ఉర్దూ వర్సిటీ ఏర్పాటుపై ప్రభుత్వం నిర్లక్ష్యం | cpm fighting for urdu university in kadapa | Sakshi
Sakshi News home page

ఉర్దూ వర్సిటీ ఏర్పాటుపై ప్రభుత్వం నిర్లక్ష్యం

Published Wed, Mar 18 2015 9:47 PM | Last Updated on Mon, Aug 13 2018 8:10 PM

ఉర్దూ వర్సిటీ ఏర్పాటుపై ప్రభుత్వం నిర్లక్ష్యం - Sakshi

ఉర్దూ వర్సిటీ ఏర్పాటుపై ప్రభుత్వం నిర్లక్ష్యం

  • సీపీఎం, పోలీసుల మధ్య తోపులాట

  • కడప : కడపలో ఉర్దూ యూనివర్శిటీ ఏర్పాటు విషయంలో రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న నిర్లక్ష్య ధోరణిని నిరసిస్తూ సీపీఎం కార్యకర్తలు బుధవారం కలెక్టరేట్ ఎదుట ముఖ్యమంత్రి చంద్రబాబు దిష్టిబొమ్మను దహనం చేసేందుకు ప్రయత్నించారు. ఆందోళనకారులు దిష్టిబొమ్మతో ప్రదర్శనగా వస్తుండగా పోలీసులు అడ్డుకున్నారు. ప్రజాస్వామ్య బద్దంగా నిరసన తెలియజేసే హక్కు తమకు ఉందని, దీన్ని అడ్డుకోవడానికి మీరెవరంటూ సీపీఎం నగర కార్యదర్శి ఎన్.రవిశంకర్‌రెడ్డి ప్రశ్నించారు. ఇవేవి పట్టని పోలీసులు దిష్టిబొమ్మను లాగేశారు. ఈ సందర్బంగా పోలీసులు, సీపీఎం కార్యకర్తల మధ్య తీవ్ర స్థాయిలో వాగ్వావాదం, తొపులాట చోటుచేసుకున్నాయి. ఆందోళనకారులను అదుపులోకి తీసుకోవడానికి పోలీసులు విఫలయత్నం చేశారు. సీపీఎం కార్యకర్తలు పోలీసుల వైఖరిని నిరసిస్తూ కలెక్టరేట్ ఎదుట బైఠాయింపు నిర్వహించారు.

    ఈ దశలో ప్రక్కనే నిరాహార దీక్షా శిబిరంలో ఉన్న కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు నజీర్ అహ్మద్, కార్యకర్తలు, వైఎస్ఆర్ సీపీ జిల్లా అధ్యక్షుడు ఆకేపాటి అమర్‌నాథరెడ్డి, మేయర్ సురేష్‌బాబు తదితరులు కూడా సీపీఎం కార్యకర్తలతో జత కలిశారు. ఈ సందర్బంగా సీపీఎం నగర కార్యదర్శి రవిశంకర్‌రెడ్డి మాట్లాడుతూ కడపలో ఉర్దూ వర్శిటీని ఏర్పాటు చేస్తామని అసెంబ్లీలో ప్రకటించిన చంద్రబాబు నేడు మాట మార్చారని విమర్శించారు. కడపజిల్లాలో తమ పార్టీకి సీట్లు రాలేదని సీఎం కక్షగట్టారని ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి 11 జాతీయ స్థాయి సంస్థలను మంజూరు చేయగా, అందులో ఒక్కటి కూడా కడపకు ఇవ్వకపోవడం అన్యాయమని ధ్వజమెత్తారు. ఉక్కు ఫ్యాక్టరీ ఊసే ఎత్తడం లేదని, జిల్లాలో ఏర్పాటు చేసేందుకు ముందుకు వచ్చిన డీఆర్‌డీఓ పరిశోధనా కేంద్రాన్ని కూడా ఇతర జిల్లాలకు మళ్లించి అన్యాయం చేశారన్నారు. ఇప్పుడు ఉర్దూ యూనివర్శిటీ విషయంలో కూడా ప్రభుత్వం ఇదే ధోరణి అవలంభిస్తోందని చెప్పారు.

    వర్శిటీ సాధన కోసం గత 16 రోజులుగా యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో దీక్షలు నిర్వహిస్తున్నప్పటికీ ప్రభుత్వానికి చీమకుట్టినట్టయినా లేదన్నారు. ఈ దశలో ప్రజాస్వామ్య బద్దంగా నిరసన తెలియజేసేందుకు ప్రయత్నించినా పోలీసులతో అడ్డుకోవడం దారుణమని దుయ్యబట్టారు. అనంతరం నాయకులు యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో నడుస్తున్న దీక్షా శిబిరంలోకి వెళ్లారు. వైఎస్ఆర్ సీపీ జిల్లా అధ్యక్షుడు ఆకేపాటి అమర్‌నాథరెడ్డి, మేయర్ కె.సురేష్‌బాబులు మాట్లాడుతూ జిల్లా వాసులు ఎవరూ అడగకపోయినప్పటికీ ఉర్దూ వర్శిటీని ఏర్పాటు చేస్తానంటూ ముఖ్యమంత్రి స్వయంగా అసెంబ్లీలో ప్రకటించారని పేర్కొన్నారు. ఇప్పుడేమో మాటమార్చి కర్నూలు, గుంటూరు అంటూ రోజుకోమాట చెప్పడం దారుణమన్నారు. రాయలసీమ, నెల్లూరు, ఒంగోలు జిల్లాలకు కేంద్రం కడప ఉందని చెప్పారు. అలాగే ముస్లిం జనాభా కూడా కడపలోనే అధికంగా ఉందన్నారు. అన్ని అనుకూలతలు ఉన్న కడపలోనే ఉర్దూ వర్శిటీని ఏర్పాటు చేయాలని వారు డిమాండ్ చేశారు. ఒకవేళ కర్నూలు, గుంటూరులలో కూడా యూనివర్శిటీని నెలకొల్పినా తమకు అభ్యంతరం లేదని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ ఆరీఫుల్లా, వైఎస్సార్‌సీపీ నాయకులు రాజశేఖర్‌రెడ్డి, షఫీ, కాంగ్రెస్ నాయకులు సత్తార్, సీపీఎం నాయకుడు సిద్దిరామయ్య, శంకర్, యాక్షన్ కమిటీ చైర్మన్ సలావుద్దీన్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement