ఆగమేఘాలపై పోస్టుమార్టం
తిరుపతి: శేషాచలం అడవుల్లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో చనిపోయిన 20 మంది ఎర్రకూలీల మృతదేహాలకు బుధవారం తిరుపతిలోని రుయా ఆస్పత్రిలో పోస్ట్‌మార్టం నిర్వహించారు. 19 మృతదేహాలను అధికారులు గుర్తించారు. 7 మృతదేహాలను బుధవారం రాత్రి వారి బంధువులకు అప్పగించారు. ఈ నేపథ్యంలో తమిళనాడు యంత్రాంగం సైతం తిరుపతికి వచ్చింది. తిరువళ్లూర్ కలెక్టర్ వీరరాఘవరావు, నార్త్ జోన్ ఐజీ మంజునాథ తదితర అధికారులున్నారు.
మృతదేహాలను తరలించేందుకు తమిళనాడు ప్రభుత్వమే వాహనాలను సమకూర్చింది. కాగా, ఏపీ డీజీపీ రాముడు బుధవారం రాత్రి ఆస్పత్రికి వెళ్లి మృతదేహాలను పరిశీలించారు. తమిళనాడు నుంచి వచ్చిన మృతుల బంధువులు మృతదేహాలను చూసి కన్నీటి పర్యంతమయ్యారు. కూలీనాలీ చేసుకొని తమవారు ఇంటికి తిరిగి వస్తారనుకుంటే, పోలీసులు వారిని పొట్టన పెట్టుకుంటారని ఊహించలేదని వాపోయారు.