సాక్షి, హైదరాబాద్: రాహుల్‌గాంధీని ప్రధానమంత్రిని చేసేందుకే ఆంధ్రప్రదేశ్ విభజనకు కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ సిద్ధపడ్డారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆక్షేపించారు. ‘కొడుకును ప్రధాని చేసేందుకు మా రాష్ట్రంలోని బిడ్డల జీవితాలతో, భవిష్యత్తుతో చెలగాటమాడటం ఎందుకు?’ అని సోనియాను ప్రశ్నించారు. కేవలం కుమారుడి కోసమే కాకుండా గుక్కెడు తాగునీటి కోసం రోడ్డెక్కుతున్న ఆంధ్రప్రదేశ్ బిడ్డల గురించి కూడా ఆలోచించాలని ఆమెకు సూచించారు. కేంద్రం నిరంకుశ విధానాలను నిరసిస్తూ, రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని కోరుతూ ‘సమైక్య దీక్ష’ పేరుతో శనివారం ఉదయం నుంచి ఆమరణ నిరాహార దీక్షకు జగన్ శ్రీకారం చుట్టారు. కార్యకర్తల కోలాహలం మధ్య ఉదయం 11.27 నిమిషాలకు దీక్షా శిబిరానికి చేరుకున్నారు.
తన క్యాంపు కార్యాలయం ఎదుట ఏర్పాటు చేసిన వేదికపై... ‘జై సమైక్యాంధ్ర...! వైఎస్సార్ అమర్ రహే...! జై జగన్! ’ నినాదాల మధ్య, అందరికీఅభివాదం చేస్తూ ఆమరణ నిరాహారƒ దీక్షకు కూర్చున్నారు. అంతకుముందు జగన్ తన నివాసంలో కుటుంబసభ్యులతో కలిసి ప్రత్యేక ప్రార్థనలు చేశారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని దేవు ణ్ని ప్రార్థించారు. జగన్ తల్లి, వైఎస్సార్‌సీపీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ ఆయన్ను ఆశీర్వదించారు. సతీమణి భారతి, ఇతర కుటుంబసభ్యులు ఇంటి వద్ద ఆయనకు వీడ్కోలు పలికారు. దీక్ష ప్రారంభించాక శిబిరం వద్ద జగన్ రాష్ట్ర, జాతీయ మీడియాతో మాట్లాడారు. ‘సోనియాగాంధీగారూ! మిమ్మల్ని ఒక్కటే అడుగుతున్నాం. మీ కుమారుడు రాహుల్‌గాంధీని ప్రధా ని చేసేందుకు మా రాష్ట్రాన్ని విభజిస్తూ నిర్ణయం తీసుకున్నారు కదా! మేమూ భారతదేశ పిల్లలమే! మా గురించి ఎందుకు ఆలోచించరు? గుక్కెడు తాగేనీటి కోసం రోడ్డెక్కుతున్న మా బిడ్డల గురించి ఎందుకు ఆలోచించరు?’’ అని ప్రశ్నించారు. ఓట్లు, సీట్ల కోసం తమ జీవితాలతో చెలగాటం ఆడొద్దన్నారు. సోనియాకే గాక బీజేపీ, టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబుతోపాటు విభజన కోరుతున్న వారందరికీ ఈ మేరకు విజ్ఞప్తి చేస్తున్నట్టు చెప్పారు. అసలు చంద్రబాబు దీక్ష ఎందుకు చేయాలనుకున్నారో చెప్పాలని జగన్ ప్రశ్నించారు. ‘ఈ విభజనను నేను వ్యతిరేకిస్తున్నాను, సమైక్యాంధ్రప్రదేశ్‌ను కొనసాగించండి’ అంటూ లేఖ రాసిన తర్వాతే దీక్షకు కూర్చోవాలని డిమాండ్ చేశారు. అప్పుడు తాను కూడా ముందుకొచ్చి బాబు దీక్షకు మద్దతిస్తానన్నారు. ‘వాళ్లేదో బుద్ధి లేక రాష్ట్రాన్ని విభజిస్తే మీరెందుకు మద్దతు పలుకుతున్నారు?’ అని ఈ సందర్భంగా చంద్రబాబును ప్రశ్నిస్తున్నానన్నారు.
మా జీవితాలను నాశనం చేయొద్దు...
