prinicipal secretary
-
తాగునీటి పైపులైన్లకు మీటర్ల ఏర్పాటు
కర్నూలు జిల్లా పరిషత్/ కోడుమూరు/ గూడూరు: జిల్లా వ్యాప్తంగా ప్రతి గ్రామంలో తాగునీరు సరఫరా అయ్యేచోట పైపులైన్లకు మీటర్లు ఏర్పాటు చేసి, దాని ప్రకారం విద్యుత్ ఛార్జీలు వసూలు చేయాలని జిల్లా అధికారులను పంచాయతీరాజ్‌శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ జవహర్‌రెడ్డి ఆదేశించారు. శనివారం స్థానిక ప్రభుత్వ అతిథిగృహంలో పంచాయతీరాజ్‌శాఖ ఆధ్వర్యంలో అమలయ్యే వివిధ పథకాలు, పనులపై ఆయన సమీక్ష నిర్వహించారు. స్వచ్ఛభారత్‌లో భాగంగా ప్రతి మండలంలో మూడు గ్రామ పంచాయతీలను పెలైట్ ప్రాజెక్టుగా తీసుకుని, వాటిలో వందశాతం వ్యక్తగత మరుగుదొడ్లు నిర్మాణం జరిగేలా చర్యలు తీసుకోవాలన్నారు. సీపీడబ్ల్యు స్కీమ్స్‌కు కొత్త మీటర్లు ఏర్పాటు చేయాలని, పంచాయతీ సెక్రటరీ పోస్టులు, ఆఫీసు సబార్డినేట్ పోస్టులు భర్తీ చేయాలని ప్రిన్సిపల్ సెక్రటరీని ఆర్‌డబ్లూఎస్ అధికారులు కోరారు. కలెక్టర్ సీహెచ్ విజయమోహన్ మాట్లాడుతూ జిల్లాలో వేసవిని దృష్టిలో ఉంచుకుని ఎక్కడ కూడా తాగునీటి సమస్య ఎదురుగాకుండా అన్ని రకాల చర్యలు చేపట్టామన్నారు. సమావేశంలో డీపీవో శోభాస్వరూపరాణి, పంచాయతీరాజ్ ఎస్ఈ సురేంద్రనాథ్, ఎంపీడీవోలు, పంచాయతీరాజ్, ఆర్‌డబ్ల్యుఎస్ ఈఈలు, డీఈలు, డివిజన్ పంచాయతీ అధికారులు పాల్గొన్నారు. గ్రామాల అభివృద్ధికి అందరి సహకారం అవసరం గ్రామాల అభివృద్ధికి అందరూ సహకరించాలని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరి జవహర్‌రెడ్డి అన్నారు. శనివారం పీఆర్, ఆర్‌డబ్ల్యుఎస్ పనుల తనిఖీ నిమిత్తం కోడుమూరు, గోనెగండ్ల మండలాలను ఆయన సందర్శించారు. ముందుగా కోడుమూరు మండలంలోని అనుగొండ గ్రామంలో ప్రధాన మంత్రి సడక్యోజన పథకం కింద కె. నాగులాపురం నుంచి అనుగొండ వరకు నిర్మాణంలో ఉన్న రోడ్డు పనులను తనిఖీ చేశారు. అలాగే వర్కూరు గ్రామంలో నిర్మాణంలో ఉన్న వ్యక్తిగత మరుగుదొడ్లను పరిశీలించారు. గోనెగండ్ల మండలం వేముగోడు గ్రామాలను సందర్శించి ఏర్పాటు చేసిన సభలో గ్రామస్తులతో ముఖాముఖి మాట్లాడారు. ఏవైనా ఇబ్బం దులు ఉంటే కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించుకోవాలని చెప్పారు. కలెక్టర్ విజయమోహన్ మాట్లాడుతూ.. రోడ్ల సమస్యలపై గ్రామస్తులతో తెలుసుకుని పరిష్కార చర్యలు చేపడతామన్నారు. పంచాయతీరాజ్, ఆర్‌డబ్ల్యుఎస్ శాఖలు ప్రతిరోజూ నీటి ట్యాంకుల్లో బ్లీచింగ్ జరిగే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. ప్రతి గ్రామ పంచాయతీ కార్యాలయంలో అధికారుల ఫోన్ నంబర్లను ఏర్పాటు చేయాలని, అవసరాన్ని బట్టి ప్రజలు వారితో మాట్లాడేందుకు వీలుంటుం దని సూచించారు. గ్రామంలో ఎలాంటి సమస్యలు రాకుండా అన్ని చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. కమిటీ సంతకాలు అవసరం లేదు..నివేదికలు పంపండి పింఛన్ల మంజూరుకు జన్మభూమి కమిటీ సభ్యులు సంతకాలు పెట్టకుండా వేధిస్తుంటే నివేదికలు నేరుగా పంపాలని కలెక్టర్ సి.హెచ్. విజయ్‌మోహన్ ఎంపీడీవో సువర్ణలతను ఆదేశించారు. శనివారం వర్కూరు గ్రామాన్ని పీఆర్ ప్రిన్సిపల్ సెక్రటరీ జవహర్‌రెడ్డి సందర్శించిన సందర్భంగా వృద్ధులు, వికలాంగుల పెన్షన్లు తొలగించారని కలెక్టర్ ముందు తమ గోడును వెల్లబోసుకున్నారు. ఈ విషయంపై స్పందించిన కలెక్టర్ ఎంపీడీవోను వివరాలు అడిగారు. తొలగిపోయిన 40 పింఛన్లు పునురుద్ధరించాలని ప్రభుత్వం నుంచి ఆదేశాలు వచ్చాయని, అయితే జన్మభూమి కమిటీ సభ్యులు సంతకం పెట్టడంలేదని ఎంపీడీవో కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. ఈ విషయంపై కలెక్టర్ మాట్లాడుతూ జన్మభూమి కమిటీ సభ్యుల సంతకాలు లేకపోయిన నేరుగా నివేదికలు పంపితే పింఛన్లు మంజూరు చేస్తానని హామీ ఇచ్చారు. -
కోదండరామాలయ ప్రగతికి మాస్టర్ ప్లాన్
ఒంటిమిట్ట: గత కొంత కాలంగా మండల ప్రజలు కోరుకుంటున్న అధికారిక బ్రహ్మోత్సవాల శోభ శుక్రవారం ఒంటిమిట్టను తాకింది. స్థానిక కోదండరామాలయాన్ని రాష్ట్ర దేవాదాయ శాఖ ప్రిన్పిపల్ సెక్రటరీ ఏవీఎస్ ప్రసాద్, ప్రభుత్వ విప్ మేడా మల్లికార్జునరెడ్డి, కలెక్టర్ కేవీ రమణ శుక్రవారం పరిశీలించారు. వీరు ముందుగా కోదండరామున్ని దర్శించుకున్నారు. వీరి రాక సందర్భంగా పూర్ణకుంభంతో ఘనంగా స్వాగతం పలికారు. కోదండరామాలయానికి అధికారిక హోదా తీసుకొస్తున్న అధికారులు, ప్రజాప్రతినిధులకు స్థానిక భక్తులు, నాయకులు, ప్రజలు పూలతో స్వాగతం పలికారు. అనంతరం కోదండరామాలయ పరిసర ప్రాంతాలను, ఆలయానికి సంబంధించిన భూములను ప్రిన్సిపాల్ సెక్రటరీ పరిశీలించారు. ప్రిన్సిపాల్ సెక్రటరీ, ప్రభుత్వ మేడా విలేకరులతో మాట్లాడుతూ ప్రాచీన ఆలయమైన ఒంటిమిట్ట కోదండరామాలయంలో ఎలాంటి నూతన కట్టడాలకు తావులేదన్నారు. ఆలయ స్థితిని యధావిధిగానే కొనసాగించాలన్నారు. దేవాలయంలో ఒక పద్ధతి ప్రకారం పూజలు నిర్వహించాలని సూచించారు. ఆలయానికి ఇచ్చే కానుకలను నగదు రూపంలో అందించాలని తెలియచేశారు. ఆలయంలో దాతల పేర్ల వివరాలతో బోర్డులు ఏర్పాటు చేయకూడదని సూచించారు. ఆలయ పరిసర ప్రాంతాల్లో కట్టే కట్టడాలను ఎక్కడికక్కడ ఆపాలని సూచించారు. మాస్టర్ ప్లాన్ ద్వారా ఒంటిమిట్ట కోదండరామాలయం అభివృద్ధి జరుగుతుందన్నారు. ఆలయంలో పాడుబడ్డ శిల్పాలను మద్రాసులోని ప్రత్యేక శిక్షణ పొందిన బృందాలచే మరమ్మతులు చేయిస్తామన్నారు. ఘనంగా బ్రహ్మోత్సవాల ఏర్పాట్లు నూతన రాష్ట్రం ఏర్పడిన తరువాత ఆంధ్రప్రదేశ్‌లో జరిగే బ్రహ్మోత్సవాలు ఒంటిమిట్ట కోదండరామాలయంలో ఘనంగా నిర్వహించనున్నట్లు రాష్ట్ర దేవదాయ శాఖ రెవెన్యూ, ఎండోమెంట్ ప్రిన్పిపల్ ఏవీఎస్ ప్రసాద్ తెలిపారు. ఇందు కోసం ఒంటిమిట్ట కోదండరామాలయంలో ఘనంగా ఏర్పాట్లు చేయనున్నట్లు ఆయన తెలిపారు. ఇందుకు సంబంధించి అధికారులు, ప్రజలతో ఆయన చర్చించారు. ఒంటిమిట్ట కోదండరామాలయం రాబోయే కాలంలో ఒక గొప్ప క్షేత్రంగా తీర్చిదిద్దుతామని తెలిపారు. పర్యాటకరంగంపై ప్రత్యేక దృష్టి ముఖ్యంగా మండలంలో పర్యాటక రంగంపై ప్రత్యేక దృష్టి పెట్టనున్నట్లు ప్రిన్సిపాల్ సెక్రటరీ వె ల్లడించారు. కోదండరామాలయానికి ఆనుకుని ఉన్న ఒంటిమిట్ట చెరువుకు నీరు తెప్పించడం వలన ఒంటిమిట్టలో పర్యాటక రంగం అభివృద్ధి చెందుతుందన్నారు. కోదండరామాలయానికి వచ్చే యాత్రికులకు ప్రత్యేక వసతి కల్పించడం ద్వారా పర్యాటక రంగం ఎంతగానో అభివృద్ధి చెందుతుందన్నారు. మండల పరిసర ప్రాంతాల్లో పెద్ద ఎత్తున మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టాలని సూచించారు. ఒంటిమిట్ట మండలంతో పాటు జిల్లాను మంచి పర్యాటక కేంద్రంగా అభివృద్ధిలోకి తీసుకురానున్నట్లు తెలిపారు. భావి తరాలపై పురాతన ఆలయాల చరిత్ర తెలుసుకునే విధంగా ఆలయాలను యధాస్థితిలో కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. నూతనంగా ఏర్పాటు చేసిన భవనాలను, ఆలయసమీపంలోని హరితా రెస్టారెంట్‌ను, కోదండరామాలయ భూములను, రామలక్ష్మణ తీర్థాలను పరిశీలించారు. వచ్చే భక్తుల వాహనాల పార్కింగ్, వీఐపీలకు ఏర్పాట్లు, భక్తుల ఏర్పాట్లపై చర్చించారు. వీటిని యుద్ధప్రాతిపదికన పూర్తి చేస్తామన్నారు. స్థానిక ప్రజలు, భక్తులసహకారంతో అంగరంగ వైభవంగా ఒంటిమిట్ట కోదండరాముని బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తామన్నారు. జిల్లాలోని వివిధ శాఖల అధికారులు, మండల అధికారులు, నాయకులు, భక్తులు, ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. -
‘బల్దియా’ అక్రమాలపై సర్కార్ సీరియస్
కోల్‌సిటీ : రామగుండం నగరపాలక సంస్థ కార్యాలయంలో చోటుచేసుకున్న అక్రమాలపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టిసారించింది. ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆ న లుగురు అధికారులు 15 రోజుల్లోగా వివరణ ఇవ్వాలని ప్రిన్సిపల్ సెక్రటరీ డాక్టర్ ఎస్కే.జోషి ఆదేశించారు. బుధవారం 207, 208, 209, 210 నంబర్లతో ప్రిన్సిపల్ సెక్రటరీ వేర్వేరుగా నాలుగు జీవోలు జారీ చేశారు. ఈఈగా పనిచేసిన ఎ.శివ కుమార్, డీఈగా పనిచేసిన ఎ.లక్ష్మీనారాయణ, ఏఈగా పనిచేసిన టి.ప్రభువర్ధన్‌రెడ్డి, జూనియర్ అసిస్టెంట్‌గా పనిచేసిన సాంబశివరావు ప్రభుత్వ నిబంధనలు, రూల్స్ అతిక్రమించినట్లు ఫిర్యాదులు వచ్చాయని పేర్కొన్నారు. అయితే ఎలాంటి అక్రమాలకు పాల్పడ్డారనే వివరాలు మాత్రం ఈ నాలుగు జీవోల్లో ఎక్కడా పేర్కొనలేదు. అయితే కార్పొరేషన్లో చోటు చేసుకున్న కులాయి కనెక్షన్ల కుంభకోణంలో పలువురు అధికారులపై ఆరోపణలు వచ్చాయి. నిరుపేదలకు రూ.200కు సబ్సిడీపై మంజూరు చేయియాల్సిన కులాయిలను, ధనవంతులకు మంజూరు చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. గులాబీ రంగు రేషన్‌కార్డులను, తెల్ల రేషన్కార్డులుగా కంప్యూటర్లలో మార్పులు చేసి అక్రమాలకు పాల్పడిన వారికి... అధికారులు అండగా నిలిచారని ఆరోపణలు వచ్చాయి. ఈ అక్రమంతోపాటు అనేక అక్రమాలకు పాల్పడినట్లు నలుగురు అధికారులపై అప్పటి ప్రభుత్వానికి అనేక ఫిర్యాదులు వెళ్ళాయని సమాచారం. 2012 ఆగస్టు 18న కూడా అప్పటి ఏపీ ప్రభుత్వం జీవో నంబర్ 1106 జారీ చేసింది. ఇదే జీవోను అనుసరించి తెలంగాణ ప్రభుత్వం ఈ నలుగురు అధికారుల నుంచి వివరణ కోరుతూ నాలుగు జీవోలను విడుదల చేసింది. అయితే ఈ నలుగురు అధికారుల్లో ప్రస్తుతం సాంబశివరావు రిటైర్డ్ అయ్యాడు. మిగిలిన ముగ్గురు అధికారులు వేర్వేరు మున్సిపాలిటీల్లో పని చేస్తున్నారు. -
పుర‘పోరు’ లేనట్లే!
పాలమూరు, న్యూస్‌లైన్: మునిసిపల్ ఎన్నికల నిర్వహణపై అయోమయం వీడటం లేదు. వార్డుల విభజన జరిగి.. ఇక చైర్మన్ రిజర్వేషన్లు వెలువడనున్న సమయంలో ఎన్నికల ప్రక్రియకు ఒ క్కసారిగా బ్రేక్ పడింది. దీంతో మరో ఆర్నెళ్లపాటు ‘ప్రత్యేక’ పా లన కొనసాగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. మూడేళ్ల క్రితమే మునిసిపాలిటీల పాలకవర్గ పదవీకాలం ముగిసింది. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఎన్నికల నిర్వహణపై దృష్టిసారించకపోగా.. ప్రత్యేకాధికారుల పాలన కొనసాగించింది. ఇప్పుడు మరోఆర్నె ళ్ల పాటు ప్రత్యేకపాలన కొనసాగించాలని నిర్ణయించింది. దీం తో మునిసిపల్ ఎన్నికల్లో పోటీచేయాలని ఊవ్విళ్లూరిన ఆశావహుల ఆశలపై నీళ్లు చల్లినట్లయింది. అలాగే రాజకీయ పార్టీల్లోనూ స్తబ్ధత నెలకొంది. మునిసిపాలిటీల పరిధిలో ప్రత్యేకాధికారుల పాలన గడువు ఈనెల 29న పూర్తయింది. మునిసిపల్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ఆధార్ సిన్హా మరో ఆర్నెళ్లపాటు ప్రత్యేకపాలన పొడిగిస్తూ జీఓ నెం.426ను విడుదల చేశారు. పురపాలక సంఘాల పదవీకాలం 2010 సెప్టెంబర్ 29న ముగియగా.. 