సచిన్ రాకకోసం సర్వం సిద్ధం
సాక్షి ప్రతినిధి, నెల్లూరు: క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ పర్యటనకు పుట్టంరాజువారి కండ్రిగను సిద్ధం చేశారు. ఆ మేరకు ఏర్పాట్లను పూర్తి చేశారు. పర్యటనలో ఎక్కడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లను చేశారు. గ్రామంలో పర్యటించే ప్రాంతమంతా ఇనుప బారికేడ్లను ఏర్పాటు చేశారు. రాజ్యసభ సభ్యుడు సచిన్‌టెండూల్కర్ సంసద్ ఆదర్శ గ్రామ యోజన పథకం కింద పుట్టంరాజువారికండ్రిగను దత్తత తీసుకున్న విషయం తెలిసిందే.
గ్రామాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దే క్రమంలో స్థానికులతో ముచ్చటించటంతో పాటు.. గ్రామాన్ని చూడాలనే ఉద్దేశంతో సచిన్ నేడు పుట్టంరాజువారికండ్రిగకు చేరుకోనున్నారు. ఉదయం 9 గంటలకు గ్రామానికి చేరుకుని మధ్యాహ్నం 12 గంటల వరకు స్థానికులతో గడపనున్నారు. రైతులు, మహిళలు, విద్యార్థులతో స్వయంగా మాట్లాడనున్నారు. వారి సమస్యలు అడిగి తెలుసుకుంటారు. విద్యాభ్యాసం ఎలా నడుస్తుందో విద్యార్థులను అడిగి తెలుసుకోనున్నారు.
విద్యార్థులతో క్రికెట్ ఆడే అవకాశాలు ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. ఆ మేరకు ఏర్పాట్లు పూర్తి చేశారు. అదేవిధంగా త్రాగునీటి పైప్‌లైన్లు, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, ఫుట్‌పాత్, విద్యుత్ దీపాలు, క్రికెట్ స్టేడియం, వ్యాపార సముదాయం, సామూహిక చెత్తవేసేందుకు కంపోస్ట్‌యార్డు వంటి అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారు. సచిన్ టెండూల్కర్ పర్యటన సందర్భంగా మంత్రి నారాయణ, కలెక్టర్ శ్రీకాంత్, ఎమ్మెల్యే పాశం సునీల్‌కుమార్ పరిశీలించారు.
సచిన్ పర్యటన నేపథ్యంలో పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. డీఎస్పీలు, సీఐలు, ఎస్‌ఐలు, కానిస్టేబుళ్లతో కూడిని పోలీసు బృందం సచిన్ భద్రత కోసం నియమించారు. ప్రతి 20 నుంచి 30 మీటర్లకు పోలీసులు ఉంటారు. సచిన్ రాక సందర్భంగా రాకపోకలను దారి మళ్లించారు.
పుట్టంరాజువారికండ్రిగలో అధికారయంత్రాంగం
ప్రపంచ వ్యాప్తంగా క్రికెట్‌లో కీర్తి గడించిన సచిన్ టెండూల్కర్ ఓ మారు గ్రామాన్ని దత్తత తీసుకోవటంతో జిల్లా అధికారయంత్రాంగం హర్షం వ్యక్తం చేస్తోంది. అందుకు పూర్తి సహాయసహకారాలు అందిస్తోంది. ఆయన రాక సందర్భంగా ఎక్కడా ఎటువంటి లోటుపాట్లు రాకుండా ఉండేందుకు అధికారయంత్రాంగం వారం రోజులపాటు గ్రామంలోనే తిష్టవేసి పనులను పర్యవేక్షిస్తున్నారు.
ఎమ్మెల్యే, కలెక్టర్, జేసీ, ఏజేసీ, ఆర్డీఓ, ఎంపీడీఓ, తహశీల్దార్లతో పాటు వీఆర్వోలు, ఐకేపీ సిబ్బంది, ఆర్‌అండ్‌బీ, ఆర్‌డబ్ల్యూఎస్, విద్య, వైద్యశాఖ అధికారులతో పాటు పోలీసులు సచిన్ పర్యటనను విజయవంతం చేసి గ్రామాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నారు. సచిన్ పర్యటనను విజయవంతం చేసేందుకు గ్రామస్తులు కూడా అధికారులకు పూర్తి సహాయ సహకారాలు అందించారు.