‘అసెంబ్లీ తీర్మానం లేకుండా గతంలో ఏ రాష్ట్రాన్నీ విడదీయలేదు. అలా దేశ చరిత్రలోనే జరగలేదు. కానీ మన రాష్ర్టం విషయానికొచ్చేసరికి తీర్మానం లేకున్నా, ఆరు నెలల్లో ఎన్నికలున్నా అన్నీ పక్కనపెట్టి ఓట్లు, సీట్ల కోసం విడదీస్తామంటున్నారు. ఇదే సమయంలో బోడోలాండ్, గూర్ఖాలాండ్‌ల్లోనూ రాష్ట్ర విభజన ఆందోళనలు జరుగుతున్నాయి. విదర్భ ఏర్పాటు కోసం మహారాష్ట్ర అసెం బ్లీ తీర్మానం జరిగినా ఇప్పటికీ విభజన జరగలేదు. ఇవాళ దేశానికి చెందిన అందరినీ చేతులు జోడించి కోరుతున్నా. పార్లమెంటులో బీజేపీతో సహా అన్ని పార్టీల ఫ్లోర్ లీడర్ల నేతలనూ చేతులెత్తి కోరుతున్నా. ఒక్కసారి ఆలోచించండి. ఈ విభజన తీర్మానానికి పొరపాటునైనా మద్దతిస్తే తాగడానికి నీళ్లు కూడా లేక మా ప్రజలు అలమటించాల్సి వస్తుంది. నీటి సమస్య తాలుకు తీవ్రత కడప నుంచి వచ్చిన నాకు తెలుసు. విభజనకు ఒప్పుకుంటే రేప్పొద్దున ప్రతి పా ర్టీ ఓట్లు, సీట్ల కోసం దేశాన్ని ముక్కలు చేయాలని కోరే స్థితి వస్తుం ది. అందుకే ఒక్కసారి మా ప్రజల గురించి ఆలోచించండి. మా జీవితాలను నాశనం చేయవద్దని కోరుతున్నాం’ అని అన్నారు.
విడిపోతే పోలవరం పరిస్థితేమిటి?
రాష్ట్రం ఒక్కటిగా ఉంటేనే పోలవరం ప్రాజెక్టుకు పలు సమస్యలు ఎదురవుతున్నాయని జగన్ అన్నారు. ‘‘ఈ పరిస్థితుల్లో రాష్ట్రం విడిపోతే పోలవరం పరిస్థితేమిటి? ఆ ప్రాజెక్టుకు కావాల్సిన నీటి కోసం కొట్టుకునే పరిస్థితి రాదా? అనేది ఆలోచించాలి’’ అన్నారు. ‘‘కృష్ణా ఆయకట్టంటే కేవలం ఇటువైపున ఉన్న ఎనిమిదిన్నర జిల్లాలు మాత్రమే కాదు. రాయలసీమ, ప్రకాశం, నెల్లూరు, కృష్ణా, గుంటూరు, పశ్చిమగోదావరే కాదు. అటువైపు మహబూబ్‌నగర్, నల్గొండ, ఖమ్మం ఉన్నాయి. ఈ జిల్లాల్లోని ప్రజలు, రైతుల పరిస్థితేమిటి? ఇదా చేయాల్సిన పని? ఓట్ల కోసం, సీట్ల కోసం మా జీవితాలతో చెలగాటమాడటం ఎంతవరకు సబబు?’’ అని ప్రశ్నించారు. ‘‘రాష్ట్రం సమైక్యంగా ఉన్నప్పుడే కృష్ణా నది నీళ్లు మహారాష్ట్ర దాటుకుని కర్ణాటకలోని ఆలమట్టి, నారాయణపూర్ జలాశయాలను దాటుకుని రావాలి. అవి నిండిన తరవాతే కిందికి నీళ్లు వƒ దిలే పరిస్థితి ఉంది. అలాంటప్పుడు మధ్యలో ఇంకో రాష్ట్రం వస్తే శ్రీశైలం డ్యామ్ పరిస్థితేమిటి? నాగార్జునసాగర్‌కు నీళ్లెలా ఇస్తారు? ఇలాంటి అంశాల మీద మాటమాత్రం కూడా స్పష్టత ఇవ్వరు గానీ విభజన నిర్ణయం మాత్రం ప్రకటించారు. కేంద్ర మంత్రుల బృందం పలు అంశాలపై ఆరు వారాల్లో పరిష్కారం చూపుతుందట. వాళ్లు ఏం పరిష్కారం చూపుతారు? నీటి సమస్య ఇప్పటికే తీవ్రంగా ఉంది. ట్రిబ్యునళ్లు ఉన్నాయంటారేమో! నేను ఒక్క మాట అడగదల్చుకున్నా. నిజంగానే ట్రిబ్యునళ్లకు అంత పలుకుబడి ఉంటే ఇప్పటికీ నీటి వివాదాలు ఎందుకు తలెత్తుతున్నాయి? కర్ణాటకలో ఆలమట్టి, నారాయణపూర్ నిండితే తప్ప కిందకు నీళ్లు వదలని పరిస్థితెందుకు ఉంది? కావేరీ జలాల విషయంలో కర్ణాటక, తమిళనాడు ఇప్పటికీ ఏటా కొట్టుకునే పరిస్థితి ఎందుకొస్తుంది? ట్రిబ్యునళ్లు పేరుకు మాత్రమే ఉన్నాయి. అవసరం వచ్చినపుడు మాత్రం ట్రిబ్యునళ్లున్నాయంటూ నెపాన్ని వాటిపైకి నెట్టేస్తారు. కానీ నీటి కోసం రోజూ కొట్టుకునే పరిస్థితి, తన్నుకునే పరిస్థితి వస్తుంది’’ అని చెప్పారు.
