వర్సిటీల చట్టంలో సమూల మార్పులు | changes in university law | Sakshi
Sakshi News home page

వర్సిటీల చట్టంలో సమూల మార్పులు

Published Mon, May 4 2015 8:24 PM | Last Updated on Sun, Sep 3 2017 1:25 AM

వర్సిటీల చట్టంలో సమూల మార్పులు

వర్సిటీల చట్టంలో సమూల మార్పులు

సాక్షి, హైదరాబాద్: యూనివర్సిటీల చట్టంలో సమూల మార్పులు చేయడానికి ఏపీ ప్రభుత్వం కసరత్తు కొనసాగిస్తోంది. ఇందుకోసం ఉన్నత విద్యామండలి నేతృత్వంలో ప్రత్యేక కమిటీ లోతుగా అధ్యయనం చేస్తోంది. యూనివర్సిటీలలో అనేక అక్రమాలు జరుగుతున్నాయన్న కారణంతో ప్రభుత్వం చట్టంలో మార్పులకు నిర్ణయించింది. ఉన్నత విద్యారంగం విస్తరించి కొత్తగా అనేక కాలేజీలు, డీమ్డ్ వర్సిటీలు, అటానమస్ కాలేజీలు ఏర్పాటైనప్పటికీ చట్టంలో మాత్రం ఇంతవరకూ ఎలాంటి మార్పు చేయలేదు. దీంతో పాలనా పరమైన అక్రమాలను నిరోధించడానికి వీలులేకుండాపోతోంది. 

స్వతంత్రత పేరిట వర్సిటీల్లో వీసీలు, పాలకమండళ్లదే ఇష్టారాజ్యంగా మారింది. ముఖ్యంగా నియామకాలు, నిధుల ఖర్చు, కాంట్రాక్టులు, కొనుగోళ్లు వంటి విషయాల్లో అక్రమాలు జరుగుతున్నాయి. దీనిపై దృష్టి సారించిన ప్రభుత్వం వర్సిటీల చట్టంలో మార్పులు చేయాలని నిర్ణయించింది. ఇందుకోసం గతంలో ఆరుగురు సభ్యులతో కమిటీని  ఏర్పాటుచేసింది. విక్రమసింహపురి మాజీ వీసీ ప్రొఫెసర్ సీఆర్ విశ్వేశ్వరరావు, ఎస్కే వర్సిటీ రిటైర్డ్ లా ప్రొఫెసర్ టీపీ సుదర్శన్‌రావు, నాగార్జున వర్సిటీ రిటైర్డ్ లా ప్రొఫెసర్ ఎన్.రంగయ్య, ఉస్మానియా వర్సిటీ రిటైర్డ్ కెమిస్ట్రీ ప్రొఫెసర్ పీఎస్‌ఎన్ రెడ్డి, నాగార్జునవర్సిటీ కంప్యూటర్ సైన్స్ రిటైర్డ్ ప్రొఫెసర్ పి.త్రిమూర్తి, రిటైర్డ్ సీనియర్ ఆడిట్ అధికారి పి.సుబ్రహ్మణ్యం ఈ కమిటీలో సభ్యులుగా ఉన్నారు.

ప్రస్తుత చట్టంలోని అంశాలను కూలంకషంగా పరిశీలించి ప్రతికూలాంశాలను గుర్తించడం, ఇతర రాష్ట్రాల్లోని వర్సిటీల చట్టాలను పరిశీలించి అందులోని మంచి అంశాలు ఇక్కడ అమలు చేయడంలో సాధ్యాసాధ్యాలు పరిశీలించడం, ప్రస్తుత సామాజిక అవసరాలకు, సవాళ్లను అధిగమించేందుకు అనుగుణంగా ఉన్నత విద్యను తీర్చిదిద్దడానికి సూచనలు చేయడం, చివరిగా ముసాయిదా సవరణల చట్టాన్ని రూపొందించడం ఈ బృందం విధి. ఈ కమిటీ ఇప్పటికే ఆరు దఫాలుగా సమావేశమై చర్చించింది. ఇదిలావుండగా, వర్సిటీలను తన గుప్పెట్లో పెట్టుకొనేందుకు మాత్రమే ప్రభుత్వం చట్టంలో మార్పులకు ప్రయత్నిస్తోందన్న వాదన కూడా వినిపిస్తోంది.

Advertisement
Advertisement