'రాష్ట్రంలో కాంగ్రెస్కు ఇబ్బందులున్నాయి'
అమరావతి : రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి ఇబ్బందికర పరిస్థితులు నెలకొన్నాయని అయితే వాటిని అధిగమించేందుకు కొత్త నాయకత్వం అవకాశాలను అందిపుచ్చుకొని కసితో పని చేయాని పీసీసీ అధ్యక్షులు ఎన్.రఘువీరారెడ్డి పిలుపునిచ్చారు. విజయవాడ ఆంధ్రరత్న భవన్‌లో సోమవారం మహిళా కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షురాలు సుంకర పద్మశ్రీ ఆధ్వర్యంలో మహిళా కాంగ్రెస్ సమీక్షా సమావేశం నిర్వహించారు.
ఈ సమావేశానికి పీసీసీ అధ్యక్షులు ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీకి అధికారం కొత్త కాదని ప్రజా సమస్యలే ఎజెండాగా కాంగ్రెస్ పార్టీ పోరాటం చేయాలన్నారు. ముఖ్యంగా మహిళలు కష్టపడి పని చేయాలన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ క్రమేణా బలం పుంజుకుంటోందని పేర్కొన్నారు. మహిళా కాంగ్రెస్ కమిటీలకు చెందిన 200 మంది ప్రతినిధులకు త్వరలో ప్రత్యేకంగా సమావేశం నిర్వహించనున్నట్లు వెల్లడించారు.
2014 ఎన్నికల్లో బీజేపీ, టీడీపీ ప్రజలకు ఇచ్చిన హామీల వైఫల్యాలపై ప్రజల్లో వెళ్లేందుకు త్వరలో క్షేత్రస్థాయి పర్యటనకు కార్యాచరణ రూపొందించినట్లు మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సుంకర పద్మశ్రీ వెల్లడించారు. ఈ సమాశంలో పీసీసీ ప్రధాన కార్యదర్శులు గిడుగు రుద్రరాజు, టిజేఆర్ సుధాకర్ బాబు, ఎస్‌ఎన్‌రాజుతో పాటు రాష్ట్రంలోని 13 జిల్లాలకు చెందిన మహిళా ప్రతినిధులు హాజరయ్యారు.