హైదరాబాద్‌పై హక్కు లేదా?
హైదరాబాద్ పట్ల ప్రజల్లో ఉన్న అభిప్రాయంపై ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదని జగన్ అన్నారు. ‘చదువుకున్న ప్రతి ఒక్కరూ ఆ తర్వాత ఉపాధి కోసం హైదరాబాద్ నగరంవైపే చూ స్తారు. అలా నగరంలోకి వచ్చి బ్రతుకుతున్న వారి పరిస్థితేమిటి? పదేళ్లలో వెళ్లిపోవాలని చెపితే వారంతా ఎక్కడికి వెళ్తారు? ఎలా బ్రతుకుతారు? భవిష్యత్తు గురించి ఆలోచించుకుంటున్న వారి సంగతి ఏంటి? ఓట్ల కోసం, సీట్ల కోసం తీసుకున్న ఈ నిర్ణయం సరైనదేనా?’ అని ప్రశ్నించారు. ఎపుడైనా పరిష్కారమనేది అందరి కీ ఆమోదయోగ్యంగా ఉండాలన్నారు. ‘‘ఒక తండ్రికి ఇద్దరు కొడుకులు, లేదా కూతుళ్లుంటే ఇద్దరికీ న్యాయం జరిగేలా నిర్ణయం ఉండాలి. అందులో ఒకరు నాన్నా, నాకు అన్యాయం జరిగిందని చెప్పినప్పుడు తండ్రిగా దాన్ని సరిదిద్దగలగాలి. పరిష్కారం చూపలేనƒప్పుడు యథాతథంగా ఉంచాలి. ఒక ట్రస్టు ఏర్పాటు చేసి, ఉమ్మడి ఆస్తిని ఎవరూ అమ్మొద్దని చెప్పాలి. కలిసే ఉండండని ఆదేశించాలి. కానీ అదేమీ జరగడం లేదు’’ అంటూ జగన్ ఆవేదన వ్య క్తం చేశారు. సీమాంధ్ర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేల రాజీనామాలపై ఒక విలేకరి ప్రశ్నించగా, అది వారినే అడగండని సూచించారు.
ఆర్డినెన్‌సలాగే దీన్నెందుకు వెనక్కి తీసుకోరు?
