
ఓటుకు నోటు ఆపరేషన్ సాగిన తీరిదీ..
హైదరాబాద్: ఓటుకు నోటు వ్యవహారంలో తెలంగాణ టీడీపీ ఎమ్మెల్యే రేవంత్రెడ్డి నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్ సన్ మధ్య జరిగిన వ్యవహారం మొత్తం ఎలా సాగింది.. ఈ అపరేషన్లో స్టీఫెన్ను రేవంత్ ఎప్పుడు ఎలా కలిశారు... చంద్రబాబుతో ఎప్పుడు మాట్లాడించారు.. ఈ తతంగం ఎలా సాగిందో ఒకసారి చూద్దాం...
రేవంత్ తనను బాసే ఆథరైజ్ చేసి పంపించాడంటూ స్టీఫెన్తో చెప్పారు. అంతేకాక తనకు ఇచ్చిన అప్పర్ లిమిట్ ఇచ్చింది 'రెండున్నర' అని చెప్పారు. దాంతో తాము ముగ్గురిని కలిసి మూడు ఇచ్చామన్నారు. ఈ విషయం తమకు కూడా తెలియాల్సిన పని లేదని, మీరే డైరెక్ట్గా సార్తో మాట్లాడుకోవచ్చని చెప్పారు. దానికీ స్టీఫెన్.. సార్ ఎప్పుడు కలుస్తారని అడగడంతో.. రేవంత్ 'ఇప్పుడే ఫోన్లో మాట్లాడిస్తా' అని చెప్పారు. ఇక్కడ ఏదైనా సమస్య అనుకుంటే.. మీరు ఎక్కడ కోరుకుంటే అక్కడే ఇస్తాము.. ఇదే విషయాన్ని సార్తో చెబుతానన్నాడు.
ఇంతలో చంద్రబాబు తరపు మనిషి ఫోన్లో స్టీఫెన్సన్తో మాట్లాడారు. 'హలో బ్రదర్ బాబుగారు మీతో మాట్లాడుతారు.. లైన్లో ఉండండి' అన్నాడు. చంద్రబాబు ఫోన్లో స్టీఫెన్తో ఫోన్లో ఇలా మాట్లాడారు... హాలో..బ్రదర్.. మనవాళ్లు నాకంతా వివరించారు. మీకు అండగా నేను ఉంటా...! కంగారు పడాల్సిందేమీ లేదని హామీ ఇచ్చారు. అన్నింటికి మీకు నేను అండగా ఉంటా.. వాళ్లు మీతో మాట్లాడినవన్నీ నెరవేరుస్తామన్నారు. మీరు స్వేచ్ఛగా నిర్ణయం తీసుకోండి... ఎలాంటి సమస్య ఉండదు..అది మా హామీ... మనం కలిసి పనిచేద్దామని స్టీఫెన్కు చంద్రబాబు హామీ ఇచ్చారు.