ఆ కిరణాలతోనే వడదెబ్బ మరణాలు
అతినీలలోహిత కిరణాల వల్లే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో వడదెబ్బతో మృతుల సంఖ్య పెరుగుతోందని ప్రపంచ వాతావరణ సంస్థ (డబ్ల్యూఎంవో) స్పష్టం చేసింది. డబ్ల్యూఎంవో విడుదల చేసిన ఆల్ట్రా వయొలెట్ (యూవీ) రేడియేషన్ ఇండెక్స్ లో.. భారత దేశంలోని ఈ రెండు రాష్ట్రాల్లో తీవ్రత 12 గా నమోదైంది. యూవీ ఇండెక్స్ 12 దాటడం మానవ శరీరానికి తీవ్ర హాని కలిగిస్తుందని, ఇంత తీవ్రతతో వచ్చే అతినీల లోహిత కిరణాల వల్ల వడదెబ్బ తగిలి మృతి చెందడమే కాకుండా చర్మ కేన్సర్ వచ్చే అవకాశాలు ఉన్నాయని తెలిపింది. ఈ రేడియేషన్ తీవ్రత మధ్యాహ్నం 12 నుంచి 3 గంటల మధ్య ఎక్కువగానూ, ముఖ్యంగా ఒంటి గంట ప్రాంతంలో అత్యధికంగా నమోదవుతోందని పేర్కొంది. సాయంత్రం నాలుగు గంటల తర్వాత మాత్రమే రేడియేషన్ తీవ్రత తగ్గుముఖం పడుతున్నట్లు తెలిపింది.
ఎండలో బయటకు వెళ్లాల్సి వస్తే చర్మరక్షణ కోసం సన్ స్క్రీన్స్ ఉపయోగించడం, కూలింగ్ గ్లాసెస్ ధరించడం, శరీరం డీహైడ్రేషన్‌కు గురికాకుండా ఉండటానికి ఎక్కువగా ద్రవ పదార్థాలు తీసుకోవడం మంచిదని వైద్యనిపుణులు సూచిస్తున్నారు.