ఉపాధి చతికిల | Employment slowed | Sakshi
Sakshi News home page

ఉపాధి చతికిల

Published Tue, Oct 14 2014 1:50 AM | Last Updated on Sat, Sep 2 2017 2:47 PM

ఉపాధి చతికిల

ఉపాధి చతికిల

అనంతపురం సప్తగిరిసర్కిల్ :
 ఉపాధి హామీ పథకం అమలు ‘అనంత'లో చతికిల పడింది. ఫినో కంపెనీ ద్వారా బిల్లులు చెల్లింపు చేస్తున్న యాక్సిస్ బ్యాంకును బాధ్యతల నుంచి తొలగించడంతో కూలీలకు రూ.6 కోట్ల వరకు బిల్లులు పెండింగ్ పడ్డాయి. రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న ఆనాలోచిత నిర్ణయాలు కూలీలకు భరోసా ఇవ్వలేకపోతున్నాయి. జిల్లాలో 7,65,556 కుటుంబాలకు జాబ్‌కార్డులు ఉన్నాయి.

వాటి కింద 18,55,222 మంది కూలీలు నమోదు చేసుకున్నారు. అయితే ఈ ఏడాది వర్షాలు లేక వ్యవసాయ పంటలు సాగులోకి రాక వ్యవసాయ కూలీలు, పేదల పరిస్థితి దారుణంగా ఉంది. ఈ క్రమంలో ఉపాధిహామీ ద్వారా పెద్ద ఎత్తున పనులు కల్పించాల్సి ఉండగా ఆ దిశగా చర్యలు చేపట్టడంలో అధికార యంత్రాంగం విఫలమవుతోంది. ఈ ఏడాది 206 కోట్లు పనిదినాలు కల్పించి రూ.550 కోట్లు విలువైన ఉపాధి పనులు చేపట్టాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. కానీ... ప్రభుత్వం మారడం, రాజకీయ జోక్యంతో ఫీల్డ్ అసిస్టెంట్లను తొలగిస్తూ గందరగోళ పరిస్థితులు ఏర్పడేలా చేయడంతో ఉపాధి పథకం అమలు అస్తవ్యస్తంగా మారింది.

రోజూ 30 వేల మంది పనులు కావాలని డిమాండ్ చేస్తుండగా 3 వేల లోపు మందికి కూడా ఉపాధి కల్పించలేకపోతున్నారు. జిల్లాలోని 1006 గ్రామ పంచాయతీలుండగా రోజుకు 150 గ్రామ పంచాయతీల్లో మాత్రమే అరకొరగా ఉపాధి పనులు జరుగుతున్నట్లు నివేదికలు వెల్లడిస్తున్నాయి. గుత్తి, ళ్యాణదుర్గం, మడకశిర, రాయదుర్గం, తాడిపత్రి, ఉరవకొండ క్లస్టర్ల పరిధిలో ఉపాధి కల్పన మరీ ఘోరంగా తయారైంది. ఇలా చేసిన అరకొర పనులకు కూడా సకాలంలో బిల్లులు చెల్లించని పరిస్థితి నెలకొంది.

ఈ ఏడాది ఇప్పటివరకు 106 లక్షల పనిదినాలు కల్పించగా అందులో 2,29,144 కుటుంబాలకు చెందిన 4,08,772 మంది కూలీలకు పనులు కల్పించగా అందులో 18,729 కుటుంబాలకు మాత్రమే వంద రోజుల పాటు పనిదినాలు కల్పించారు. మొత్తమ్మీద రూ.200 కోట్లు విలువైన ఉపాధి హామీ పనులు చేపట్టారు.
 ప్రత్యామ్నాయం లేకుండానే యాక్సిస్ బ్యాంకు బాధ్యతల తొలగింపు ఎలాంటి ప్రత్యామ్నాయ మార్గాలు అన్వేషించకుండానే ఉపాధి హామీ పనులు బిల్లుల చెల్లింపునకు సంబంధించి నోడల్ బ్యాంకుగా ఉన్న యాక్సిస్ బ్యాంకును బాధ్యతల నుంచి తొలగించడంతో కూలీల పరిస్థితి దయనీయంగా తయారైంది.

ఈ నెల ఒకటో తేదీ నుంచి కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం వల్ల వేలాది మంది కూలీలకు చేసిన పనులకు బిల్లులు ఆగిపోయాయి. ఫినో కంపెనీ ద్వారా యాక్సిస్‌బ్యాంకు కూలీలకు డబ్బు చెల్లింపులు చేస్తూవస్తోంది. ఉన్నఫలంగా తొలగించడం వల్ల ఇబ్బందులు నెలకొన్నాయి. అంతేకాకుండా యాక్సిస్ బ్యాంకుల్లో 25 వేల మంది కూలీలకు సంబంధించి రూ.2.55 కోట్లు వరకు నిధులు నిల్వ ఉన్నట్లు చెబుతున్నారు.

ఉపాధిహామీ పథకంతో పాటు సమగ్ర వాటర్‌షెడ్ యాజమాన్య కార్యక్రమం (ఐడడబ్ల్యూఎంపీ) కింద చేపట్టిన పనులతో పాటు బ్యాంకుల్లో నిల్వ ఉన్న నిధులను పరిగణనలోకి తీసుకుంటే సుమారుగా రూ.10 కోట్ల వరకు బిల్లులు చెల్లింపులు నిలిచిపోయినట్లు డ్వామా కార్యాలయ వర్గాలు చెబుతున్నాయి. ఉపాధి బిల్లుల చెల్లింపులు మళ్లీ తపాలా శాఖకు అప్పగిస్తూ రెండు రోజుల కిందట ఉత్తర్వులు జారీ అయ్యాయి.

 ఎంపీడీఓలకు కీలక బాధ్యతలు
 ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం ఉపాధి హామీ పథకంలో మండల స్థాయిలో ఎంపీడీఓలు, గ్రామ స్థాయిలో గ్రామ కార్యదర్శులకు కీలక బాధ్యతలు అప్పజెబుతూ గత నెల చివరి వారంలో జీఓ విడుదల చేసింది. అయితే విధి విధానాలకు సంబంధించి ఎలాంటి ఉత్తర్వులూ వెలువడకపోవడంతో పథకం అమలు చేయడానికి ఎంపీడీఓలు రంగంలోకి దిగిన దాఖలాలు కనిపించలేదు.

ఎట్టకేలకు ఉపాధిహామీ తాళాలు ఎంపీడీవోలకు అప్పజెబుతూ గత గురువారం రాష్ట్ర గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్ నుంచి ఆదేశాలు వచ్చాయి. పథకం అమలులో డిజిటల్ సిగ్నేచర్ కీ (డీఎస్‌కే) ఎంపీడీఓలకు అప్పజెబుతూ ఉత్తర్వులు రావడంతో ఇక రంగంలోకి దిగడం తరువాయిగా మారింది. ఇపుడున్న పరిస్థితుల్లో ఓ వైపు విరివిగా ఉపాధిహామీ పనులు చూపించడంతో పాటు పెండింగ్ బిల్లులు త్వరిగతిన కూలీలకు చెల్లించాల్సిన పరిస్థితి నెలకొంది. ఆ దిశగా చర్యలు తీసుకుంటే తప్ప ఉపాధి హామీ పథకం మళ్లీ గాడిలో పడే పరిస్థితి కనిపించడం లేదు.

 జన్మభూమి తరువాత ఎంపీడీవోలకు బాధ్యతలు  
 జన్మభూమి-మావూరు కార్యక్రమం ముగిసిన తరువాత ఎంపీడీవోలు ఉపాధిహామీ పథకం బాధ్యతలు చేపట్టే అవకాశం ఉందని డ్వామా ఇన్‌చార్జి పీడీ ఎ.నాగభూషణం తెలిపారు. డీఎస్‌కేలు ఎంపీడీవోలకు అప్పజెప్పాలని ఉత్తర్వులు వచ్చాయన్నారు. దానికి సంబంధించి వెంటనే కలెక్టర్‌కు ఫైలు పంపుతామన్నారు. ఇపుడున్న పరిస్థితుల్లో జన్మభూమి తరువాత ఎంపీడీఓలు రంగంలోకి దిగే పరిస్థితి ఉందన్నారు.

 యాక్సిస్‌బ్యాంకును తొలగించడం వల్ల రూ.3 కోట్లకు పైగా ఉపాధి బిల్లులు ఆగిపోయినందన ప్రత్యామ్నాయ మార్గాలు ఆలోచిస్తున్నట్లు తెలిపారు. ఉపాధి బిల్లుల చెల్లింపులు ఇక నుంచి తపాలాశాఖ నోడల్ ఏజెన్సీగా ఏపీ ఆన్‌లైన్ సర్వీసు ప్రొవైడర్‌గా పనిచేస్తాయన్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement