బిచ్కుంద, న్యూస్‌లైన్ : నాందేడ్-సంగారెడ్డి ప్రధాన రహదారిపై జుక్కల్ చౌరస్తా వద్ద ఆదివారం రాత్రి జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం తీవ్ర విషాదాన్ని నింపింది. ఒకే ప్రమాదంలో ఐదుగురు మరణించడంతో స్థానికులు కలత చెందారు. బంధువులు శోకసంద్రంలో మునిగిపోయారు. క్షతగాత్రులకు చికిత్సనందిస్తున్న ఆస్పత్రుల వద్ద రోదనలు మిన్నంటాయి. బిచ్కుంద మండలం పెద్ద కొడప్‌గల్ నుంచి మద్నూర్‌వైపు ప్రయాణికులతో వస్తున్న ఆటో బోల్తా పడడంతో ఈ ప్రమాదం సంభవించింది. ఈ దుర్ఘటన నాలుగు కుటుంబాలలో తీరని శోకాన్ని తెచ్చి పెట్టింది.
బిచ్కుంద మండలంలోని గోపన్‌పల్లికి చెందిన రాజు (34), వెంకట్ లు కలిసి ఆదివారం నిజాంసాగర్ మండలంలోని మహ్మద్‌నగర్ వెళ్లారు. అక్కడ శుభకార్యంలో పాల్గొన్నారు. అనంతరం రాత్రి ఆటోలో స్వగ్రామానికి తిరుగు ప్రయాణమయ్యారు. ఆటో బోల్తా పడడంతో రాజు మృత్యువాత పడగా, వెంకట్ గాయాలపాలయ్యారు. మద్నూ ర్ మండలం లక్ష్మాపూర్ గ్రామానికి చెందిన లక్ష్మీబాయి(38), గంగవ్వ(36), మొగ గ్రామానికి చెందిన బస్వంత్(32) తన కూతురు అనుష్క(2)ను తీసుకొని పెద్దకొడప్‌గల్‌లోని సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల పాఠశాలకు వెళ్లారు.
పిల్లలను చూసి, ఆటోలో స్వగ్రామాలకు పయనమయ్యారు. అంతలోనే ప్రమాదం ముంచుకువచ్చి, అనంతలోకాలకు చేరారు. ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన తొమ్మిది మందిని చికిత్స నిమిత్తం బిచ్కుంద, బాన్సువాడ, జిల్లా కేంద్ర ఆస్పత్రులకు తరలించారు.
ఆస్పత్రిలో అందని వైద్యం
బిచ్కుంద ప్రభుత్వ ఆస్పత్రిలో వైద్యుడు లేకపోవడంతో గాయపడినవారికి వైద్యం అందలేదు. స్థానిక ఆర్‌ఎంపీలు, పీఎంపీలు వచ్చి ప్రథమ చికిత్స అందించారు. వైద్యం అందక క్షతగాత్రుల అరుపులు, కేకలతో ఆస్పత్రి ఆవరణ దద్దరిల్లింది. రోదనలు చూసి స్థానికులు చలించిపోయారు.
ఆందోళనకు దిగిన స్థానికులు
ఆస్పత్రిలో క్షతగాత్రులకు సరైన వైద్యం అందకపోవడంతో స్థానికులు ఆందోళనకు దిగారు. ఆస్పత్రిలోకి దూసుకెళ్లేందుకు ప్రయత్నించడంతో పోలీసులు వారిని అడ్డుకున్నారు. దీంతో ఆగ్రహించిన స్థానికులు, మృతుల కుటుంబ సభ్యులు ఆస్పత్రి ఎదుట బైఠాయించి ధర్నా చేశారు. మృతుల కుంటుంబాలకు రూ. 10 లక్షల ఎక్స్‌గ్రేషియా అందించాలని డిమాండ్ చేశారు. బాన్సువాడలో కాకుండా బిచ్కుందలోనే పోస్టుమార్టం చేయాలని పట్టుబట్టారు. తహశీల్దార్ రామారావు, సీఐ వెంకటేశం వారికి నచ్చజెప్పారు. బిచ్కుందలోనే పోస్టుమార్టం జరిగేలా చూస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు.
అంతులేని శోకం
Published Mon, Feb 10 2014 3:06 AM | Last Updated on Thu, Aug 30 2018 3:56 PM
Advertisement