కళంకిత ప్రజాప్రతినిధుల పదవీ భద్రత కోసం ఉద్దేశించిన ఆర్డినెన్‌సను కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ జోక్యంతో కేంద్రం వెనక్కి తీసుకున్న నేపథ్యంలో విభజనపై కేబినెట్ నోట్‌ను కూడా ఉపసంహరించేలా చొరవ తీసుకోవాలని రాహుల్‌ను కోరతారా? అని మరో విలేకరి జగన్‌ను ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వ ఆర్డినెన్‌సనే వెనక్కి తీసుకున్న వారు కేబినెట్ నోట్‌ను ఎందుకు వెనక్కు తీసుకోరని జగన్ అన్నారు. ‘‘ఆర్డినెన్‌సకు సాధ్యమైన నిర్ణయం కేబినెట్ నోట్‌కు సాధ్యం కాదా? అందుకే కేబినెట్ నోట్‌ను వెనక్కి తీసుకోవాలని కోరుతున్నాను’’ అని అన్నారు. మీడియా సైతం ఈ విషయంలో సహకరించాలని కోరారు. తెలంగాణ తీర్మానం అసెంబ్లీకి వచ్చినప్పుడు ఓడిద్దామని మంత్రులకు సీఎం కిరణ్ చెప్పడాన్ని మరో పాత్రికేయుడు ప్రస్తావించగా... ‘కేబినెట్ నోట్ కంటే ముందే అసెంబ్లీని సమావేశపరిచి, అందులో తెలంగాణ తీర్మానం ప్రవేశపెట్టి ప్రజల మనోభావాల ప్రకారం దాన్ని ఓడిస్తే దేశం మొత్తం ఈ అంశంపై దృష్టి సారించే ది కదా?’ అని జగన్ బదులిచ్చారు. ‘‘అసెంబ్లీ సమావేశాన్ని ఏర్పాటు చేసినా ప్రజల మనోభావాలకు అనుగుణంగా తీర్మానాన్ని శాసనసభ్యులు అడ్డుకున్నారనే భావన కలిగేది. అందుకే కేబినెట్ నోట్‌కు ముందే అసెం బ్లీని సమావేశపరచాలని మా పార్టీ కోరింది. నోట్ అనేది విభజన లో మొదటి ప్రక్రియ. అది జరిగిపోయింది. కాబట్టే దాని తర్వాత ఉండే మిగతా ప్రక్రియలూ జరుగుతాయని భయపడుతున్నాం. అందుకే ఇప్పటికైనా కలిసి రండని కోరుతున్నాం’’ అన్నారు.
కిరణ్ ముందే రాజీనామా చేయలేదేం?
కిరణ్ నిజంగా సమైక్య రాష్ట్రాన్ని కోరుకుని ఉంటే, ఆయనలో చిత్తశుద్ధి ఉంటే విభజనపై సీడబ్ల్యూసీ నిర్ణయం వెలువడగానే ఎందుకు రాజీనామా చేయలేదని జాతీయ మీడియాతో మాట్లాడుతూ జగన్ ప్రశ్నించారు. కిరణే గనక అప్పుడు రాజీనామా చేసి ఉంటే దేశమంతా ఆలోచించి ఉండేదని, విభజన ప్రక్రియ జరిగి ఉండేది కాదని అన్నారు. ‘ఈ విభజనను అడ్డుకోవాలని అన్ని పార్టీలనూ కోరుతున్నాను. ఆంధ్రప్రదేశ్‌లో విభజన జరిగినట్లు దేశంలోని మరే ప్రాంతంలోనూ భవిష్యత్‌లో జరగదని ఎలా చెప్పగలరు? ఇప్పుడు గనక మాతో గొంతు కలపకపోతే ఇదింతటితో ఆగిపోదు’’ అని అన్నారు. కాంగ్రెస్, బీజేపీ, ఎన్సీపీ నుంచి సీపీఐ వరకూ ఈ అడ్డగోలు విభజన పట్ల తమ వైఖరిని మార్చుకోవాలని జగన్ కోరారు. ‘‘రాష్ట్రంలో 65 శాతం మంది ప్రజలు 65 రోజులుగా ఆందోళన చేస్తూంటే, కేవలం రాహుల్‌ను ప్రధాని చేయడం కోసం సోనియా వ్యవహరించిన తీరు ఏ మాత్రం బాగా లేదు. అసెంబ్లీ తీర్మానాన్ని విస్మరించి మా మార్గంలో మేం పోతామంటే ఎలా? ప్రజాస్వామ్యంలో ఇలా చేయడం సరికాదు. బీజేపీ తీరు కూడా సరిగా లేదు. కేవలం 17 లోక్‌సభ సీట్ల కోసం ఇలా చేయడం సరికాదు’’ అన్నారు.
సుప్రీంకోర్టుకు వెళతాం...
ఇంత అడ్డగోలుగా రాష్ట్రాన్ని విభజించడాన్ని నిరసిస్తూ సుప్రీంకోర్టుకు వెళతామని జాతీయ మీడియా ప్రతినిధి అడిగిన ఓ ప్రశ్నకు జవాబుగా జగన్ చెప్పారు. ‘మేం కోర్టుకు వెళ్తాం. మా న్యాయవాదులు ఆ పని మీదే ఉన్నారు. ఈ తరహా అడ్డగోలు విభజనను నిరసిస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయిస్తాం’ అని వివరించారు.
