో నివసిస్తున్న రాజేశ్వరి కుటుంబాన్ని పలుకరించారు. వారి సాధకబాధకాలను అడిగి తెలుసుకున్నారు. అలాగేవిజయమ్మ, రత్నమ్మ నివాసానికి వెళ్లి వారినీ పలుకురించారు.

అక్కడి నుంచి చెరువులో చేపపిల్లలను విడిచి గ్రామస్తులకు ఉపాధి మార్గాన్ని చూపారు. అక్కడ మత్స్యకారులు మంత్రి నారాయణచేత చేప బొమ్మను సచిన్‌కు బహూకరించారు. అక్కడి నుంచి నేరుగా పాడిరైతుల వద్దకు వెళ్లారు. గోమాతకు పూజచేశారు. అనంతరం అంగన్‌వాడీ కేంద్రంలో ఇద్దరు గర్భిణులకు శ్రీమంతం చేయటంతో స్థానికులు మురిసిపోయారు. ఆ ఇద్దరు మహిళలు సైతం సొంత సోదరుడు శ్రీమంతం నిర్వహించిన అనుభూతిని పొందారు.

అంతకు ముందు గ్రామానికి సంబంధించిన ఫొటో ఎగ్జిబిషన్‌ను క్షుణ్ణంగా పరిశీలించారు. ఆ తరువాత గ్రామస్తుల మధ్యకెళ్లి పీఆర్ కండ్రిగను దత్తత తీసుకోవటానికి గల కారణాలను వివరించారు. ఈ మొత్తం కార్యక్రమం పూర్తయ్యే వరకు అభిమానులు సచిన్ కోసం పరుగులు తీయటం కనిపించింది. ఆయన చుట్టూ చేరి జిందాబాద్‌లు కొడుతూ గడిపారు.

 పోలీసులు, అధికారుల ఓవర్ యాక్షన్‌తో ముఖాముఖి రద్దు
 ప్రపంచ వ్యాప్తంగా అభిమానులను చూరగొన్న గొప్ప క్రికెటర్ పర్యటన అంటే ఆషామాషీ కాదు. అందుకు తగ్గ ఏర్పాట్లు చేయాల్సిన అధికారయంత్రాంగం విఫలమైందని చెప్పొచ్చు. కొంత దూరం వరకు బారికేడ్లు ఏర్పాటు చేసి వదిలేశారు. సచిన్‌ను కలవాలనుకున్న వారు ఎటువైపునుంచైనా వచ్చే అవకాశాలు కనిపించాయి. పోలీసులు, అధికారులు కొందరు కేవలం మీడియాకు ఆంక్షలు విధించాలని చూశారే తప్ప భద్రతను గాలికొదిలేశారని సచిన్ తో పాటు వచ్చిన కొందరు ముఖ్యులు చర్చించుకోవటం కనిపించింది.

మూడు గంటల పాటు సాగాల్సిన సచిన్ కార్యక్రమం రెండు గంటలకే ముగించాల్సి వచ్చింది. రైతులతో ముఖాముఖి రద్దైం ది. సచిన్ కోసం ఆశగా ఎదురుచూసిన చిన్నారులకు నిరుత్సాహం మిగిలింది. కేవలం అధికారులు ఓవర్ యాక్షన్ కారణంగా గ్రామస్తులతో ముఖాముఖి, యువతతో క్రికెట్ ఆడే కార్యక్రమాలు రద్దయ్యాయని స్థానికులు నిరాశ వ్యక్తం చేశారు. గ్రామస్తులతో కొంత సమయం గడిపేందుకు హెలికాప్టర్‌ను సైతం వదిలి గతుకుల రోడ్డుపై ప్రయాణం చేసి పీఆర్ కండ్రిగకు వచ్చిన సచిన్‌కు అధికారుల తీరు కొంత నిరుత్సాహానికి గురిచేసిందని, అందుకే ఆయన రెండుగండలకే కార్యక్రమాన్ని ముగించుకుని వెనుదిరిగారని ప్రచారం సాగింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement