పాలమూరు, న్యూస్‌లైన్: మునిసిపల్ ఎన్నికల నిర్వహణపై అయోమయం వీడటం లేదు. వార్డుల విభజన జరిగి.. ఇక చైర్మన్ రిజర్వేషన్లు వెలువడనున్న సమయంలో ఎన్నికల ప్రక్రియకు ఒ క్కసారిగా బ్రేక్ పడింది. దీంతో మరో ఆర్నెళ్లపాటు ‘ప్రత్యేక’ పా లన కొనసాగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. మూడేళ్ల క్రితమే మునిసిపాలిటీల పాలకవర్గ పదవీకాలం ముగిసింది. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఎన్నికల నిర్వహణపై దృష్టిసారించకపోగా.. ప్రత్యేకాధికారుల పాలన కొనసాగించింది. ఇప్పుడు మరోఆర్నె ళ్ల పాటు ప్రత్యేకపాలన కొనసాగించాలని నిర్ణయించింది. దీం తో మునిసిపల్ ఎన్నికల్లో పోటీచేయాలని ఊవ్విళ్లూరిన ఆశావహుల ఆశలపై నీళ్లు చల్లినట్లయింది. అలాగే రాజకీయ పార్టీల్లోనూ స్తబ్ధత నెలకొంది.
మునిసిపాలిటీల పరిధిలో ప్రత్యేకాధికారుల పాలన గడువు ఈనెల 29న పూర్తయింది. మునిసిపల్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ఆధార్ సిన్హా మరో ఆర్నెళ్లపాటు ప్రత్యేకపాలన పొడిగిస్తూ జీఓ నెం.426ను విడుదల చేశారు. పురపాలక సంఘాల పదవీకాలం 2010 సెప్టెంబర్ 29న ముగియగా.. 30 నుంచి ప్రత్యేకపాలన ఆరంభమైంది. ప్రస్తుతం రాష్ట్ర విభజనపై కేంద్రప్రభుత్వం, సీడబ్ల్యూసీ నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో ఎన్నికలు వెనక్కివెళ్లాయి. ఇదిలాఉండగా స్థానిక సంస్థలకు ఎన్నికలు నిర్వహించాలని న్యాయస్థానం ఆదేశించడంతో ప్రభుత్వం గత జూన్‌లో సర్పంచ్ ఎన్నికలను నిర్వహించింది. ఆ తరువాత మునిసిపల్ ఎన్నికలను సెప్టెంబర్‌లో నిర్వహించాలని నిర్ణయించింది. ఇందులో భాగంగానే బీసీ, ఎస్సీ, ఎస్టీ ఓటర్ల గణన కూడా నిర్వహించారు.
పోలింగ్‌స్టేషన్ గుర్తింపు ప్రక్రియను కూడా పూర్తిచేశారు. ఉన్నట్టుండి కేంద్ర ప్రభుత్వం తెలంగాణపై నిర్ణయం ప్రకటించడం.. సీమాంధ్రలో సమైక్య ఉద్యమం నేపథ్యంలో ఎన్నికల నిర్వహణపై ప్రభుత్వం వెనుకంజ వేసింది. దీంతో మునిసిపల్ ప్రత్యేకాధికారుల పాలనను మరో ఆర్నెళ్లు పొడిగిస్తూ ఉత్తర్వులు రావడంతో సర్వత్రా నిరాశ వ్యక్తమవుతోంది. రాష్టవిభజన నేపథ్యంలో ఆయా పార్టీల తరఫున మునిసిపల్ ఎన్నికల్లో చైర్మన్‌గిరీ కోసం లాబీయింగ్ జరుపుదామనుకుంటున్న ఆశావహులు ఎన్నికల నిర్వహణ ఎప్పుడో తెలియక తమ పార్టీ అధినేతలతో కలిసేందుకు వెనుకంజవేస్తున్నారు.
నిధుల కొరత
కాగా, మునిసిపల్ కౌన్సిల్ ఉంటేనే కేంద్ర ప్రభుత్వం నిధులు మంజూరుచేస్తోంది. మూడేళ్లుగా కౌన్సిల్ లేని కారణంగా ఏటా మునిసిపాలిటీలకు వచ్చే 13వ ఆర్థిక సంఘం నిధులు పూర్తిగా నిలిచిపోయాయి. ఇవి మహబూబ్‌నగర్ మునిసిపాలిటీకి అయితే ఏటా రూ.మూడు కోట్ల నుంచి రూ.ఆరుకోట్ల వరకు వస్తాయి.
ఇతర మునిసిపాలిటీలకైతే రూ.రెండు కోట్ల నుంచి రూ.నాలుగు కోట్ల వరకు నిధులు మంజూరవుతాయి. వీటిని పారిశుధ్యం, తాగునీటి సమస్య తీర్చడం, ఇతర అభివృద్ధి పనులకు వినియోగిస్తారు. కౌన్సిల్ హయాంలో డ్రైనేజీలు, రోడ్ల కోసం మంజూరయ్యే ప్రత్యేకనిధులు ఇప్పుడు జాడేలేవు. దీంతో ప్రత్యేకాధికారుల పాలనలో ఎక్కడి పనులు అక్కడే తిష్టవేశాయి. డ్రైనేజీ, రోడ్లు, పారిశుధ్య పనులు లోపించడంతో మునిసిపాలిటీల పరిస్థితి అధ్వానంగా మారింది. సమస్యలను పరిష్కరించేందుకు ప్రత్యేకాధికారులు కూడా తగినచొరవ చూపకపోవడంతో సమస్యలు రోజురోజుకూ పెరుకుపోతున్నాయి.
‘ప్రత్యేక’ అధికారులు వీరే..
మహబూబ్‌నగర్ మునిపిపాలిటీకి కలెక్టర్ ఎం.గిరిజాశంకర్ ప్రత్యేక అధికారిగా వ్యవహరిస్తారు. షాద్‌నగర్, కల్వకుర్తి, జడ్చర్లలకు మహబూబ్‌నగర్ ఆర్డీఓ హన్మంత్‌రావు, నాగర్‌కర్నూల్, అచ్చంపేట, కొల్లాపూర్‌లకు నాగర్ కర్నూల్ ఆర్డీఓ కీన్యానాయక్, గద్వాల, అయిజ మునిసిపాలిటీలకు గద్వాల ఆర్డీఓ నారాయణరెడ్డి, వనపర్తి మునిసిపాలిటీకి ఆర్డీఓ వెంకటేశ్వర్లు, నారాయణపేటకు ఆర్డీఓ యాస్మిన్‌బాష ప్రత్యేకాధికారులుగా వ్యవహరిస్తున్నారు.
పుర‘పోరు’ లేనట్లే!
Published Mon, Sep 30 2013 4:22 AM | Last Updated on Fri, Nov 9 2018 5:52 PM
Advertisement