దీక్షకు పోటెత్తిన మద్దతు
సాక్షి, హైదరాబాద్: జగన్ ఆమరణ నిరాహార దీక్షకు రాష్ట్రం నలుమూలల నుంచీ మద్దతు వెల్లువెత్తింది. శనివారం రాష్టమ్రంతటి నుంచీ, జంటనగరాల నుంచి వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు, జగన్ అభిమానులు భారీ సంఖ్యలో తరలి వచ్చి దీక్షకు సంఘీభావం తెలిపారు. ఉదయం 9 గంటల నుంచే జనం లోటస్‌పాండ్ సమీపంలో జగన్ క్యాంప్ కార్యాలయం వద్ద దీక్షా శిబిరానికి చేరుకోవడంతో పరిసరాలన్నీ కిటకిటలాడాయి. శనివారం రాత్రి పొద్దుపోయేదాకా వచ్చేపోయే వారితో ఇదే పరిస్థితి కొనసాగింది. తనకు మద్దతు ప్రకటించడానికి వచ్చిన వారందరినీ జగన్ నవ్వుతూ, అభివాదం చేస్తూ పలకరించారు. ఓవైపు సందర్శకులను పలకరిస్తూనే మధ్యాహ్నం శిబిరం నుంచే మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. దీక్షకు కారణాలు, రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాల్సిన ఆవశ్యకతను వివరించారు. కాంగ్రెస్ నిరంకుశ వైఖరి, విభజన విషయంలో ప్రధాన ప్రతిపక్షమైన టీడీపీ ద్వంద్వ ప్రమాణాలను ఎండగట్టారు. తెలుగు ప్రజలకు జరుగుతున్న ఈ అన్యాయాన్ని జాతీయ స్థాయిలో ఎలుగెత్తి చాటాలని ఈ సందర్భంగా మీడియాకు విజ్ఞప్తి చేశారు. వైఎస్సార్‌సీపీ ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి, ముఖ్య నేతలు జూపూడి ప్రభాకరరావు, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బాలినేని శ్రీనివాసరెడ్డి, వాసిరెడ్డి పద్మ, ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, దాడి వీరభద్రరావు, అంబటి రాంబాబు తదితరులు జగన్‌తో పాటు దీక్షా వేదికపై కూర్చున్నారు. ఎంపీ ఎస్పీవై రెడ్డి, ఎమ్మెల్యేలు భూమా శోభానాగిరెడ్డి, సి.ఆదినారాయణరెడ్డి, బి.జనక్‌ప్రసాద్, నల్లా సూర్యప్రకాశ్, మాజీ ఎమ్మెల్యేలు ఆళ్ల నాని, భూమా నాగిరెడ్డి, హెచ్.ఎ.రెహ్మాన్, మతీన్ ముజద్దాదీ, ఎం.ప్రసాదరాజు తదితర నేతలు శిబిరం వద్దకు వచ్చి దీక్షకు సంఘీభావం ప్రకటించారు.
శిబిరం వద్ద నినదించిన టీఆర్‌ఎస్ కార్యకర్తను పట్టుకున్న పోలీసులు.. వారించిన జగన్
వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆమరణ దీక్షా శిబిరం వద్ద టీఆర్‌ఎస్ కార్యకర్త ఒకరు తెలంగాణ నినాదం చేశారు. శనివారం సాయంత్రం ఆయన ముందుగా అందరితో పాటుగా జగన్ వద్దకు వెళ్లి కలిసి కరచాలనం చేసి కాసేపు మాట్లాడారు. అనంతరం కిందికొచ్చి జేబులోంచి టీఆర్‌ఎస్ కండువా తీసి మెడలో వేసుకొని ‘జై తెలంగాణ’ అంటూ నినదించారు. పోలీసులు ఆయనను వెంటనే అక్కడి నుంచి తరలిస్తుండగా జగన్ వారించారు. ‘పోలీసులు దయచేసి ఆ మిత్రుడిని ఏమీ అనవద్దు. అతను మనవాడే. ఇందాకే నా దగ్గరికి వచ్చి మాట్లాడాడు. తెలంగాణ వారు కూడా మనవారే. సమైక్యమంటే అన్ని ప్రాంతాల వారూ కలిసుండాలనే. పోలీసులూ! మీకు దయచేసి చెబుతున్నా అతడిని ఏమీ అనవద్దని. అతని పట్ల దురుసుగా ప్రవర్తించవద్దు. అతడిని ఇక్కడికి తీసుకు రండి’ అంటూ జగన్ మైకులో విజ్ఞప్తి చేశారు. పోలీసులు ఆయనను వాహనంలో ఎక్కించి తరలించారు.