30 నుంచి ప్రత్యేకపాలన ఆరంభమైంది. ప్రస్తుతం రాష్ట్ర విభజనపై కేంద్రప్రభుత్వం, సీడబ్ల్యూసీ నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో ఎన్నికలు వెనక్కివెళ్లాయి. ఇదిలాఉండగా స్థానిక సంస్థలకు ఎన్నికలు నిర్వహించాలని న్యాయస్థానం ఆదేశించడంతో ప్రభుత్వం గత జూన్‌లో సర్పంచ్ ఎన్నికలను నిర్వహించింది. ఆ తరువాత మునిసిపల్ ఎన్నికలను సెప్టెంబర్‌లో నిర్వహించాలని నిర్ణయించింది. ఇందులో భాగంగానే బీసీ, ఎస్సీ, ఎస్టీ ఓటర్ల గణన కూడా నిర్వహించారు. పోలింగ్‌స్టేషన్ గుర్తింపు ప్రక్రియను కూడా పూర్తిచేశారు. ఉన్నట్టుండి కేంద్ర ప్రభుత్వం తెలంగాణపై నిర్ణయం ప్రకటించడం.. సీమాంధ్రలో సమైక్య ఉద్యమం నేపథ్యంలో ఎన్నికల నిర్వహణపై ప్రభుత్వం వెనుకంజ వేసింది. దీంతో మునిసిపల్ ప్రత్యేకాధికారుల పాలనను మరో ఆర్నెళ్లు పొడిగిస్తూ ఉత్తర్వులు రావడంతో సర్వత్రా నిరాశ వ్యక్తమవుతోంది. రాష్టవిభజన నేపథ్యంలో ఆయా పార్టీల తరఫున మునిసిపల్ ఎన్నికల్లో చైర్మన్‌గిరీ కోసం లాబీయింగ్ జరుపుదామనుకుంటున్న ఆశావహులు ఎన్నికల నిర్వహణ ఎప్పుడో తెలియక తమ పార్టీ అధినేతలతో కలిసేందుకు వెనుకంజవేస్తున్నారు. నిధుల కొరత కాగా, మునిసిపల్ కౌన్సిల్ ఉంటేనే కేంద్ర ప్రభుత్వం నిధులు మంజూరుచేస్తోంది. మూడేళ్లుగా కౌన్సిల్ లేని కారణంగా ఏటా మునిసిపాలిటీలకు వచ్చే 13వ ఆర్థిక సంఘం నిధులు పూర్తిగా నిలిచిపోయాయి. ఇవి మహబూబ్‌నగర్ మునిసిపాలిటీకి అయితే ఏటా రూ.మూడు కోట్ల నుంచి రూ.ఆరుకోట్ల వరకు వస్తాయి. ఇతర మునిసిపాలిటీలకైతే రూ.రెండు కోట్ల నుంచి రూ.నాలుగు కోట్ల వరకు నిధులు మంజూరవుతాయి. వీటిని పారిశుధ్యం, తాగునీటి సమస్య తీర్చడం, ఇతర అభివృద్ధి పనులకు వినియోగిస్తారు. కౌన్సిల్ హయాంలో డ్రైనేజీలు, రోడ్ల కోసం మంజూరయ్యే ప్రత్యేకనిధులు ఇప్పుడు జాడేలేవు. దీంతో ప్రత్యేకాధికారుల పాలనలో ఎక్కడి పనులు అక్కడే తిష్టవేశాయి. డ్రైనేజీ, రోడ్లు, పారిశుధ్య పనులు లోపించడంతో మునిసిపాలిటీల పరిస్థితి అధ్వానంగా మారింది. సమస్యలను పరిష్కరించేందుకు ప్రత్యేకాధికారులు కూడా తగినచొరవ చూపకపోవడంతో సమస్యలు రోజురోజుకూ పెరుకుపోతున్నాయి. ‘ప్రత్యేక’ అధికారులు వీరే.. మహబూబ్‌నగర్ మునిపిపాలిటీకి కలెక్టర్ ఎం.గిరిజాశంకర్ ప్రత్యేక అధికారిగా వ్యవహరిస్తారు. షాద్‌నగర్, కల్వకుర్తి, జడ్చర్లలకు మహబూబ్‌నగర్ ఆర్డీఓ హన్మంత్‌రావు, నాగర్‌కర్నూల్, అచ్చంపేట, కొల్లాపూర్‌లకు నాగర్ కర్నూల్ ఆర్డీఓ కీన్యానాయక్, గద్వాల, అయిజ మునిసిపాలిటీలకు గద్వాల ఆర్డీఓ నారాయణరెడ్డి, వనపర్తి మునిసిపాలిటీకి ఆర్డీఓ వెంకటేశ్వర్లు, నారాయణపేటకు ఆర్డీఓ యాస్మిన్‌బాష ప్రత్యేకాధికారులుగా వ్యవహరిస్తున్నారు.