చంద్రబాబు ఎందులో డిగ్రీ చేశారో తెలుసా?: వైఎస్ జగన్
ఆత్మకూరు: మోసం చేయడంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు డిగ్రీ చేశారని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ధ్వజమెత్తారు. కులాలు, మతాల పేరిట మనుషుల్ని వాడుకోవడం, ఏరు దాటాకా తెప్ప తగలేయడం చంద్రబాబు చేసిన డిగ్రీ అని ఆయన వ్యాఖ్యానించారు. నంద్యాల ఉప ఎన్నిక ప్రచారంలో భాగంగా ఎనిమిదో రోజు బుధవారం ఆత్మకూరు జంక్షన్ వద్ద వైఎస్ జగన్ ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు.
ప్రసంగం ఆయన మాటల్లోనే.. ఎన్నికలు వస్తే చాలు. మనకళ్లకు గంతలు కడతారు. చంద్రబాబు ఏం చెప్పినా ఆహా, ఓహో అంటూ తన పేపర్లు, టీవీలు చెప్పేస్తాయి. తీరా ఏరు దాటాక ఆ విషయాలపై ఎవరైనా నిలదీసి అడిగితే చంద్రబాబు చిందులు తొక్కుతారు. ఎవరైనా కొంచెం గట్టిగా అడిగితే గ్లోబెల్ ప్రచారం చేస్తారు. నంద్యాల ఉప ఎన్నిక, కాకినాడలో మున్సిపల్ ఎన్నికలు సందర్భంగా కాపులను పిలిచి ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేసి, మరోవైపు వెన్నుపోటు పొడుస్తున్నారు. 2014లో మైనార్టీలకు సంబంధించి ఓ డిక్లరేషన్ ఇచ్చారు. మైనార్టీలకు 15 సీట్లు ఇస్తా, ఉద్యోగాల్లో 6 శాతం రిజర్వేషన్లు, పిల్లలకు కేజీ నుంచి పీజీ వరకూ ఉచిత విద్య. రూ.2500 కోట్లతో మైనార్టీ సబ్‌ప్లాన్ ప్రవేశపెడతా అని చెప్పారు. అధికారంలోకి వచ్చిన ఈ మూడున్నరేళ్లలో మైనార్టీలకు ఒక్క రూపాయి అయినా పెట్టారా?.
చంద్రబాబు నైజం వాడుకోవడం ఆ తర్వాత తోసేయడం. అలా ఎన్నిసార్లైనా వాడేసుకుంటారు. మళ్లీ అదే అబద్ధాలు చెప్పేస్తారు. ఎన్నికలప్పుడు ఏం చెప్పారు. ఎన్నికల తర్వాత ఏం చేశారు?. అబద్దాలతో అధికార పీఠం ఎక్కి ఆ తర్వాత రైతులను, డ్వాక్రా మహిళలను మోసం చేశారు. ఈ మూడేళ్లలో పేదలకు ఒక్క ఇల్లు అయినా కట్టించారా? చంద్రబాబు నైజం గురించి సొంత మామ ఎన్టీఆర్ చక్కగా చెప్పారు. జామత దశమ గ్రహం అని. జామతా అంటే అల్లుడు. ...9 గ్రహాలుంటే నా అల్లుడు పదో గ్రహం అని ఎన్టీఆర్ అన్నారు.
2014 ఆగస్టు 15న ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబు కర్నూలు వచ్చారు. సీఎం నోటి నుంచి మాట వస్తే అయిపోతుందని అనుకుంటం కదా?. కర్నూలుకు ఎయిర్‌పోర్టు తెస్తామన్నారు. ట్రిపుల్ ఐటీ అన్నారు. స్మార్ట్ సిటీ, ఉర్దూ వర్సిటీ, మైనింగ్ స్కూల్, అవుకు వద్ద ఇండస్ట్రియల్ పార్క్, ఆదోని, ఎమ్మిగనూరులో అపెరల్ పార్క్‌లు, కర్నూలులో సూపర్ స్పెషాల్టీ ఆస్పత్రి, ఫుడ్ పార్క్ ఏర్పాటు చేస్తామన్నారు. అవన్నీ ఏమయ్యాయి. సీఎం హోదాలో ఇచ్చిన హామీలను కూడా అమలు చేయలేదు. నంద్యాల ఉప ఎన్నిక వచ్చేసరికి మరోసారి మోసం చేయాలని చూస్తున్నారు. ఇచ్చిన హామీల్లో ఒక్కటైనా అమలు చేశారా అని అడుగుతున్నా. మళ్లీ ఇవాళ నంద్యాలలో ఎన్నికలు వచ్చాయి. అందుకే ప్రజలతో పని పడింది. మళ్లీ అరిగిపోయిన పాత టేప్‌రికార్డర్ ఆన్ చేస్తున్నారు. అవే అబద్ధాలు, అవే మోసాలు. ప్రతి ఇంటికి మారుతీ కారు, కేజీ బంగారం అంటారు. రేపొద్దున నేను చెప్పిన ప్రతిమాట చేశాననే బొంకుతారు. సిగ్గులేకుండా బొంకుతుంటే ఇలాంటి వ్యక్తిగా ఓటు వేసేది. ఆయనలా నాకు అధికారం, డబ్బులు, సీఎం పదవి, పోలీసుల బలం లేదు. ఉన్నది లేనట్లుగా, లేనిది ఉన్నట్లుగా చూపే పేపర్లు లేవు.
కానీ ఇవాళ నాకున్న ఆస్తి నాన్న ఇచ్చిన ఇంత పెద్ద కుటుంబం. నాకున్న ఆస్తి సంక్షేమ పథకాల అమలుతో ప్రతి గుండెలో ఉండటమే. జగన్ మోసం చేయడు, అబద్ధం ఆడడు. ఏదైనా చెప్పాడు అంటే చేస్తాడు అనే విశ్వసనీయత అదే నా ఆస్తి. నాన్న మాదిరిగానే చెరగని ముద్ర వేసుకోవాలి. దేవుడి దయ, మీ అందరి ఆశీస్సులే నాకున్న ఆస్తి.
అధికారంలోకి వచ్చాక అన్ని వర్గాల ప్రజలను చంద్రబాబు మోసం చేశారు. లంచాల రూపంలో లక్షల కోట్లు దోచుకున్నారు. ఇప్పుడా డబ్బులో కొంత నంద్యాల ఉప ఎన్నిక కోసం ఖర్చు చేయడానికి వస్తున్నారు. చంద్రబాబు పంపిన డబ్బు మూటలతో దెయ్యాలు మీ ఇంటికి వస్తాయి. చేతిలో రూ.5వేలు పెట్టి.. ఆ తర్వాత జేబులో నుంచి దేవుడి పటం తీసీ చేతిలో పెట్టి... దేవుడి మీద ప్రమాణం చేయించుకుని మరీ డబ్బులు ఇచ్చే కార్యక్రమం చేస్తారు. ఏ దేవుడు కూడా పాపానికి ఓటు వేయమని చెప్పడు, అలా చెప్పిదెయ్యాలే డబ్బులు ఇచ్చినప్పుడు దేవుడిని ప్రార్థించి లౌక్యంగా ఓటేయండి. ధర్మానికి, న్యాయానికే ఓటు వేయండి. వైఎస్‌ఆర్ సీపీ అభ్యర్థి శిల్పా మోహన్ రెడ్డిని మీ దీవెనలు, ఆశీస్సులు అందించి గెలిపించండి.అని పిలుపునిచ్చారు.