కర్నూలు జిల్లా పరిషత్/ కోడుమూరు/ గూడూరు: జిల్లా వ్యాప్తంగా ప్రతి గ్రామంలో తాగునీరు సరఫరా అయ్యేచోట పైపులైన్లకు మీటర్లు ఏర్పాటు చేసి, దాని ప్రకారం విద్యుత్ ఛార్జీలు వసూలు చేయాలని జిల్లా అధికారులను పంచాయతీరాజ్‌శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ జవహర్‌రెడ్డి ఆదేశించారు. శనివారం స్థానిక ప్రభుత్వ అతిథిగృహంలో పంచాయతీరాజ్‌శాఖ ఆధ్వర్యంలో అమలయ్యే వివిధ పథకాలు, పనులపై ఆయన సమీక్ష నిర్వహించారు. స్వచ్ఛభారత్‌లో భాగంగా ప్రతి మండలంలో మూడు గ్రామ పంచాయతీలను పెలైట్ ప్రాజెక్టుగా తీసుకుని, వాటిలో వందశాతం వ్యక్తగత మరుగుదొడ్లు నిర్మాణం జరిగేలా చర్యలు తీసుకోవాలన్నారు.
సీపీడబ్ల్యు స్కీమ్స్‌కు కొత్త మీటర్లు ఏర్పాటు చేయాలని, పంచాయతీ సెక్రటరీ పోస్టులు, ఆఫీసు సబార్డినేట్ పోస్టులు భర్తీ చేయాలని ప్రిన్సిపల్ సెక్రటరీని ఆర్‌డబ్లూఎస్ అధికారులు కోరారు. కలెక్టర్ సీహెచ్ విజయమోహన్ మాట్లాడుతూ జిల్లాలో వేసవిని దృష్టిలో ఉంచుకుని ఎక్కడ కూడా తాగునీటి సమస్య ఎదురుగాకుండా అన్ని రకాల చర్యలు చేపట్టామన్నారు. సమావేశంలో డీపీవో శోభాస్వరూపరాణి, పంచాయతీరాజ్ ఎస్‌ఈ సురేంద్రనాథ్, ఎంపీడీవోలు, పంచాయతీరాజ్, ఆర్‌డబ్ల్యుఎస్ ఈఈలు, డీఈలు, డివిజన్ పంచాయతీ అధికారులు పాల్గొన్నారు.
గ్రామాల అభివృద్ధికి
అందరి సహకారం అవసరం
గ్రామాల అభివృద్ధికి అందరూ సహకరించాలని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరి జవహర్‌రెడ్డి అన్నారు. శనివారం పీఆర్, ఆర్‌డబ్ల్యుఎస్ పనుల తనిఖీ నిమిత్తం కోడుమూరు, గోనెగండ్ల మండలాలను ఆయన సందర్శించారు. ముందుగా కోడుమూరు మండలంలోని అనుగొండ గ్రామంలో ప్రధాన మంత్రి సడక్‌యోజన పథకం కింద కె. నాగులాపురం నుంచి అనుగొండ వరకు నిర్మాణంలో ఉన్న రోడ్డు పనులను తనిఖీ చేశారు. అలాగే వర్కూరు గ్రామంలో నిర్మాణంలో ఉన్న వ్యక్తిగత మరుగుదొడ్లను పరిశీలించారు.
గోనెగండ్ల మండలం వేముగోడు గ్రామాలను సందర్శించి ఏర్పాటు చేసిన సభలో గ్రామస్తులతో ముఖాముఖి మాట్లాడారు. ఏవైనా ఇబ్బం దులు ఉంటే కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించుకోవాలని చెప్పారు. కలెక్టర్ విజయమోహన్ మాట్లాడుతూ.. రోడ్ల సమస్యలపై గ్రామస్తులతో తెలుసుకుని పరిష్కార చర్యలు చేపడతామన్నారు. పంచాయతీరాజ్, ఆర్‌డబ్ల్యుఎస్ శాఖలు ప్రతిరోజూ నీటి ట్యాంకుల్లో బ్లీచింగ్ జరిగే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. ప్రతి గ్రామ పంచాయతీ కార్యాలయంలో అధికారుల ఫోన్ నంబర్లను ఏర్పాటు చేయాలని, అవసరాన్ని బట్టి ప్రజలు వారితో మాట్లాడేందుకు వీలుంటుం దని సూచించారు. గ్రామంలో ఎలాంటి సమస్యలు రాకుండా అన్ని చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.
కమిటీ సంతకాలు అవసరం లేదు..నివేదికలు పంపండి
పింఛన్ల మంజూరుకు జన్మభూమి కమిటీ సభ్యులు సంతకాలు పెట్టకుండా వేధిస్తుంటే నివేదికలు నేరుగా పంపాలని కలెక్టర్ సి.హెచ్. విజయ్‌మోహన్ ఎంపీడీవో సువర్ణలతను ఆదేశించారు. శనివారం వర్కూరు గ్రామాన్ని పీఆర్ ప్రిన్సిపల్ సెక్రటరీ జవహర్‌రెడ్డి సందర్శించిన సందర్భంగా వృద్ధులు, వికలాంగుల పెన్షన్లు తొలగించారని కలెక్టర్ ముందు తమ గోడును వెల్లబోసుకున్నారు.
ఈ విషయంపై స్పందించిన కలెక్టర్ ఎంపీడీవోను వివరాలు అడిగారు. తొలగిపోయిన 40 పింఛన్లు పునురుద్ధరించాలని ప్రభుత్వం నుంచి ఆదేశాలు వచ్చాయని, అయితే జన్మభూమి కమిటీ సభ్యులు సంతకం పెట్టడంలేదని ఎంపీడీవో కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. ఈ విషయంపై కలెక్టర్ మాట్లాడుతూ జన్మభూమి కమిటీ సభ్యుల సంతకాలు లేకపోయిన నేరుగా నివేదికలు పంపితే పింఛన్లు మంజూరు చేస్తానని హామీ ఇచ్చారు.
తాగునీటి పైపులైన్లకు మీటర్ల ఏర్పాటు
Published Sun, Apr 19 2015 3:25 AM | Last Updated on Wed, Sep 5 2018 3:44 PM
Advertisement